ఫామ్‌హౌ్‌సల జోరు

ABN , First Publish Date - 2022-12-09T00:18:32+05:30 IST

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలకే పరిమితమైన ఫామ్‌హౌస్‌ సంస్కృతి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ జోరందుకున్నది. కొద్దిమంది సంపన్నులు, సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమయ్యే ఈ ఫామ్‌హౌజ్‌లను ఇపుడు రాజకీయ నాయకులు, డాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. విలాసవంతమైన ఈ ఫామ్‌హౌజ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఫామ్‌హౌ్‌సల జోరు

వ్యవసాయ భూముల్లో కొలువుదీరుతున్న ప్రత్యేక కట్టడాలు

వారాంతాల్లో కుటుంబంతో గడిపేందుకు కొందరు..

అసాంఘిక కార్యకలాపాల కోసం మరికొందరు..

రాజకీయ నాయకులకు సెటిల్‌మెంట్‌ అడ్డాలు

పేకాటకు, మందు, విందు పార్టీలకు సైతం సెంటర్‌పాయింట్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పెరిగిన నయా సంస్కృతి

నజర్‌ వేయని పోలీసులు

ఓరుగల్లు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలకే పరిమితమైన ఫామ్‌హౌస్‌ సంస్కృతి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ జోరందుకున్నది. కొద్దిమంది సంపన్నులు, సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమయ్యే ఈ ఫామ్‌హౌజ్‌లను ఇపుడు రాజకీయ నాయకులు, డాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. విలాసవంతమైన ఈ ఫామ్‌హౌజ్‌లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రేవ్‌ పార్టీలు, ముజ్రా వేడుకలు, బర్త్‌డే సెలబ్రేషన్స్‌ పేరిట విశృంఖలత్వానికి దారితీస్తున్న సంఘటనలు హైదరాబాద్‌ పోలీసుల దాడుల్లో వెలుగుచూస్తున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఫామ్‌హౌస్‌ సంస్కృతి వేగంగానే పెరిగిపోయింది.

హైవేల్లో ఏర్పాటు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆరుజిల్లాలుగా ఏర్పడడంతో ఆయా జిల్లా కేంద్రాలకు సమీపంలో ఫామ్‌హౌ్‌సలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫామ్‌హౌ్‌సల నిర్మాణంలో జనగామ జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఏకంగా వందకు పైగానే ఫామ్‌హౌ్‌సలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆతర్వాత స్థానంలో హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. వరంగల్‌ జిల్లా శివారు ప్రాంతాల్లో ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో పెద్దగా ఈ ప్రభావం కనిపించడం లేదు. ఇక ములుగు జిల్లా పరిసర ప్రాంతాలు ఇప్పటికీ మావోయిస్ట్‌ పార్టీ కదలికలు కనిపిస్తుండడంతో ఫామ్‌హౌ్‌సలను ఏర్పాటు చేసుకునేందుకు ముందడుగు వేయడంలేదు. హనుమకొండ- హైదరాబాద్‌ ప్రధాన రహదారులకు ఇరువైపులా వ్యవసాయ భూముల్లో ఫామ్‌హౌ్‌సలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వరంగల్‌- హైదరాబాద్‌ రహదారి ఈ ఫామ్‌హౌ్‌సలకు పెట్టింది పేరు. మడికొండ శివారు నుంచి మొదలై హైదరాబాద్‌ వరకు ఈ ఫామ్‌హౌ్‌సలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్‌, చిలుపూర్‌, రఘునాథపల్లి, జనగామ, బచ్చన్నపేట, నర్మెట మండలాల్లో ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయి.

