విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి...

ABN , First Publish Date - 2022-11-24T23:54:40+05:30 IST

శాస్త్ర, సాంకేతికరంగాల్లో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలను విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ ఉండాలని, అప్పుడే ఉన్నతంగా రాణించగలుగుతారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం జోనల్‌ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ను ఆయన ప్రారంభించారు.

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి...
సైన్స్‌ ఎగ్జిబిట్లను ఆసక్తిగా తిలకిస్తున్న ఎమ్మేల్యే

వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌

ఘనంగా ప్రారంభమైన జోనల్‌స్థాయి సైన్స్‌ఫెయిర్‌

ఏడు జిల్లాల గురుకులాల విద్యార్థుల రాక

మడికొండ, నవంబరు 24: శాస్త్ర, సాంకేతికరంగాల్లో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలను విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ ఉండాలని, అప్పుడే ఉన్నతంగా రాణించగలుగుతారని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం జోనల్‌ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త ఆవిష్కరణల పట్ల అవగాహన పెంచుకుంటే టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరిగి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. రాష్ట ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సైన్స్‌ ఫెయిర్‌లో ప్రదర్శించిన వివిధ రకాల ఎగ్జిబిట్లను ఎమ్మెల్యే ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల జాయింట్‌ సెక్రటరీ సక్రునాయక్‌, వరంగల్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ నిర్మల, హనుమకొండ డీసీవో ఉమామహేశ్వరి, అసిస్టెంట్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ రాధాక్రిష్ణ, కార్పొరేటర్‌ రాధికారెడ్డి, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్‌ దువ్వ నవీన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈనెల 26వ తేదీ వరకు కొనసాగే ఈ సైన్స్‌ఫెయిర్‌లో జోన్‌- పరిధిలోని 7 జిల్లాలు హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనలో 22 బాలుర, 37 బాలికల గురుకుల పాఠశాలల నుంచి 236 మంది విద్యార్థులు, 118 మంది ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు.

ప్రదర్శనలు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జోనల్‌ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో విద్యార్థులు పలు ఆసక్తికరమైన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. బయోడైవర్సిటీ అండ్‌ కన్సర్వేషన్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ, ఆర్ట్‌ అండ్‌ లిటరేచర్‌, మ్యాచ్‌ ఇన్‌ ఎవరీ డేస్‌ లైఫ్‌ అంశాలపై విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఒక్కో పాఠశాల నుంచి రెండు అంశాలపై ఎగ్జిబిట్లను ప్రదర్శనకు ఉంచారు. సైన్స్‌ఫెయిర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా సాయంత్రం వరంగల్‌ నిట్‌ కళాశాల ప్రొఫెసర్‌ కాశీనాథ్‌ విజ్ఞానశాస్త్రంపై ఉపన్యసించారు.

Updated Date - 2022-11-24T23:54:47+05:30 IST