ఆశీర్వదించండి.. అండగా ఉంటా..

ABN , First Publish Date - 2022-11-21T00:11:47+05:30 IST

వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురిగా ఆయన పథకాలను రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రవేశపెడతానని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు.

ఆశీర్వదించండి..  అండగా ఉంటా..

తెలంగాణ ప్రజల బాగు కోసమే పార్టీ పెట్టా..

8ఏళ్లలో రాష్ట్రానికి కేసీఆర్‌ చేసిందేమీ లేదు..

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

రెండో రోజు జిల్లాలో కొనసాగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర

కమలాపూర్‌, నడికూడ, పరకాల మండలాల మీదుగా సాగిన యాత్ర

కమలాపూర్‌/నడికూడ/పరకాల/నవంబరు 20: వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూతురిగా ఆయన పథకాలను రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ప్రవేశపెడతానని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. ఆదివారం ప్రజా ప్రస్థానం పాదయాత్ర హనుమకొండ జిల్లాలో రెండోరోజు కొనసాగింది. కమలాపూర్‌ మండలం శనిగరం గ్రామంలో మొదలైన పాదయాత్ర.. నడికూడ మండలం మీదుగా పరకాల వరకు సాగింది. తొలుత కమలాపూర్‌ మండలం శనిగరం గ్రామంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్‌టీపీ పేదల పక్షాన నిలబడుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. వైఎస్సార్‌ టీపీ తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటైన పార్టీ అని, వైఎస్సార్‌ సంక్షేమ పాలన మీ ఇంటి ముందుకు తీసుకవస్తుందన్నారు. ప్రజలు ఆశీర్వదించాలని షర్మిల కోరారు.

ఎన్నికలలో ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండని.. అది ప్రజల సొమ్మేనని అన్నారు. ఓటు మాత్రం ఆలోచించి వేయాలన్నారు. ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజల సొమ్మును కాజేశారన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదన్నారు. ఇది పేదల ప్రభుత్వం కాదని, దొరల, దొంగల ప్రభుత్వమని, దోపిడీ, గుండాల రాజ్యమని ఘాటుగా విమర్శించారు. పోలీసులను కూడా జీతాగాళ్లలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడతాం..

తెలంగాణ ప్రజల సమస్యలపై కొట్లాడే పార్టీ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అని అ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం కమలాపూర్‌ మండలం నుంచి నడికూడ మండలంలోకి ప్రవేశించగా ముస్తాలపల్లి గ్రామ స్టేజీ నుంచి మండల కేంద్రంపైగా నర్సక్కపల్లి అంబేద్కర్‌ దళితకాలనీ మీదుగా పాదయాత్రను కొనసాగించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు షర్మిల అన్నారు. ప్రజలను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి 46 లక్షల మంది నిరుపేదలకు ఇళ్లు కట్టించారని, రైతులకు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్‌దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అముదాలపెల్లి మల్లే్‌షగౌడ్‌, నడికూడ మండల అధ్యక్షుడు జలుగూరి రమేష్‌, నాయకులు పాల్గొన్నారు.

ధర్మారెడ్డి కాదు.. అధర్మారెడ్డి..

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. ధర్మారెడ్డి కాదని, అధర్మారెడ్డి అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నడికూడ మండలం నుంచి పాదయాత్ర సాయంత్రం 4.30 గంటలకు పరకాల పట్టణంలోకి చేరింది. ఈ సందర్భంగా పాత ఏటీఎం సెంటర్‌ సమీపంలో ప్రధాన రోడ్డు మార్గంలో షర్మిల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి అవినీతి అక్రమాలతో ఇప్పటి వరకు రూ.5వేల కోట్ల విలువైన ఆస్తులను వెనకేసుకున్నాడని ఆరోపించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు పేరు చెప్పి 1,200 ఎకరాల భూములను తక్కువ ధరకు రైతుల దగ్గరినుంచి లాక్కొని ఏ ఒక్కరికీ కూడా ఉద్యోగం ఇప్పించలేదని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఏ కాంట్రాక్టును వదలకుండా పనులు చేస్తున్నాడని, కనిపించిన భూమిలో ఏదో ఒక సమస్య సృష్టిస్తూ.. మళ్లీ తానే పరిష్కరించినట్లుగా చేసి సులభంగా భూమిని కాజే సే భూ బకాసురుడు ధర్మారెడ్డి అని ఘాటుగా విమర్శించారు. ఆయన అవినీతిని ఎత్తి చూపిన వైఎస్సార్‌టీపీకి చెందిన 12 మందిపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. అధికార అహంకారంతో స్థానికంగా ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాన్ని ధర్మారెడ్డి క్రూరత్వంగా ముక్క లు చేయించి కూల్చివేయించాడని అన్నారు. టీడీపీలో గెలిచి రాజకీయ వ్యభిచారం చేసి టీఆర్‌ఎ్‌సలోకి వచ్చారని అన్నారు. తెలంగాణకు తొలి స్పీకర్‌ అయిన సిరికొండ మధుసూదనాచారి సొంతూరికి కనీసం రోడ్డు లేదని షర్మిల ఎద్దేవా చేశారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని, వారి కుటుంబంలోనే మంత్రి పదవులు వచ్చాయని అన్నారు. 8 ఏళ్ల కేసీఆర్‌ పాలనలో ఏ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. జయశంకర్‌ పుట్టినగడ్డ అక్కంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ఓ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీలు ఇచ్చిన కేసీఆర్‌.. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. పంట పెట్టుబడులకు రూ.5వేలు ఇచ్చినంత మాత్రాన రైతు కోటీశ్వరుడు కాడని అన్నారు. రాష్ట్రంలో గుడులు, బడులకంటే బ్రాందీషాపులు, బెల్ట్‌షాపులు ఎక్కువయ్యాయని అన్నారు. వైఎస్సార్‌ బిడ్డగా ప్రతీ ఒక్కరు ఆదరిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలపై తొలిసంతకం పెడతానని, బెల్టుషాపులు లేకుండా పూర్తిగా తొలగిస్తానని స్పష్టం చేశారు. వెఎస్సార్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకువస్తానని, పథకాలన్నీ అమలు చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు.

Updated Date - 2022-11-21T00:11:48+05:30 IST