మాది తెలంగాణ.. ఎలా పోరాడాలో మాకు తెలుసు

ABN , First Publish Date - 2022-09-10T08:27:12+05:30 IST

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. తాము తెలంగాణ వాళ్లమని, ఎలా పోరాడాలో తమకు తెలుసునని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు.

మాది తెలంగాణ.. ఎలా పోరాడాలో మాకు తెలుసు

కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. తాము తెలంగాణ వాళ్లమని, ఎలా పోరాడాలో తమకు తెలుసునని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. బల్క్‌ డ్రగ్‌ పార్కును రాష్ట్రానికి కేటాయించకపోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ఇటీవల చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ శుక్రవారం స్పందించారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపెట్టినా.. తమ విజయాలను, స్ఫూర్తిని మాత్రం అడ్డుకోలేదన్నారు. రాష్ట్రానికి కేటాయించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసినా గత ఎనిమిదేళ్లలో ఐటీ రంగంలో మూడింతల వృద్ధి సాధించామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోయినా నిర్మాణం పూర్తి చేసుకున్నామని, మిషన్‌ భగీరథకు చేయూత ఇవ్వకపోయినా వందశాతం ఇండ్లకు నల్లా నీరు అందించి దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచామన్నారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోలేరని, అసమానతలకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో, కలలను ఎలా నెరవేర్చుకోవాలో తమకు తెలుసునని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Read more