గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-12-13T23:58:59+05:30 IST

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ శివలింగయ్య సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అధిక నిధులు విడుదల చేస్తోందన్నారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి
వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శివలింగయ్య

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

జనగామ టౌన్‌, డిసెంబరు 13: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ శివలింగయ్య సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటూ అధిక నిధులు విడుదల చేస్తోందన్నారు. ప్రతీ వీధిలో ఎల్‌ఈడీ బల్బులు బిగించనున్నట్లు తెలిపారు. ‘రెడ్కో’ నిబంధనల ప్రకారం బల్బులు సరఫరా చేసి ఈ నెల 20 లోపు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పనులపై ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, విద్యుత్‌ ఎస్‌ఈ వేణుమాధవ్‌, డీపీవో వసంత, డీఎల్‌పీవో పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.

దళితబంధుపై రివ్యూ..

జిల్లాలో 185 దళితబంధు యూనిట్లు మంజూరు చేశామని, ఇందులో లబ్ధిదారులు 90 శాతం గ్రౌండింగ్‌ పనులు పూర్తిచేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని కలెక్టర్‌ చెప్పారు. దళితబంధుపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. పాడి పరిశ్రమకు సంబంధించిన యూనిట్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఆక్టర్‌ వెంకన్న, డీపీవో వసంత, డీఏవో వినోద్‌కుమార్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ లత, ఇండస్ట్రీస్‌ జీఎం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోషణ లోపం లేకుండా చూడాలి..

పిల్లల్లో పోషణ లోపం లేకుండా చూడాలని కలెక్టర్‌ శివలింగయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. స్త్రీ, శిశు సంక్షేమ, ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో తీవ్ర లోప పోషణ పిల్లలు, 314 అతి తీవ్ర లోప పోషణ పిల్లలు 78 మంది ఉన్నారన్నారు. వీరికి ప్రతీ రోజు అరటిపండ్లు, నువ్వుల ఉండలు, పల్లిపట్టీలు, ఖర్జూర మొదలైనవి సూపర్వైజర్ల పర్యవేక్షణలో అందజేయాలని ఆదేశించారు. పోషణ లోపం ఉన్న పిల్లలను ఆరోగ్య శాఖ గుర్తించి సరైన వైద్య అందించాలన్నారు. వెల్ఫేర్‌ అధికారి జయంతి, డీఎంహెచ్‌వో మహేందర్‌, డీపీవో వసంత, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

పాఠశాల ఆకస్మిక తనిఖీ...

జనగామ పట్టణంలోని నెహ్రూనగర్‌ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద జరుగుతున్న పనులు, పాఠశాల ఆవరణ, తరగతి గదులు, డ్రెయినేజీ సిస్టంను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, డీఈవో కె.రాము ఉన్నారు.

Updated Date - 2022-12-13T23:59:06+05:30 IST