ప్రతీ అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి

ABN , First Publish Date - 2022-12-08T00:07:24+05:30 IST

18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, అర్హులైన ఏ ఒక్కరి పేరు తప్పిపోకుండా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు.

ప్రతీ అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండాలి
అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌

మూడు నియోజకవర్గాల అధికారులతో సమీక్ష

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబరు 7: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, అర్హులైన ఏ ఒక్కరి పేరు తప్పిపోకుండా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ సూచించారు. ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 కార్యక్రమంలో భాగంగా బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో జనగామ జిల్లా పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలకు సంబంధించిన ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్‌వైజర్స్‌, బూత్‌ లెవల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వికాస్‌రాజ్‌కు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య, అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌లు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ భారత ఎన్నిక కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023 రూపకల్పనలో అర్హులైన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయడానికి గాను బూత్‌ లెవల్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో కృషి చేయాలన్నారు. నూతన ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందనే విషయం గ్రామ స్థాయిలో తెలిసేలా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యాలయాల్లో ఉండి జాబితాలు తయారు చేస్తామంటే ప్రజలకు తెలిసేది ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికే జాబితాల్లో ఉన్న వారికి అధార్‌ అనుసంధానం చేయడం పూర్తి చేయాలన్నారు. బూత్‌ల వారీగా క్షేత్ర స్థాయిలో ఓటరు లిస్టులో ఉన్న చనిపోయిన, వివాహం చేసుకుని వెళ్లిన యువతుల పేర్లను తొలగించాలని అన్నారు. నూతన ఓటరు జాబితా తయారీపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించాలని ఆయన కోరారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ జాబితా-2023లో భాగంగా జిల్లాలో 88 శాతం మేర ఓటరు అనుసంధానం పూర్తి చేసినట్లు తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం పరిధిలో 93 శాతం మేర అనుసంధానం పూర్తయిందన్నారు. జిల్లాలో ఓటరు జాబితా నమోదు, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సంబంధిత సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీపీలు, వార్డులు, విద్యా సంస్థలలో విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల జాయింట్‌ సీఈవో రవికిరణ్‌, ఈఆర్వోలు మధుమోహన్‌, రామిరెడ్డి, కృష్ణవేణి, రాధిక, తహసీల్దార్లు పూల్‌సింగ్‌ చౌహన్‌, ఎం.రజని, విమల, స్వప్న, అంజయ్య, అన్వర్‌, కిరణ్‌కుమార్‌, రాజేష్‌, సమ్మయ్య, ఆర్‌ఐలు రవీందర్‌, అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T00:07:31+05:30 IST