గ్యాంగ్‌మన్‌ల కష్టాలు తీరేదెన్నడో...?

ABN , First Publish Date - 2022-11-27T00:51:37+05:30 IST

: రైల్వేలో కీలకమైనది ఇంజనీరింగ్‌ నిర్వాహణ విభాగం. ఈ విభాగంలో రైల్వేట్రాక్‌ నిర్వహణ, విరిగిన, అరిగిపోయిన రైలు పట్టాలు మార్చ డం, పట్టాల కింద సరియైున పరిమాణంలో (బాలస్ట్‌) కంకర ఉందా.. లేదా ఇవన్నీ నిత్యం పర్యవేక్షణలో ఉంటాయి.

గ్యాంగ్‌మన్‌ల కష్టాలు తీరేదెన్నడో...?
డోర్నకల్‌ వద్ద రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు చేస్తున్న గ్యాంగ్‌మన్‌లు

ఏడు కిలోమీటర్ల మేర కాలినడకన...

టూల్‌ రూమ్‌లు లేక ఇక్కట్లు...

బూట్లు, రెయన్‌కోర్ట్‌లు అందించి... కారుణ్య నియామకాలు చేపట్టాలి...

డోర్నకల్‌, నవంబరు 26 : రైల్వేలో కీలకమైనది ఇంజనీరింగ్‌ నిర్వాహణ విభాగం. ఈ విభాగంలో రైల్వేట్రాక్‌ నిర్వహణ, విరిగిన, అరిగిపోయిన రైలు పట్టాలు మార్చ డం, పట్టాల కింద సరియైున పరిమాణంలో (బాలస్ట్‌) కంకర ఉందా.. లేదా ఇవన్నీ నిత్యం పర్యవేక్షణలో ఉంటాయి. ఇందులో కీలక పాత్ర వహించేది గ్యాంగ్‌మెన్‌లు. రోజు లక్షలాది మంది ప్రయాణికులు, కోట్లాది టన్నుల సరుకుల రవాణా నిరాటంకంగా జరుగుతుంది అంటే దాని వెనుక ఎందరో గ్యాంగ్‌మెన్‌ల నిరంతర కృషి ఉంటుంది. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన రైలు మార్గాలను, బ్రిడ్జిలను, ప్రమాదకరంగా ఉండే కల్వర్టులను పర్యవేక్షించేది కూడా ఈ గ్యాంగ్‌మెన్‌లే. ఇంతటి కీలకమైన పాత్ర పోషిస్తున్న గ్యాంగ్‌మెన్‌ల కష్టాలు మాత్రం ఏప్పటికి తీరడం లేదు. డోర్నకల్‌ జంక్షన్‌ పీడబ్ల్యూఐ సెక్షన్‌ పరిధిలో గతంలో 270 మంది గ్యాంగ్‌ మెన్‌లు ఉండేవారు. ప్రస్తుతం 220 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఉన్న ఉద్యోగులపైనే పనిభారం పడుతోంది. డోర్నకల్‌ నుంచి పాపటపల్లి, మల్లెమడుగు, ఖమ్మం స్టేషన్ల వరకు 30 కిలోమీటర్లు ఉన్న డబుల్‌ ట్రాక్‌లను, బ్రాంచ్‌లైన్‌లో భద్రాచలం రోడ్‌, డోర్నకల్‌ సెక్షన్‌ పరిధిలోని డోర్నకల్‌, పోచారం, కారేపల్లి, ఇల్లందు వరకు ఉన్న 26 కిలోమీటర్ల సింగిల్‌ ట్రాక్‌ను వీరే పర్యవేక్షిస్తుంటారు. భద్రాచలం రోడ్‌, డోర్నకల్‌ మధ్య ప్రతిరోజు ప్రయాణికులు ప్రయాణించే నాలుగు రైళ్లతో పాటు 40కి పైగా గూడ్స్‌ రైళ్లు, కాజీపేట, డోర్నకల్‌, విజయవాడ సెక్షన్‌ల మధ్య మరో 100 రైళ్లు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తుంటాయి. రైళ్ల రద్దీతో నిత్యం ఏదో ఒకచోట ట్రాక్‌ మరమ్మతు పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

రేడియం జాకెట్లు ఇవ్వాలి..

