షోకాజ్‌ నోటీసు వాపస్‌ తీసుకోవాలి..

ABN , First Publish Date - 2022-11-08T01:01:40+05:30 IST

వరంగల్‌ జిల్లా పాఠశాల విద్యాశాఖలో అక్రమాలపై వార్తా కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి విలేఖరి పి.రాజన్నకు డీపీఆర్వో షోకాజ్‌ నోటీసు జారీ చేయడంపై జర్నలిస్టు సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాళోజీజంక్షన్‌లోని వరంగల్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

షోకాజ్‌ నోటీసు వాపస్‌ తీసుకోవాలి..
కలెక్టర్‌ గోపితో మాట్లాడుతున్న జర్నలిస్టు సంఘాల నాయకులు

జర్నలిస్టు సంఘాల నాయకుల డిమాండ్‌

వరంగల్‌ కలెక్టరేట్‌ ముందు ధర్నా

వరంగల్‌ కలెక్టరేట్‌, నవంబరు 7: వరంగల్‌ జిల్లా పాఠశాల విద్యాశాఖలో అక్రమాలపై వార్తా కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి విలేఖరి పి.రాజన్నకు డీపీఆర్వో షోకాజ్‌ నోటీసు జారీ చేయడంపై జర్నలిస్టు సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాళోజీజంక్షన్‌లోని వరంగల్‌ కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వరంగల్‌ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై గత సెప్టెంబరు 15న ‘సస్పెన్షన్ల పర్వం... కాసుల వర్షం’ శీర్షికన, అక్టోబరు 27న ‘ఇష్టారాజ్యంగా టీచర్ల సర్దుబాటు’ అనే శీర్షికన రెండు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో డీఈవో వాసంతి.. ఈ నెల 3న కలెక్టర్‌ గోపికి ఫిర్యాదు చేశారు. తనపై నిరాధార కథనాలను రాస్తున్నారని, అందువల్ల సదరు ఎడ్యుకేషన్‌ రిపోర్టర్‌ అక్రిడిటేషన్‌ కార్డు రద్దు చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో డీపీఆర్వో పల్లవి.. శనివారం రిపోర్టర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ‘మీరు రాసిన కథనాలకు సంబంధించిన ఆధారాలను మాకు వెంటనే అందజేయండి...’ అని హుకుం జారీచేశారు. కథనాల్లోని విషయాన్ని పూర్తిగా పరిశీలించకుండానే అక్రిడిటేషన్‌ రద్దు చేస్తామనే రీతిలో డీపీఆర్వో నోటీసు జారీచేయడంపై జర్నలిస్టు సంఘాలు నిరసన ప్రకటించి.... సోమవారం ఆందోళనలకు దిగాయి.

డీపీఆర్వో జారీ చేసిన షోకాజ్‌ నోటీసును వాపస్‌ తీసుకోవాలని కోరుతూ టీయూడబ్ల్యూజే 143 యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డీఈవో వాసంతి, డీపీఆర్‌వో పల్లవిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వార్తా కథనాలు రాస్తే అక్రిడిటేషన్‌ కార్డు రద్దుకు నోటీ సు జారీ చేయడం ఇదే తొలిసారని మండిపడ్డారు. అ నంతరం కలెక్టర్‌ బి.గోపిని కలిసి నోటీసును ఉపసంహరించుకోవాలని, డీఈవో, డీపీఆర్‌వోలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రిపోర్టర్‌పై షోకాజ్‌ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని టీఎ్‌సయూడబ్ల్యూజే (ఐజేయూ) డి మాండ్‌ చేసింది. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫో రం (టీడబ్ల్యుజేఎఫ్‌) ఆధ్వర్యంలో కూడా కలెక్టర్‌ బి.గోపికి వినతి పత్రం అందజేసి నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మెండు రవీందర్‌, కార్యదర్శి ఉమెందర్‌గౌడ్‌, సుభాష్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకట్‌, ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ అనిల్‌కుమార్‌, ఏబీఎన్‌ ఇన్‌చార్జి దొంతు నవీన్‌, టెమ్జు అధ్యక్షుడు అశోక్‌ తదితర నాయకులతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేసిన వారిలో ఐజేయూ నేతలు గాడిపెల్లి మధు, రాంచందర్‌, గుంటి విద్యాసాగర్‌, గడ్డం రాజిరెడ్డి, దుర్గా ప్రసాద్‌, తోట సుధాకర్‌, రవి, టీయూడబ్ల్యూజే ఎఫ్‌ నాయకులు దయాసాగర్‌, వి.జగన్‌, సురేందర్‌, వెంకటేష్‌, కిరణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2022-11-08T01:01:41+05:30 IST