దర్జాగా దోపిడీ

ABN , First Publish Date - 2022-11-30T00:17:42+05:30 IST

వరంగల్‌ మహానగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలోని కొందరు జవాన్లు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పైఅధికారులకు ముట్టజెప్పితేనే ఫైలు కదులుతుందని నిక్కచ్చిగా చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు.

దర్జాగా దోపిడీ

జీడబ్ల్యూఎంసీ శానిటేషన్‌ జవాన్లపై అవినీతి ఆరోపణలు

క్షేత్రస్థాయిలో పరిశీలనలు.. అక్కడే వసూళ్లు...

డబ్బులు చేతిలో పడితేనే పని.. లేదంటే పైసార్లు వినరని స్పష్టీకరణ

దోపిడీకి శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అండదండలు

చిరు వ్యాపారుల నుంచి నెల వారీ మామూళ్లు

బల్దియా ఖజానాకు టోకరా

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), నవంబరు 29 : వరంగల్‌ మహానగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలోని కొందరు జవాన్లు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పైఅధికారులకు ముట్టజెప్పితేనే ఫైలు కదులుతుందని నిక్కచ్చిగా చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ల కోసం రూ.5 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. నగరంలో ప్లాస్టిక్‌ నిషేధం ఉత్తి మాటగానే మారింది. ప్లాస్టిక్‌ విక్రయ దుకాణాల నుంచి జవాన్లకు మామూళ్లు ముట్టడమే ఇందుకు కారణమవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. చిరు వ్యాపారులను కూడా వదలడం లేదు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు ముట్టజెప్పి జవాన్లు వారి అండదండలతో దోపిడీ చేస్తున్నారు. నెలవారీ వసూళ్లు, మామూళ్లతో అక్రమంగా దోచుకుంటున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ జవాన్ల వసూళ్లకు అడ్డూ అదుపు లేదు. ఉద్యోగంలో ఉన్న అత్యధిక మంది జవాన్లు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమితులైన వారే. దీంతో ఉద్యోగంలో ఉన్నప్పుడే దండుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ కావడంతో ఉన్నా ఊడినా జాన్తా నహీ అంటూ తెగపడుతున్నారు.

శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అండదండలు

జవాన్ల అక్రమ వసూళ్లకు కొందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అండదండలు ఉంటున్నాయి. పనిచేసే జవాన్ల కంటే వసూలు చేసే జవాన్లను శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఎంచుకుంటున్నారు. వారికి అండదండలు అందిస్తున్నారు. సర్కిళ్ల వారీగా వసూళ్ల ప్రయోజనాలను బేరీజు వేసుకొని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు జవాన్లకు అభయ హస్తమిస్తున్నారు. దీంతో జవాన్లు దర్జాగా డబ్బులు దండుకుంటున్నారు.

రాజకీయ సిఫార్సులు

జవాన్లు కొందరు రాజకీయ సిఫార్సులతో కూడా కోరుకున్న సర్కిళ్లకు మారుతున్నారు. వ్యాపార సంస్థలు, చిరువ్యాపారులు అధికంగా ఉండే వాటితో పాటు వ్యాపార కూడళ్లను వసూళ్లకు ఎంచుకుంటున్నారు. కోరుకున్న చోటుకోసం రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నారు. నిబ్బద్ధతో పని చేసే జవాన్లను దూరప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎంతగా వేడుకున్నా తమ ప్రయోజనాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో వసూలు రాయుళ్లకు చేయూతనిస్తున్నారు. సీనియారిటీ ఉన్నా, నిజాయితీగా పనిచేసినా జవాన్‌గా పదోన్నతి దక్కని కార్మికులు ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

సీఎంహెచ్‌వో, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఈ వ్యవహారంలో డబ్బులు దండుకొని అడ్డదారిలో జవాన్ల నియామకాల్లో చక్రం తిప్పుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు కొందరు రాజకీయ నేతలకు లక్షల్లో ముట్టజెప్పి జవాన్‌గా అడ్డదారిలో పదోన్నతి పొందుతున్నారు. రోజూ రెండు చేతులా అక్రమంగా సంపాదిస్తున్నారు. జవాన్‌ ఉద్యోగానికి డిమాండ్‌ ఉండడంతో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు జవాన్ల నియామకంలో చక్రం తిప్పుతారు. వారికి కావాల్సిన వారిని నియమించుకొని వసూళ్లలో వాటాలు పొందుతారు. చేతికి మట్టి అంటకుండా డబ్బులు జేబులో వేసుకుంటున్నారు.

చిరు వ్యాపారుల నుంచి దండుకోలు

కొందరు జవాన్లు చిరు వ్యాపారులను కూడా వదలరు. నెలనెలా చిరు వ్యాపారుల నుంచి మామూళ్లు దండుకుంటున్నారు. బేకరీలు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, చికెన్‌, మటన్‌ సెంటర్లు, కిరాణం దుకాణాలు ప్రతీషాపు నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. షాపుల నుంచి సామగ్రీ, టిఫిన్లు కూడా అధికారుల పేర్లు చెప్పి తీసుకెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ట్రేడ్‌ లైసెన్స్‌ కావాలంటే..

ట్రేడ్‌ లైసెన్స్‌ కావాలంటే జవాన్ల చేతిలో రూ.5వేలకు పైగా పడాల్సిందే. ముట్టజెప్పితేనే ఫైలు కదులుతుందని దరఖాస్తుదారులకు జవాన్లు స్పష్టం చేస్తారు. తనతో పాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఉన్నతాధికారుల వరకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని తేగేసి చెబుతారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించే వ్యాపారుల వివరాలు జవాన్లకు బాగా తెలిసిన విషయం. నెల వారీగా మామూళ్లు దండుకుంటూ ప్లాస్టిక్‌ కవర్ల విక్రయానికి సహకరిస్తున్నారు.

ఖజానాకు టోకరా

క్షేత్రస్థాయి పరిశీలన చేయడంలో జవాన్లది కీలక పాత్ర. ట్రేడ్‌ లైసెన్స్‌ కావాలంటే క్షేత్రస్థాయిలో వ్యాపారం, మడిగ, ప్రాంతం తదితర వివరాలను జవాను పరిశీలిస్తాడు. ఈక్రమంలో జవాన్లు ఇచ్చిన నివేదికనే శానిటరీ ఇన్‌స్పెక్టరు ఆపై అధికారులు ఖరారు చేస్తారు. దీంతో జవాన్లు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దోపిడీ చేస్తున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణాలు, వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారాలు ఉన్నా వాటిని లెక్కలోకి తీసుకోకుండా తమ సొంత లెక్కలు చూసుకుంటున్నారు. దీంతో బల్దియా ఖజానాకు టోకరా పడుతుంది.

Updated Date - 2022-11-30T00:17:42+05:30 IST

Read more