కేసీఆర్‌ అవినీతిని బయటపెడతాం

ABN , First Publish Date - 2022-09-26T08:53:34+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అవినీతి బాగా పెరిగిపోయిందని, కేసీఆర్‌ అవినీతిని త్వరలోనే బయటపెడతామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు.

కేసీఆర్‌ అవినీతిని బయటపెడతాం

  • రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది
  • కేసీఆర్‌ పాలనతో ప్రజలు విసిగిపోయారు
  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి
  • కేసీఆర్‌ ఆస్తులపై ప్రశ్నిస్తే దాడులు: లక్ష్మణ్‌

నార్సింగ్‌/శంషాబాద్‌/నల్లగొండ/రామగిరి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అవినీతి బాగా పెరిగిపోయిందని, కేసీఆర్‌ అవినీతిని త్వరలోనే బయటపెడతామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. కేసీఆర్‌ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని మణికొండలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మణికొండ క్వార్టర్స్‌లోని దళిత కార్యకర్త వినోద్‌ ఇంట్లో అల్పాహారం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, ముఖ్యంగా దళితులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ సీనియర్‌ నాయకుడు నాగేశ్‌ కుటుంబసభ్యులను ప్రహ్లాద్‌ జోషి పరామర్శించారు. నాగేశ్‌ గతంలో మణికొండ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఆయన భార్య వందన ప్రస్తుతం మణికొండ కౌన్సిలర్‌గా ఉన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని బండ్లగూడలో ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నార్సింగ్‌ పాఠశాలలో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 106వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. దీన్‌దయాళ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌, రాష్ట్ర బీజేపీ నేత బుక్క వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు తెలంగాణ ప్రభుత్వం పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటోందని ప్రహ్లాద్‌ జోషి ఆరోపించారు. ఈ అంశంలో బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. 


వేలకోట్లకు పడగలెత్తిన కేసీఆర్‌: లక్ష్మణ్‌

సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న ఆస్తులతో పోలిస్తే ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగాయని, వేల కోట్లకు పడగలెత్తారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ఆస్తుల గురించి ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని, వాళ్ల గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ అన్ని ఒకే గూటి పక్షులని, అవినీతి పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. మునుగోడులో టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.

Read more