ట్రాకు నిర్వహణ పనితీరును ఇటీవల మెరుగుపడడంతో రైల్వేశాఖ ప్రస్తుతం రైళ్ల వేగాన్ని గంటకు 135 కిలోమీటర్లకు పెంచింది. దీంతో రైళ్లు పట్టాలపై వేగంగా వెళ్తున్నప్పుడు పట్టాల కింద ఉండే స్లీపర్ల కింద ఉన్న చాబీలు ఊడిపోతూ ఉంటాయి. వాటిని సరిచేస్తూ గ్యాంగ్‌మెన్‌లు వెళ్తారు. ఒక్కొ గ్యాంగ్‌మెన్‌ ఇలా తనకు నిర్ధేశించిన ఏడు కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వస్తూ ట్రాక్‌ను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్యాంగ్‌మెన్‌లు రైళ్లు ఢీకొని మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. గతంలో గ్యాంగ్‌మెన్‌లకు బూట్లు, డ్యూటీ డ్రెస్సులను అందించేవారు. కొద్దిరోజుల క్రితం వాటి సరఫరా నిలిపివేశారు. ఇటీవల కాలంలో రైల్వే యూనియన్లు వారి సమస్యలపై ఆందోళన చేయడంతో పాటు అధికారుల దృష్టికి పలుమార్లు వారి సమస్యలను తీసుకువెళ్లగా డ్యూటీ డ్రస్సులను అందించారు. బూట్లు ఆరు నెలలకు ఒకసారి అందించాల్సి ఉండగా సంవత్సరానికి ఒక జత మాత్రమే అందిస్తున్నారు. అవి నాసిరకంగా ఉంటున్నాయని కార్మికులు వాపోతున్నారు. అదేవిధంగా ఒంపు మార్గాలు, మూలమలుపుల వద్ద రైలు ప్రయాణించే సమయంలో రైలు డ్రైవర్లకు ట్రాక్‌ నిర్వహణ పనులు చేస్తున్న కార్మికులు కన్పించరు. సుమారు ఏడాదిన్నర క్రితం మహబూబాబాద్‌ సమీపంలో రైలు ఢీకొట్టడంతో రాజు, పాషా అనే ఇద్దరు గ్యాంగ్‌మెన్‌లు మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండ విధి నిర్వహణలో ఉన్న గ్యాంగ్‌మెన్‌లను రైలు డ్రైవర్లు గమనించే విధంగా వారికి రేడియం జాకెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.

నియామకాలు చేపట్టాలి...

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి గ్యాంగ్‌మెన్‌లు తమ వృత్తి ధర్మాన్ని నిర్వహించారు. భౌతికదూరం వీలుపడనందున ఎంతోమంది కార్మికులు కరోనా భారీన పడ్డారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు కోలుకున్నారు. వర్షంలో పనిచేసే కార్మికులు హైపోథెర్మియా భారీనపడి ఆస్పత్రి పాలయ్యారు. మృతిచెందిన వారి స్థానంలో కారుణ్య ని యామకాల కింద కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని గ్యాంగ్‌మెన్‌లు కోరుతున్నారు.

నదులు, వాగులపై ఇనుప గడ్డర్లతో నిర్మించిన పురాతన వంతెనలు కాలానుగుణంగా వచ్చే మార్పులకు లోనవుతాయి... వాటిని గ్యాంగ్‌మెన్‌లు 24 గంటలు కనిపెడుతూ.. ఉండాలి. అంతేకాకుండ గ్యాంగ్‌మెన్‌లు తమ వెంట తీసుకువెళ్లే పనిచేసే పనిముట్ల బరువు కూడా అధికంగా ఉంటుంది. వేసవికాలంలో తాగేందుకు నీటిని తీసుకువెళ్లడం అదనపు భారం అవుతుంది. ఇలా కీలకమైన రైల్వే ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న గ్యాంగ్‌మెన్‌, ట్రాక్‌మెన్‌ల కష్టాలను రైల్వే ఉన్నతాధికారులు సానుభూతితో ఆలోచించాలని కోరుతున్నారు.

విధి నిర్వహణ కత్తిమీద సామే..

గ్యాంగ్‌మన్‌లు తమ వస్తువులను భద్రపరుచుకోవడానికి వీలుగా యూనిట్‌కు ఒక టూల్‌ రూమ్‌(సామాన్లు భద్రపరుచుకునే గది)లు ఉండాలి. కానీ చాల చోట్ల టూల్‌ రూమ్‌లు లేవు. సమీపంలో ఉన్న గేట్‌ల వద్దకు వాటిని మోసుకుంటూ వెళ్లాలి. వర్షాకాలం, చలికాలం, వేసవికాలం ఏ కాలమైనా గ్యాంగ్‌మెన్‌ విధి నిర్వహణ కత్తిమీద సామే అవుతుంది. చలికాలంలో పట్టాలు సంకోచించడం వల్ల వాటిపై పగుళ్లు ఏర్పడి విరిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో వాటిని ఎప్పటికప్పుడు పసిగట్టడానికి గ్యాంగ్‌ మెన్‌లు, ట్రాక్‌మెన్‌లు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. వేసవికాలంలో రైలు పట్టాలు వ్యాకోచించిన సమయంలో స్లీపర్‌కు ఉండే నట్టుబోల్టులు ఊడిపోతూ ఉంటాయి. వాటిని కూడా సకాలంలో గుర్తించి సరిచేస్తుంటారు. వర్షాకాలంలో వరదలు సంభవించి నప్పుడు కల్వర్టుల వద్ద, బ్రిడ్జిల వద్ద నిత్యం కాపలాకాస్తూనే ఉండాలి. వర్షానికి తడవకుండ ఉండడం కోసం వారికి ఇవ్వాల్సిన రెయిన్‌కోట్లను కూడా రైల్వేశాఖ అందించడం లేదని కార్మికులు అంటున్నారు. దీంతో ఆయా సమయంలో వర్షానికి తడుస్తూనే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Updated Date - 2022-11-27T00:51:39+05:30 IST