సకల సౌకర్యాలు

విలాసవంతమైన కొన్ని ఫామ్‌ హౌ్‌సల్లో స్విమ్మింగ్‌పూల్‌లాంటి సౌకర్యాలతో పాటు విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకునేవిధంగా భారీస్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాకుండా కొన్ని ఫామ్‌హౌ్‌సలు మాత్రం ఏకంగా పేకాటకేంద్రాలుగా విరాజిల్లుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం వ్యవసాయక్షేత్రాల్లో అపుడప్పుడు సేద తీరేందుకు అవసరమైన సౌకర్యాలను మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొంతమంది దైనందిన ఒత్తిడి దూరం చేసుకునేందుకు కుటుంబసభ్యులతో వారాంతపు రోజుల్లో గడుపుతున్నారు. కొంతమంది కుటుంబసభ్యుల పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుంటున్నారు. రాత్రి వేళల్లో సైతం ఫామ్‌హౌ్‌సలకు వెళ్లేందుకు వీలుగా ప్రధాన రహదారికి అతి సమీపంలో ఏర్పాటు చేసుకుంటున్నారు.

స్టేటస్‌ సింబల్‌

ఫామ్‌హౌ్‌సల ఏర్పాటు ఇపుడు రాజకీయ నాయకులకు ఒక స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. అధికారపార్టీ చోటా, మోటా లీడర్లకు సైతం ఫామ్‌హౌ్‌సలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు తప్ప అందరికీ ప్రత్యేకమైన ఫామ్‌హౌ్‌సలు ఉన్నాయని సమాచారం. ఒకరిద్దరు ఎమ్మల్యేలకైతే ఏకంగా గోవా, కేరళ రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గెస్ట్‌హౌ్‌సలు ఉన్నట్టుగా తెలుస్తోంది. రహస్య రాజకీయ సమాలోచనలన్నీ ఫామ్‌హౌ్‌సలోనే చక్కబెడతారని తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఫామ్‌హౌ్‌సలను సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మార్చుకుంటున్నారని చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం భూముల కొనుగోలుతోపాటు ఫామ్‌హౌ్‌సల నిర్వహణలోనూ పోటీ పడుతున్నారన్న చర్చలు లేకపోలేదు. అధికారులతో అనధికార సమావేశాలకు సైతం ఈఫామ్‌హౌ్‌సలే వేదికలవుతున్నాయన్న ప్రచారం కూడా లేకపోలేదు. కొద్ది మంది నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వాటిని కాపాడుకోవడానికి చుట్టూ పకడ్భందీ కంచె ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతి లేనిదే ఇతరులు ఎవ్వరూ లోనికి ప్రవేశించకుండా గట్టి నిఘావ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. మొయినాబాద్‌ ఫామ్‌హౌ్‌సలో ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఎపిసోడ్‌ వెలుగు చూసినప్పటినుంచి ఫామ్‌హౌ్‌సల మీద పోలీసులు నజర్‌ పెట్టినట్టు సమాచారం.

కానరాని పర్యవేక్షణ

ఫామ్‌హౌ్‌సల నిర్మాణాలకు సంబంధించి చాలావరకు ఎలాంటి అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయి. పక్కా భవనం లాంటి నిర్మాణం చేపట్టినప్పుడు సంబంధిత గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీ అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించుకుంటున్నాం.. కాబట్టి ఎలాంటి అనుమతులు అవసరం లేదన్న భావనలో ఫామ్‌హౌ్‌సల యాజమానులు ఉన్నారు. పకడ్బందీ రక్షణ ఏర్పాటు చేసుకుని అనుమతిలేకుండా ఇతరులను లోనికి ప్రవేశం కూడా నిరాకరిస్తున్నారు. అసలు ఈ ఫామ్‌ హౌ్‌సల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం కూడా పోలీసు వర్గాలకు ఉండడం లేదన్న విమర్శ కూడా ఉంది. కొన్ని ఫామ్‌హౌ్‌సలు మాత్రం అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. జరగరానిదేదో పెద్ద నేరం జరిగిన తర్వాత ఆగమాగం అవడం కంటే, ముందు నుంచే అప్రమత్తత ఎంతో అవసరమని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం స్పందించి ఫామ్‌హౌ్‌సల లెక్క తేల్చాలని కోరుతున్నారు.

Updated Date - 2022-12-09T00:18:33+05:30 IST