కేసీఆర్‌పై కక్ష సాధిస్తున్న బీజేపీ

ABN , First Publish Date - 2022-11-24T23:57:50+05:30 IST

జనగామ టౌన్‌, నవంబరు 24: తెలంగాణలో ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ నేతలపై ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులతో దాడులు చేయించి భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు.జనగామ జిల్లాకేంద్రంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్‌పై కక్ష సాధిస్తున్న బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని

తెలంగాణలో పాగా వేసేందుకు కుట్ర

అందుకే టీఆర్‌ఎస్‌ మంత్రులపై ఐటీ దాడులు

బీజేపీ పద్ధతి మార్చుకోకుంటే తిరుగుబాటు తప్పదు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

జనగామ టౌన్‌, నవంబరు 24: తెలంగాణలో ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ నేతలపై ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులతో దాడులు చేయించి భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు.జనగామ జిల్లాకేంద్రంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న సంకేతం ఇచ్చేందుకు బీజేపీ కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నించిందన్నారు. అయినా ఓటమిపాలు కావడంతో తన రూటు మార్చిందన్నారు. సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా బలహీనం చేసి టీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఘటనలో ప్రధాన నిందితుడైన బీఎల్‌.సంతోష్‌ను కాపాడుకునేందుకు బీజేపీ సుప్రీం కోర్టు నుంచి న్యాయవాదులను పంపుతోందన్నారు. రాష్ట్ర మంత్రుల మనోస్తైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఐటీ అధికారులతో దాడులు చేయిస్తోందన్నారు. తెలంగాణలో ఎలాగైనా తిష్ట వేసేందుకు కాషాయ పార్టీ అడ్డదారులు తొక్కుతోందన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో బీజేపీ కక్షపూరిత విధానాల వల్ల ప్రజల నుంచి సింపతి లభిస్తోందన్నారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు, జీఎస్టీ పేరుతో దోపిడీ, వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు కుట్ర, రాష్ట్రాల హక్కులపై దాడి లాంటి బీజేపీ విధానాలను తిప్పికొడుతామని హెచ్చరించారు. ఇందుకోసం టీఆర్‌ఎస్‌తో పాటు అన్ని యూనియన్లను కలుపుకుని ముందుకు పోతామని స్పష్టం చేశారు. టీఆర్‌ ఎస్‌ నాయకులు ప్రెస్‌మీట్లకు పరిమితం కాకుండా బీజేపీపై ప్రజా ఉద్యమాలు చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు విషయమై ఎన్నికల ప్రకటన వచ్చాక ఆలోచిస్తామన్నారు.

పోడు సమస్య పరిష్కరించాలి..

రాష్ట్రంలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను తమ్మినేని కోరారు. సమస్య పరిష్కారానికి చేపట్టిన పోడుభూముల సర్వేను త్వరగా పూర్తి చేసి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో అటవీ అధికారిని గొత్తికోయలు హత్య చేయడం బాధాకరమన్నారు. ఇందులో నక్సలైట్ల ప్రమేయం ఉందని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అసంఘటిత రంగ కార్మికుల జీవో, 2008 డీఎస్‌సీ అభ్యర్థుల సమస్యలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర హామీలను నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జోగు ప్రకాశ్‌, సాంబరాజు యాదగిరి, బొట్ల శ్రీనివాస్‌, బూడిద గోపి, సుంచు విజేందర్‌, ఇర్రి అహల్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సెలూన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయని, వాటికి అనుమతులు ఇవ్వకుండా చూడాలని తమ్మినేని వీరభద్రంను జిల్లా నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. కార్పొరేట్‌ సెలూన్లు వస్తే తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కొలిపాక సతీష్‌, జంపాల వెంకన్న, నరేశ్‌, కడింగుల రాంచందర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-24T23:57:50+05:30 IST

Read more