ఫలించిన న్యాయ పోరాటం

ABN , First Publish Date - 2022-12-12T00:09:45+05:30 IST

వరంగల్‌ ఆజాంజాహి మిల్లు వలంటరీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు నాలుగు వారాల్లోగా కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఫలించిన న్యాయ పోరాటం
మిల్లు రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాలన్న స్థలం

ఏజే మిల్లు వాలంటరీ ఉద్యోగులకు దక్కనున్న ఇళ్ల స్థలాలు

నాలుగు వారాల్లో ఇవ్వాలని ఎన్టీసీ, ‘కుడా’కు సుప్రీంకోర్టు సూచన

వరంగల్‌ నగరంలో 22.24 ఎకరాలు కేటాయింపు..

ఈ నెల 9న రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి, ‘కుడా’ వైస్‌ చైర్మన్‌కు ఆదేశం

వరంగల్‌, డిసెంబరు 11 : వరంగల్‌ ఆజాంజాహి మిల్లు వలంటరీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు నాలుగు వారాల్లోగా కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌(ఎన్టీసీ)కి చెందిన 10.24 ఎకరాలు(రాంకీ సమీపంలోని స్థలం), కాకతీయ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(కుడా)కి చెందిన ఓ సిటీలోని 12 ఎకరాలు కలిపి మొత్తం 22.24 ఎకరాలు రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాలని రాష్ట్ర మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవిందకుమార్‌, ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ ప్రావీణ్య, నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ మనోజ్‌ కుమార్‌ ఆదేశిస్తు సుప్రీంకోర్టు ఈనెల 9న ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాల అమలుకు ఆరు నెలల సమయం కావాలంటూ ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ కోరితే తిరస్కరించిన సుప్రీంకోర్టు, నాలుగు వారాల్లోనే ఆదేశాలు అమలు చేయాల్సిందేనంటూ తేల్చిచెప్పింది. దీంతో ఉద్యోగుల 15 ఏళ్ల న్యాయ పోరాటం ఫలించింది.

వరంగల్‌ ఆజంజాహి మిల్లు 2002లో మూతపడిన సమయంలో అందులో పనిచేసిన ఉద్యోగులకు వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌ ప్రకటించారు. దీంతో 452 మంది ఉద్యోగులు రిటైర్‌ అయ్యారు. వీరిలో 134 మందికి మిల్లు యజమాన్యం ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చింది. మిగిలిన 318 మంది ఉద్యోగులు తమకు 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ను డిమాండ్‌ చేశారు. వాలంటరీ రిటైర్డ్‌ ఉద్యోగుల వినతిని ఎన్టీసీ తిరస్కరించడంతో వారు సీనియర్‌ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ ద్వారా హైకోర్టులో కేసు వేశారు. న్యాయవాది వాదనతో ఏకీభవించిన హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ 2016 మార్చి 18న కార్మికులకు అనుకూలంగా తీర్చునిచ్చింది. ఈ తీర్పుపై ఎన్టీసీ అప్పిల్‌కు వెళ్లగా హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ 2020 ఫిబ్రవరి 18న కార్మికుల వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ కొట్టి వేసింది.

2020లో సుప్రీంకోర్టుకు...

మాడిఫైడ్‌ వాలంటరీ రిటైర్‌మెంట్‌ 318 మంది ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై న్యాయవాది ప్రభాకర్‌ 2020 ఏప్రిల్‌ 1న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ వేశారు. దీనిపై ‘కుడా’, నేషనల్‌ టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌, మాడిఫైడ్‌ వాలంటరీ రిటైర్‌మెంట్‌ ఉద్యోగుల సంఘం వాదనలతో సుప్రీంకోర్టు అదే నెల 15న ఎన్టీసీ, ‘కుడా’ భూములపై యథాతథా స్థితి కొనసాగించాలంటూ ఆదేశాలు (2020 ఏప్రిల్‌ 15)జారీ చేసింది. గతంలో 134 మంది వాలంటరీ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చినట్లుగానే మిగిలిన 318 మంది వాలంటరీ రిటైర్డు ఉద్యోగులకు కూడా 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనంటూ కార్మికుల న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు 318 రిటైర్డ్‌ ఉద్యోగులకు కూడా స్థలాలు ఇవ్వాలంటూ 2021 అక్టోబరు 26న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను 6నెలల్లోగా అమలు చేయాలంటూ రాష్ట్ర మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, ‘కుడా’ వైస్‌ చైర్మన్‌, ఎన్టీసీ అధికారులను సుప్రీం కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

కోర్టు ధిక్కారణ కేసులో ప్రావీణ్య...

