బట్టల బ్రష్‌ తెచ్చిన తగాదా

ABN , First Publish Date - 2022-11-27T23:40:32+05:30 IST

బట్టలు ఉతికే బ్రష్‌ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ.. ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. తనను సీనియర్‌ విద్యార్థి మందలించాడని మనస్తాపం చెందిన జూనియర్‌ విద్యార్థి.. ఈ చర్యకు పూనుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో జరిగింది.

బట్టల బ్రష్‌ తెచ్చిన తగాదా
చికిత్స పొందుతున్న విద్యార్థి కిరణ్‌రాజ్‌

మడికొండలోని బాలుర గురుకుల పాఠశాలలో ఘటన

మడికొండ, నవంబరు 27: బట్టలు ఉతికే బ్రష్‌ విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ.. ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. తనను సీనియర్‌ విద్యార్థి మందలించాడని మనస్తాపం చెందిన జూనియర్‌ విద్యార్థి.. ఈ చర్యకు పూనుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాల ప్రకారం..

గ్రేటర్‌ వరంగల్‌ 17వ డివిజన్‌ దూపకుంటకు చెందిన ఉపేందర్‌- సుమిత్ర అనే దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు కిరణ్‌రాజ్‌ (12) మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. కాగా, శనివారం రాత్రి కిరణ్‌రాజ్‌కు, 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి బట్టలు ఉతికే బ్రష్‌ విషయంలో గొడవ జరిగింది. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయుడు ఇద్దరిని పిలిచి విషయం కనుక్కొని మరోసారి ఇలా గొడవ పడవద్దని చెప్పి పంపించాడు. ఈ విషయమై కిరణ్‌రాజ్‌ మనస్థాపానికి గురయ్యాడు.

మరుసటి రోజు ఆదివారం ఉదయం కిరణ్‌రాజ్‌ తన రూమ్‌లో నుంచి బెడ్‌షీట్‌ తీసుకువెళ్లి ముక్కలుగా చింపి ముడివేసుకొని తరగతి గదిలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న బల్లపైకి ఎక్కి కర్ర సహాయంతో బెడ్‌ షీట్‌ ఒక చివరను సీలింగ్‌ ఫ్యాన్‌కు తగిలించి ముడి వేశాడు. మరో చివర తన గొంతుకు బిగించుకొని కిందికి వేలాడాడు. అదే సమయంలో తన స్కూల్‌ బ్యాగ్‌లో ఉన్న డబ్బులు తీసుకుందామని తరగతి గదిలోకి వచ్చిన మరో విద్యార్థి.. గదిలోని దృశ్యం చూసి భయకంపితుడై బయటకి పరిగెత్తి ఇతర విద్యార్థులకు తెలిపాడు. వారు వెంటనే కిరణ్‌రాజ్‌ను పైకి ఎత్తి పట్టుకొని ఫ్యాన్‌కు ఉన్న బెడ్‌షీట్‌ చివరను తొలగించి కిందికి దించారు. వెంటనే విద్యార్థులు అతడి ఛాతిపై బలంగా శ్వాస తీసుకునే వరకూ(సీపీఆర్‌) ఒత్తుతూ ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన ఉపాధ్యాయులు కిరణ్‌రాజ్‌ను ఎంజీఎంకు తరలించారు. సమాచారం కిరణ్‌రాజ్‌ తల్లిదండ్రులకు అందించడంతో వారు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి వచ్చారు. అక్కడి నుంచి కిరణ్‌రాజ్‌ను నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడి కిరణరాజ్‌ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మడికొండ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని పరిశీలించారు. ఈ విషయమై పోలీసులను విచారించగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

బంధువుల ఆగ్రహం

మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో జరిగిన గొడవలో కిరణ్‌రాజు ఆత్మహత్యాయత్నం ఘటనపై ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని బంధువులు డిమాండ్‌ చేశారు. చికిత్స నిమిత్తం కిరణ్‌రాజ్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తీసుకురాగా వైద్యులు చికిత్స అందించారు. అక్కడికి చేరుకున్న బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుంటే ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-27T23:40:34+05:30 IST