ఆగని భూకబ్జాల పర్వం

ABN , First Publish Date - 2022-06-08T05:24:14+05:30 IST

ఆగని భూకబ్జాల పర్వం

ఆగని భూకబ్జాల పర్వం

ప్రజాప్రతినిధుల అండదండలతో కబ్జాదారుల హవా

వివాదం సృష్టించి తక్కువ ధరకే లాక్కుంటున్న వైనం

లోపాయికారిగా వత్తాసు పలుకుతున్న పోలీసులు


వరంగల్‌ క్రైం, జూన్‌ 7 : రియల్‌ మాఫియా ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. నగర శివార్లలో భూముల ధరలకు రెక్కలురావడంతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరిట రికార్డులు మార్చి భూములు కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధులు అండదండలు, కొంతమంది పోలీస్‌ అఽధికారుల సహకారంతో అమాయక జనంపై జులుం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లీడర్లు తమ అనుచరులను క్లియర్‌ టైటిల్‌ కలిగిన భూములకు మీదకు పంపి సమస్యలు స్పష్టిస్తున్నారు. తర్వాత బాధితులను తమ వద్దకు రప్పించుకుని రాజీ పేరిట తక్కువ ధరలకే భూములను కొనుగోలు చేస్తున్నారు. అంతేగాకుండా రౌడీషీటర్లు సైతం రియల్టర్లుగా చెలామణి అవుతూ విలువైన భూములను కొల్లగొడుతూ సొమ్ముచేసుకుంటున్నారు.  న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరిగి వేసారిన  బాధితులు చేసేదేమీ లేక కబ్జారాయుళ్లతో రాజీపడాల్సిన దుస్థితి నెలకొంది.


ధరలు పెరగడంతో...

వరంగల్‌ నగరానికి సమీపంలోని గీసుగొండ, మామూనూరు ప్రాంతాల్లో కొంతకాలంగా భూ ధరలు అమాంతంగా పెరిగాయి. ఆయా మండలాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది.   అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని వ్యాపారంగా చేసుకున్నారు. కావాలనే భూములను వివాదాల్లోకి నెట్టడం, తమ అనుమతి లేకుండా భూములు కొనుగోలు చేయొద్దని హుకుం జారీ చేయడంలాంటి చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజా ప్రతినిఽధులను కాదని ఎవరైనా భూములు కొనుగోలు చేసినా, వెంచర్లు చేసే ప్రయత్నం చేసినా అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం. 

అంతే గాకుండా నకిలీ పత్రాలు సృష్టించి వివాదాస్పద భూములను కొనుగోలు చేసి తమ అనుచరులను రంగంలోకి దింపి కబ్జాలకు పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు సైతం పెద్ద సంఖ్యలో భూదందాలకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరికితోడు అధికార పార్టీలో చేరిన కొంతమంది రౌడీషీటర్లు సైతం భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ భూములను దక్కించుకునేందుకు గాడ్‌ఫాదర్‌లుగా చెప్పుకునే నేతలను ఆశ్రయించి పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. నాయకుల సిఫార్స్‌ లేఖలతో పోస్టింగ్‌లు దక్కించుకున్న పోలీసు అధికారులు చెప్పిన మాటకల్లా తలాడిస్తున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. 


భూ తగాదాల్లో పోలీస్‌ జోక్యం 

సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరాదని చట్టాలు చెబుతున్నాయి. కానీ  కొందరు అధికారులు ఆదాయాన్ని పెంచుకునేందుకు భూ తగాదాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కోర్టు ఆదేశాలను సైతం పక్కన పెడుతూ కబ్జారాయుళ్లకు వత్తాసు పలికిన ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. కొద్దినెలల కిందట కొంతమంది అధికారులు సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు.  అయినా కొంతమంది అధికారుల్లో ఏ మాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది.  ప్రజాప్రతినిధుల సపోర్ట్‌ ఉందనే ధీమాతో పాత పద్ధతినే అవలంబిభిస్తున్నట్లు సమాచారం.  కొందరు అధికారులు మరో అడుగు ముందుకేసి ఏకంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 


లీడర్ల కబ్జాల పర్వం....

ఇటీవల దేశాయిపేట రోడ్‌లోని నవయుగ కాలనీలో పార్క్‌ కోసం కేటాయించిన లే అవుట్‌ స్థలాన్ని స్థానిక లీడర్‌ కబ్జాకు యత్నించాడు. మునిసిపల్‌ అధికారుల సహకారంతో ఆ స్థలంలో గదిని నిర్మాణం చేసి ఇంటి నెంబర్‌ సైతం పొందాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆ లీడర్‌ కబ్జాను అడ్డుకుని నిర్మాణాలను కూల్చివేశారు. 

ఇటీవల అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతానికి చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌ నకిలీ పత్రాలు సృష్టించి ఉర్సు గుట్ట సమీపంలో ప్లాట్‌ను కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే వారు కోర్టును ఆశ్రయించడంతో మాజీ నాయకుడి క బ్జా పర్వానికి తెరపడింది. 

గీసుగొండ మండలం గొర్రెకుంట శివారులో ముస్లింలకు చెందిన స్థలవివాదంలో అధికార పార్టీకి చెందిన నేతలు తలదూర్చారు. నకిలీ పత్రాలు స్పష్టించి వారి భూమిని ఆక్రమించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రజలు ఎదురు తిరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ వివాదంతో మానసిక ఒత్తిడికి లోనైన బాధితుడు అనారోగ్యంతో మృతిచెందారు. 

ఏడాదిన్నర క్రితం గీసుగొండ మండలం కొనాయమాకులకు చెందిన ఓ వ్యక్తికి చెందిన కోట్లాది రూపాయల భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించుకున్నారు. అసలు హక్కుదారుడికి కొంత నగదు ముట్టచెప్పి ఆ భూమిని వేరే వాళ్లకు విక్రయించి కోట్లు గడించారు. 

కాశిబుగ్గలో స్థానిక ప్రజా ప్రతినిధి తన అనుచరులతో భూదందాలు నిర్వహిస్తున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన అనుచరులు ఖాళీ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. రాజీ పేరిట తన బాస్‌ వద్ద పంచాయితీ పెట్టి లక్షలు వెనకేసుకుంటున్నారు.

Read more