కమీషన్‌ కహానీ

ABN , First Publish Date - 2022-11-15T22:53:16+05:30 IST

సొంత శాఖ అధికారులపై రచ్చకెక్కిన ఉద్యోగులు ధాన్యం కొనుగోలు కమీషన్‌ వడ్డీ దుర్వినియోగంపై అభియోగం సెర్ప్‌ సీఈవో, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి ఫిర్యాదు నాలుగు సీజన్లుగా మహిళా సంఘాలకు చేరని పైకం

కమీషన్‌ కహానీ

ములుగు, నవంబరు 15: ములుగు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో నిధులు దుర్వినియోగ మయ్యాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సొంత శాఖ అధికారులపైనే సిబ్బంది హైదరాబాద్‌ స్థాయిలో ఫిర్యాదు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ను ఏళ్లకాలంగా విడుదల చేయకుండా వడ్డీని దొడ్డిదారిన మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు చెక్కు నంబర్లు, తేదీలు సహా ఆధారాలను సమర్పించారు. మరోవైపు పని విధానం మార్చుకోవాలని హెచ్చరించడం వల్లే పలువురు ఉద్యోగులు తమపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని అధికారులు అంటున్నారు. పలువురిని బదిలీలు చేయడాన్ని జీర్ణించుకోలేక బురద జల్లుతున్నారని విమర్శిస్తున్నారు.

వడ్ల కొనుగోలు కమీషన్‌ 3.56 కోట్లు

ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను 2012 నుంచి ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ప్రతి వానాకాలం, యాసంగిలో మహిళా సంఘాలు, జీసీసీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను తెరిచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. కేంద్రాలను నిర్వహించినందుకు ఆయా సంఘాలకు మొత్తం ఆదాయంలో 25 శాతం కమీషన్‌గా చెల్లిస్తున్నారు. దీని నుంచే వ్యవసాయ మార్కెట్‌, జిల్లా సమాఖ్య, గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా వాటాలు ఉంటాయి. ఏ సీజన్‌కా సీజన్‌ కాకుండా ఆలస్యంగా కమీషన్‌ డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. 2013 నుంచి 2018 వరకు జిల్లాలోని చాలా సంఘాలకు కమీషన్‌ పెండింగ్‌లో ఉండగా ఇటీవలే క్లియర్‌ చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్‌డీఏకు 2019-20 వానాకాలంలో రూ.16,021,462, యాసంగిలో రూ.69,71,132, 2020-21 వానాకాలంలో రూ.75,38,815, యాసంగిలో రూ.51,050,92 కమీషన్‌ విడుదలైంది. మొత్తం నాలుగు సీజన్లకు సంబంధించిన రూ.3,57,33,434కు గానూ నార్లాపూర్‌, జాకారం, మల్యాల సంఘాల నష్టాల మొత్తం రూ.96,933 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే.. సివిల్‌సప్లయ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఈ మొత్తం 2021 ఫిబ్రవరి 17 నుంచి ఈఏడాది ఆగస్టు 1 వరకు ఆరు దఫాలుగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఖాతాలో జమయ్యింది. గ్రామైక్య సంఘాలకు 25 శాతం కమీషన్‌గా రూ.84,80,107, జిల్లా సమాఖ్యకు 10 శాతం కమీషన్‌ రూ.33,92,043, స్ర్తీనిధికి 65 శాతం కమీషన్‌గా రూ.2,20,48,279, రెండు శాతం డీఆర్‌డీఏ కార్యాలయ అడ్మిన్‌ ఖర్చులకు రూ.6,94,207, డ్యామేజ్డ్‌ ఎక్విప్‌మెంట్‌ కింద అగ్రికల్చర్‌ మార్కెట్‌కు రూ.10,21,864.. ఇలా పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, నెలల తరబడి పెండింగ్‌లో పెడుతూ వచ్చారు.

కమీషన్‌ వడ్డీపై కక్కుర్తి!