వాలంటరీ రిటైర్డు ఉద్యోగులు 318 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన (26 అక్టోబరు 2021) ఆదేశాలను రాష్ట్ర మునిసిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ, ‘కుడా’, ఎన్టీసీ అధికారులు అమలు చేయకపోవడంతో అధికారులపై న్యాయవాది జూన్‌ 9, 2022 సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారణ కేసు వేశారు. ఈనెల 2న సుప్రీంకోర్టులో జరిగిన కోర్టు ధిక్కారణ కేసు విచారణకు హాజరైన ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ ప్రావీణ్యను కోర్టు ఆదేశాల అమలు ఆలస్యంపై ప్రశ్నించి కారణాలపై అఫిడవిట్‌ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు గత ఏడాది 26న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు ఆలస్యంపై క్షమాపణ కోరుతూ ప్రావీణ్య ఈనెల 8న సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ఫైల్‌ చేశారు.

318 మంది రిటైర్డ్‌ ఉద్యోగులకు 22.24 ఎకరాలు..

ఈనెల 9న జరిగిన విచారణలో సుప్రీం 318 మంది రిటైర్డ్‌ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలంటూ గత ఏడాది అక్టోబరు 26న ఇచ్చిన ఆదేశాలు అమలుచేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలుకు 6 నెలలు సమయం కావాలని ‘కుడా’ వైస్‌ చైర్మన్‌ కోరగా కోర్టు తిరస్కరించింది. కేవలం నాలుగు వారాల్లోగా స్థలాలు కేటాయించి పూర్తి నివేదికను 16 జనవరి 2023లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ప్రస్తుతం మిల్లు ఖాళీ స్థలంలోని ఎన్టీసీకి చెందిన 10.24 ఎకరాలు, ‘కుడా’ ఓసిటీలోని 10 ఎకరాలు మొత్తం 22.24 ఎకరాలను రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కలెక్టరేట్‌ స్థలం సమీపంలోనే..

అజంజాహి మిల్లు స్థలం రాంకీ ఎంక్లైవ్‌ (నర్సంపేట రోడ్‌లో) సమీపంలో మొత్తం 30 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులోంచి వాలంటరీ రిటైర్డ్‌ ఉద్యోగుల కోసం 9.08 ఎకరాలు స్థలం కేటాయించనున్నారు. కాగా, ఇదే స్థలంలో ప్రభుత్వం కలెక్టరేట్‌ కోసం 6.16 ఎకరాలు ఇదివరకే కేటాయించిన విషయం తెలిసిందే. కలెక్టరేట్‌ సముదాయానికి కేటాయించిన స్థలం పక్కనే ఉద్యోగులకు విలువైన స్థలం ఇవ్వనున్నారు.

సుప్రీం ఆదేశాలు అమలుచేయాలి..

- చిక్కుడు ప్రభాకర్‌, సీనియర్‌ న్యాయవాది

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిల్లుకు చెందిన 10.24 ఎకరాలు, ‘కుడా’కు చెందిన ఓ సిటీలో 12 ఎకరాలు మొత్తం 22.24 ఎకరాలు భూమిని 318మంది రిటైర్డ్‌ ఉద్యోగులకు 200 గజాల చొప్పున ఇవ్వాలి. సుప్రీం ఆదేశాలను రాష్ట్ర మునిసిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ, ‘కుడా’, ఎన్టీసీ తక్షణం అమలు చేయాలి. మిల్లు రిటైర్డ్‌ ఉద్యోగులు చేస్తున్న 15 ఏళ్ల న్యాయపోరాటం ఫలించింది. ఇది మిల్లు రిటైర్డ్‌ ఉద్యోగుల విజయం.

Updated Date - 2022-12-12T00:09:45+05:30 IST

Read more