వైభవంగా కార్తీక దీపోత్సవం

ABN , First Publish Date - 2022-11-08T01:04:16+05:30 IST

హనుమకొండలోని ప్రసిద్ధ వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో సోమవారం రాత్రి నేత్రపర్వంగా లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందు ధర్మప్రచార పరిషత్‌, దేవాదాయశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపోత్సవ వేడుకలను ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌-రేవతి దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

వైభవంగా కార్తీక దీపోత్సవం
వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

భద్రకాళిలో వైభవంగా జ్వాలా తోరణం

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

హనుమకొండ కల్చరల్‌, నవంబరు 7 : హనుమకొండలోని ప్రసిద్ధ వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో సోమవారం రాత్రి నేత్రపర్వంగా లక్ష దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందు ధర్మప్రచార పరిషత్‌, దేవాదాయశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపోత్సవ వేడుకలను ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌-రేవతి దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముకులు గట్టు మహేశ్‌బాబు, మున్నూరుకాపు సంఘం నాయకులు మాడిశెట్టి సాంబయ్య, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ ఆర్‌.సునీత, టీటీడీ కో ఆర్డినేటర్‌ రామిరెడ్డి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్‌ మాట్లాడుతూ కార్తీకమాస వేళ ఈ ఆలయంలో ఆధ్యాత్మిక శోభ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. కార్తీకదీపాల వెలుగుల్లో రుద్రేశ్వరాలయం మెరిసిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించడం ద్వారా తమలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని చైతన్యవంతులు కావాలని ఆకాంక్షించారు.

గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. మంగళవారం చంద్రగ్రహణం సంభవిస్తున్నందున ఒక రోజు ముందే దీపోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. గత రెండు దశబ్దాలుగా ప్రతి కార్తీక పౌర్ణమికి దీపోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయ ఈవో కె.వెంకటయ్య, హనుమకొండ సీఐ శ్రీనివాస్‌, తదితరులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. తా డూరి రేణుక శిష్య బృందంతోపాటు పరమేశ్వర్‌ శిష్య బృందం చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యా లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినయ్‌భాస్కర్‌ సతీమణి రేవతి తొలి దీపాన్ని వెలిగించారు. స్వస్తిక్‌, ఓం, పరమశివుడు, విష్ణువు ఆకారాల్లో అందమైన ముగ్గులను తీర్చిదిద్ది వీటి చుట్టూరా దీపాలను అందంగా అమర్చి వేళసంఖ్యలో వచ్చిన భక్తులు దీపాలను వెలించడంతో ఆలయ ప్రాంగణమంతా కార్తీకశోభ వెల్లి విరిసింది. ఉదయం ఉత్తిష్ట గణపతికి ఆరాధన, రుద్రేశ్వరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 400 మంది పుణ్య దంపతులచే సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహింపజేశారు. రాత్రి 10 గంటలు దాటినా వేలాది భక్తులతో వేయిస్తంభాల ఆలయం కిటకిటలాడింది.

భద్రకాళి ఆలయంలో జ్వాలా తోరణం

నగరంలోని పవిత్ర భద్రకాళి క్షేత్రంలో సోమవారం రాత్రి వైభవంగా జ్వాలా తోరణం నిర్వహించారు. ఈ జ్వాలా తోరాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అనేక జన్మల నుంచి సంక్రమించిన పాపము నశించి పుణ్యప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో ప్రతియేటా నిర్వహించే జ్వాలా తోరణాన్ని అనేక మంది భక్తులు తరలివచ్చి పునీతమయ్యారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

బాబా ఆలయంలో..

హనుమకొండలోని సాయిబాబా శిర్డీ సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఒక రోజు ముందే సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ మతుకుమల్లి హరగోపాల్‌ ఆధ్వర్యంలో కిశోర్‌శర్మ, మణిశర్మ, చందులు భక్తి శ్రద్ధలతో వ్రతాలను జరిపించారు. 130 మంది దంపతులచే వ్రతాలను నిర్వహింపజేశారు. రాకం సదానందం, వెయిగండ్ల రమేశ్‌, నిమ్మల శ్రీనివాస్‌, డాక్టర్‌ సురేశ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. రాత్రి జ్వాల తోరణ కార్యక్రమాన్ని కూడా వైభవంగా నిర్వహించారు.

Updated Date - 2022-11-08T01:04:18+05:30 IST