డీఆర్‌డీఏ బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.3.5 కోట్లకు నెలనెలా వచ్చే వడ్డీపై జిల్లా ఉన్నతాధికారులు కన్నేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా ఖర్చు చేసి తప్పుడు బిల్లులు సృష్టిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఆర్‌ డీవో, మార్కెటింగ్‌ డీపీఎంలు తమ సొంత ఖాతాల్లోకి కొంత మొత్తాన్ని మళ్లించుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా సొంత శాఖలో అంతర్భాగమైన సెర్ప్‌ సిబ్బంది కొందరు కమీషన్‌ డబ్బులు విడుదలైన తేదీలు, చెక్కు నంబర్లు సహా సమగ్ర నివేదికను రూపొందించారు. ఈనెల 10న సంబంధిత వివరాలతో సెర్ప్‌ సీఈవో, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు సెర్ప్‌ ఎంప్లాయిస్‌ జేఏసీ పేరిట ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ శాఖలో పాలిటిక్స్‌

గ్రామీణాభివృద్ధి శాఖలో అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వివాదాస్పదమవుతుండగా ఉన్నతాధికారులపైనే సిబ్బంది రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది. డీఆర్‌డీవో మాట ఏమాత్రం చెల్లుబాటు కాకపోగా కిందిస్థాయి అధికారులు ఎవరికి వారుగా వ్యవహరిస్తు న్నారు. ఈక్రమంలో కొంతమంది సిబ్బంది పాలిటిక్స్‌ చేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇటీవల తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాలకు సంబంధించిన ఏపీఎంలను వేర్వేరు మండలాలకు బదిలీ చేశారు. లాంగ్‌ స్టాండింగ్‌, పనితీరులో లోపాల కారణంగా కలెక్టర్‌ ఆదేశాలతో బదిలీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇది కక్ష సాధింపేనని, ఇంక్రిమెంట్లు, తదితర ప్రయోజనాలు రాకుండా అడ్డుకోవడమే కాకుండా కమీషన్‌ వడ్డీ దుర్వినియోగంపై ప్రశ్నిస్తే తమను బదిలీ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ, సమైక్యతా వజ్రోత్సవాలు, ఆత్మా ఆధ్వర్యంలో రైతుల శిక్షణా శిబిరాలు, పర్యటనల కోసం సుమారు రూ.4 లక్షలను డీఆర్‌డీవో నుంచి ఖర్చు చేయడం విమర్శలకు తావిస్తోంది. శాఖతో సంబంధం లేని కార్యక్రమాలకు కూడా నిధులను కేటాయించడం అనుమానాలకు కారణమవుతోంది.

నిరాధార ఆరోపణలు : నాగపద్మజ, ములుగు డీఆర్‌డీవో

మహిళా సంఘాలకు ఇచ్చే కమీషన్‌ వడ్డీ దుర్వినియోగమైనట్టు వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. శాఖ పరమైన విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్‌ అనుమతి మేరకే ఖర్చులు చేస్తున్నాం. సీజన్ల వారీగా ధాన్యం కొనుగోలు కమీషన్‌ డబ్బులు ఆలస్యంగా విడుదలయ్యాయి. గ్రామైక్య సంఘాల వారీగా డ్యామేజ్డ్‌ ఎక్విప్‌మెంట్‌ రిపోర్టు సకాలంలో చేరకపోవడంతో చెల్లింపులు చేయలేకపోయాం. ప్రస్తుతం 90 శాతం చెక్కులను సిద్ధం చేశాం. త్వరలోనే ఆయా సంఘాలకు డిపాజిట్‌ చేస్తాం. మహిళా సంఘాల బలోపేతం కోసం స్ర్తీనిధికి 65 శాతం కమీషన్‌ను డిపాజిట్‌ చేస్తాం. ఇప్పటి వరకు జిల్లాలో స్త్రీనిధి బ్యాంకులో రూ.5,45,77,836.72 జమ అయ్యాయి. ప్రతి మూడు నెలలకోసారి 8 శాతం వడ్డీ వస్తోంది.

Updated Date - 2022-11-15T22:53:16+05:30 IST

Read more