కేసీఆర్‌ చేసిందేమీ లేదు..

ABN , First Publish Date - 2022-11-28T00:04:05+05:30 IST

ఎనిమిదిన్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం కాదు.. సీఎం కేసీఆర్‌ కుటుంబమే బంగారమైందని, రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడాలని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

కేసీఆర్‌ చేసిందేమీ లేదు..
నర్సంపేటలో సభకు హాజరైన ప్రజానికం, మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల, పక్కన వైఎస్‌ విజయమ్మ

ఆయన కుటుంబానికే ‘బంగారు తెలంగాణ’

టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు చరమగీతం పాడితేనే బాగు

అవకాశమిస్తే రాజన్న రాజ్యం తెస్తా..

నర్సంపేట నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలట..

వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చేరిన ప్రజాప్రస్థానం పాదయాత్ర

నర్సంపేట టౌన్‌, నవంబరు 27: ఎనిమిదిన్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం కాదు.. సీఎం కేసీఆర్‌ కుటుంబమే బంగారమైందని, రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడాలని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం (222వ రోజు) 3,500 కిలోమీటర్లకు చేరింది. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం రాజేశ్వర్‌రావుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని రాంనగర్‌ నుంచి ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి రాజేశ్వర్‌రావుపల్లె, భాంజిపేట, మాధన్నపేట, నాగుర్లపల్లె వరకు కొనసాగింది. సాయంత్రం నాగుర్లపల్లె నుంచి నర్సంపేట పట్టణానికి చేరుకుంది. మాధన్నపేటరోడ్‌, అంగడిసెంటర్‌, వరంగల్‌ క్రాస్‌రోడ్డు మీదుగా వరంగల్‌రోడ్డులోని వైఎస్‌ విగ్రహం వద్ద 3,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మేరకు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను షర్మిల, ఆమె తల్లి వైఎస్‌ విజయమ్మలు ఆవిష్కరించారు. అంతకుముందు వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన రహదారిపై ప్రచార రథంపై నుంచి ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు.

బంగారు తెలంగాణ చేస్తానంటూ ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకొని తన కేసీఆర్‌ తన కుటుంబాన్ని బంగారు చేసుకున్నారని షర్మిల ఆరోపించారు. మిగులు రాష్ట్రాన్ని ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీర్‌ అప్పుల ఊబిలోకి నెట్టాడని ధ్వజమెత్తారు. వైఎ్‌సఆర్‌ నాడు నర్సంపేట నియోజకవర్గంలో 65 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ప్రాంతానికి అవసరమైన సాగునీటిని అందించారని గుర్తుచేశారు. రంగాయచెరువు ద్వారా 35వేల ఎకరాలకు, పాకాల కాల్వలకు, ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించి 50వేల ఎకరాలకు నీరందేలా చేశాడన్నారు. వైఎ్‌సఆర్‌ 8సబ్‌స్టేషన్‌లు, 4 కస్తూర్భా పాఠశాలలు, 30వేల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ప్రతీ కుటుంబానికి, ప్రతీ వర్గాన్ని గుండెల్లో పెట్టుకొని ఆదుకున్న మహనీయుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. కేసీఆర్‌ సర్కారుకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడాలని, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. చేవేళ్లలో ప్రారంభమైన తన పాదయాత్ర నర్సంపేటలో 3,500 కిలోమీటర్లను దాటిందని, ప్రజల అభిమానమే తనను నడిపించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు అండగా నిలిస్తే రాజన్న రాజ్యం తెస్తాననని షర్మిల చెప్పారు.

నర్సంపేట నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలట

నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆయన భార్య సైతం ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతూ డబ్బులు దండుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. నర్సంపేట ఎమ్మెల్యే పేరుకే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని, మనిషిది చిన్న బుద్ధి అని అన్నారు. ఉద్యమకారుడిగా ఉండి నేడు తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు కబ్జాకోరయ్యాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అనుచరుల కన్నుపడితే భూమి మాయమవుతుందన్నారు. చివరికి లే ఔట్ల్‌లో గ్రీన్‌ల్యాండ్స్‌ను వదలడం లేదని పేర్కొన్నారు. ఆయనకు సంపాదన తప్ప మరో ధ్యాసలేదని, ఇలాంటి వారికి ఎందుకు ఓట్లు వేయాలని, కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు.

ఉద్యమంలా పాదయాత్ర

రాష్ట్రంలో షర్మిల చేస్తున్న పాదయాత్ర ఓ ఉద్యమంలా సాగుతోందని, షర్మిల పోరాటంతోనే సర్కార్‌లో అలజడి మొదలైందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. నర్సంపేటలో జరిగిన షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రలో విజయమ్మ అకస్మాత్తుగా యాత్రలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రచారం రథంపై నుంచి ఆమె మాట్లాడారు. ప్రజల ప్రేమ అభిమానంతోనే 3500 కిలోమీటర్ల పాదయాత్ర షర్మిల పూర్తి చేసుకున్నదని, కోట్ల మందికి షర్మిలమ్మ అంటే ఏంటో తెలిసిన యాత్ర అన్నారు. ‘నా బిడ్డను మీ బిడ్డలా చూసుకోవాలని, మీ బాగు కోసం చేస్తున్న షర్మిలకు మీరే బలం కావాలి’ అన్నారు. సంక్షేమం, స్వయం సమృద్ధి, సమన్యాయం వంటి గొప్ప లక్ష్యాల కోసం యాత్ర చేస్తోందన్నారు. నోటిఫికేషన్లు, వరి ధాన్యం కొనుగోలు వంటివి షర్మిల ఉద్యమంతోనే సర్కార్‌ ప్రారంభించిందన్నారు. షర్మిల ఎక్కడకు వెళ్లినా వైఎ్‌సఆర్‌ను గుర్తు చేస్తున్నారని, రూ.1.40లక్షల కోట్లతో 86 ప్రాజెక్టులు జలయజ్ఞంతో చేపట్టిన మహానాయకుడు అని విజయలక్ష్మి పేర్కొన్నారు.

నేడు చెన్నారావుపేటలో షర్మిల పాదయాత్ర

చెన్నారావుపేట: వైఎ్‌సఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం చెన్నారావుపేట మండలంలో కొనసాగుతుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు జక్కు వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు గురిజాల గ్రామంలో యాత్ర ప్రారంభమై ఖాదర్‌పేట, జల్లి, శంకరంతండా, లింగగిరి గ్రామాల మీదుగా సాగుతుందన్నారు. అనంతరం జిల్లాలోని నెక్కొండ మండలం సూరుపెల్లి గ్రామం చేరుకుంటుందని చెప్పారు.

Updated Date - 2022-11-28T00:04:06+05:30 IST