యాసంగికి సన్నద్ధం

ABN , First Publish Date - 2022-11-24T00:03:50+05:30 IST

యాసంగి సాగుకు అన్నదాతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరి కోతలు పూర్తవుతోండటంతో దుక్కులను సిద్ధం చేస్తున్నారు. చేను, చెలకల్లో ఉన్న గత పంటల గ్రాసాన్ని అక్కడికక్కడే గతులబెడుతూ చేనుకు చేవ తీసుకొచ్చేందుకు ఉపక్రమిస్తున్నారు.

యాసంగికి సన్నద్ధం

దుక్కులు పొతం చేస్తున్న రైతులు

జిల్లాలో 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

మొక్కజొన్న, కూరగాయలు చిరుధాన్యాల పంటలకే మొగ్గు

వరంగల్‌ సిటీ, నవంబరు 23 : యాసంగి సాగుకు అన్నదాతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరి కోతలు పూర్తవుతోండటంతో దుక్కులను సిద్ధం చేస్తున్నారు. చేను, చెలకల్లో ఉన్న గత పంటల గ్రాసాన్ని అక్కడికక్కడే గతులబెడుతూ చేనుకు చేవ తీసుకొచ్చేందుకు ఉపక్రమిస్తున్నారు. వానాకాలంలో వర్షాలు విస్తారంగా కురిసి కొంత మేరకు పంటలు నష్టపోయిన రైతులు యాసంగి సాగుకు అనుకూలంగా ఉం డే పంటలను వేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.

దుక్కులు దున్నుతూ విత్తనాలు విత్తేందుకు నేలను తయారు చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులు వాతావరణ శాస్త్రవేత్తల సూచనలతో ఆరుగాలం కష్టపడి అధిక దిగుబడి సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తన దుకాణాల్లో విత్తనాలు, విత్తే సమయంలో కావాల్సిన మందులను రైతులు కొనుగోలు చేస్తున్నారు.

వ్యవసాయ శాఖాధికారులు జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటల సాగు కోసం అంచనాలను తయారు చేశారు. సాగు అంచనాలకు అనుగుణంగా జిల్లాలో విత్తనాలు, మందులను అం దుబాటులో ఉంచేందుకు వారు కృషి చేస్తున్నారు. ఎండా కాలం వ్యవసాయం కావడంతో అయితే తక్కువ నీటిని వినియోగించే మొక్కజొన్న, కూరగాయలు తదితర పం టల సాగుకే రైతులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇప్పటికే పనుల ప్రారంభం..

జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయనుకూల భూముల్లో ఇప్పటికే రైతులు పనులను ప్రారంభించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిపంటను తీసి వేస్తూ దుక్కులను సిద్ధం చేసే పనిలో పడ్డారు. బోరు బావుల్లో నీరు ఉన్న రైతులు దుక్కులను తడి చేస్తూ సాగుకు అనుకూలం చేస్తున్నారు. గతంలో వరి, పత్తి, మిర్చీ, కంది, మొక్కజొన్న తదితర పంటలను వేసిన రైతులను వాటి తాలుకూ మిగులు గ్రాసాన్ని చెలకల్లోనే తగులబెడుతున్నారు. నాగళ్లు, ట్రాక్టర్లతో దున్నుతూ, డోజర్లతో చదును చేస్తూ దుక్కులను తడుపుతూ విత్తనాలను విత్తేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. నారు వేసేందుకు బోరు బావుల కింద మడులను సిద్ధం చేసుకుంటున్నారు.

జోరందుకున్న విత్తనాల కొనుగోళ్లు..

దుక్కులు సిద్ధం చేసుకుంటూనే మార్కెట్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విత్తనాల కోసం అన్వేషిస్తున్నా రు. అధిక దిగుబడి, చీడపీడలను ఆశించని వంగడాలు ఇచ్చే విత్తనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత సంవత్సరం విత్తనాలు కొని అధిక దిగుబడి రాక నష్టపోయిన రైతులు ఆచితూచి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలను అమ్ముతూ రైతులను దగా చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న వ్యవసాయ శాఖాధికారుల సూచనలతో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

ఆరుతడి పంటలకే మొగ్గు..

యాసంగి సాగుకు ఆరుతడి పంటలపై రైతులు మక్కువ చూపుతున్నారు. మోటారు బావులున్న రైతులు సైతం కూరగాయల సేద్యం చేసేందుకు ఇష్టపడుతున్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ ఉన్న రైతులు ఎక్కువగా చిరుధాన్యాల పంటలను పండిచేందుకు వారి చెలకలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధం చేసి విత్తనాలు వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. శనగ, పల్లి, నువ్వులు, మినుములు, కంది, చిక్కుడు, జొన్న తదితర పంటలను వేసేందుకు రైతులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

1,93,769 ఎకరాల విస్తీర్ణంలో సాగు

యాసంగిలో వరంగల్‌ జిల్లా వ్యాప్తం గా రైతులు 1,93,769 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగు చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖాధికారులు అంచనాలు తయారు చేశారు. ఇందు కోసం కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే జిల్లాలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు వారు చెబుతున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 55 క్లస్టర్ల వారిగా సాగు వివరాలు అందుకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల అంచనాలు సిద్ధం చేసి ఉంచారు.

Updated Date - 2022-11-24T00:03:56+05:30 IST

Read more