బయటే బెటర్‌!

ABN , First Publish Date - 2022-11-16T23:29:02+05:30 IST

పచ్చి వడ్లను నేరుగా కొంటున్న వ్యాపారులు అన్నదాతలకు సమయం, శ్రమ ఆదా రేటు కాస్త తక్కువైనా అదే మేలని భావన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతో విసుగొచ్చి ప్రైవేటుకు మొగ్గు

బయటే బెటర్‌!

జనగామ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ధాన్యం అమ్మకం విషయంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. మామూలుగా అయితే రైతులు ఎక్కువగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముతుంటారు. కాగా.. ఈ సీజన్‌లో రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తున్నారు. శ్రమ, కాలం కలిసొస్తుందనే కారణంగా రేటు కాస్త తక్కువైనా ప్రైవేటుగా అమ్ముకునేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. తేమ శాతం, ఆరబోయడం, తూర్పార పట్టడం వంటి సమస్యలేమీ లేకుండా నేరుగా మిల్లులకు చేరవేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ తరహా వైఖరి రైతుల్లో ఈ సీజన్‌లో ఎక్కువగా కనబడుతోంది. మిల్లర్లకు సైతం ధాన్యం అవసరం ఉండడంతో కొనేందుకు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు రూ.100 నుంచి రూ.200 తక్కువగా ఇస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడాల్సిన పరిస్థితి లేకపోతుండడంతో మిల్లర్ల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు.

పనిభారం లేదు.. సమయం వృథా కాదు..

ప్రధానంగా పని భారాన్ని తగ్గించుకోవడం, సమయాన్ని ఆదా చేసుకోవడం కోసమే రైతులు ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముతున్నారు. అదే కొనుగోలు కేంద్రాలకు వెళితే అక్కడ తేమశాతాన్ని పరిశీలించి 17 కంటే ఎక్కువ ఉంటే ధాన్యాన్ని ఆరబోయాలని చెప్తారు. దీంతో మూడు, నాలుగు రోజులు ఆరబోయాల్సి వస్తుంది. అంతేగాకుండా ధాన్యంలో మట్టిపెల్లలు, చెత్త, గడ్డి పొల్లు లాంటివి ఉంటే తూర్పార పట్టి తెమ్మంటారు. ఇవన్నీ పూర్తి అయినప్పటికీ గన్నీ సంచుల కొరత, లారీలు సకాలంలో రాకపోవడం వంటి కారణాలతో కాంటా ఆలస్యం అవుతుంది. ఈ లోగా వర్షం పడితే ధాన్యం అంతా పనికిరాకుండా పోతుంది. దీనికి తోడు హమాలీ చార్జీలు సైతం రైతులే భరించాలి. వీటన్నింటినీ తప్పించుకోవాలనే ఉద్దేశంతో రైతులు ఈ సీజన్‌లో ఎక్కువగా మిల్లర్లకు అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. పొలం నుంచి నేరుగా మిల్లులకే తరలిస్తున్నారు. ధర విషయంలో మిల్లరు, రైతు ఒక ఒప్పందానికి రాగానే కాంటా వేసి డబ్బులు ఇస్తున్నాడు. కాంటా కాగానే డబ్బులు కావాలంటే ఒక ధర, 15 రోజుల తర్వాత కావాలంటే మరొక ఒక ధర ఇస్తున్నారు. తేమ శాతాన్ని బట్టి క్వింటాకు రూ.1600 నుంచి రూ.1950 వరకు మిల్లర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏ-గ్రేడ్‌ ధర రూ. 2060, బి-గ్రేడ్‌ ధర రూ.2040 ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధర కంటే మిల్లర్లు రూ. 100 నుంచి రూ. 300 వరకు తక్కువగా ఇస్తున్నారు. కేంద్రాల్లో ఆరబోసిన తర్వాత మద్దతు ధరకు అమ్మినా, మిల్లరు వద్ద తక్కువ ధరకు పచ్చి ధాన్యం అమ్మినా పెద్ద తేడా ఏమీ ఉండకపోవడంతో మిల్లర్ల వైపే ఆసక్తి చూపుతున్నారు.

మిల్లరుకూ అవసరమే..!

ధాన్యాన్ని కొనడానికి మిల్లర్లు కూడా ఇష్టంగానే ఉన్నారు. గత సీజన్‌లో ప్రభుత్వం ఇచ్చిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను మిల్లర్లు ప్రభుత్వానికి అందించలేదు. నూక ఎక్కువగా కావడం, నష్టం ఎక్కువగా జరిగిన కారణంగా సకాలంలో సీఎంఆర్‌ ఇవ్వలేదు. దీనికి తోడు కొందరు మిల్లర్లు సీఎంఆర్‌ కింద ఇచ్చిన వడ్లను ఇతర జిల్లాలకు పంపించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుండడంతో ఆ లోటును భర్తీ చేసేందుకు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మిల్లర్లు జిల్లాలో ధాన్యం కొని డిమాండ్‌ ఉన్న ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రైతుల వద్ద నుంచి ధాన్యం కొంటున్నారని తెలుస్తోంది.

కేంద్రాలకు అంతంత మాత్రంగానే..

జిల్లాలో రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్ముకుంటుం డడంతో కేంద్రాలకు తక్కువగానే ధాన్యం వస్తున్నట్లు అధికారులు సైతం చెబుతున్నారు. జిల్లాలో ఈనెల 5 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. జిల్లావ్యాప్తంగా 180 కేంద్రాలు ప్రారంభించాలని అధికారులు భావించగా ఇప్పటి వరకు 175 కేంద్రాల ను తెరిచారు. కాగా.. ఈ 10 రోజుల్లో కేవలం 18 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కాంటా వేశారు. ఈ లెక్కన ఈ సీజన్‌లో సేకరించాల్సిన ధాన్యం అంచనాను అందుకోవడం కష్టంగానే ఉంది. ప్రస్తుత సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 2.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందులో 50 వేల మెట్రిక్‌ టన్నుల వరకు రైతులు తినడానికి సన్నరకం ఉంచుకోగా.. మిగిలిన 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. కాని రైతులు మిల్లర్ల వైపు మొగ్గు చూపడంతో ఈ సీజన్‌లో కేవలం 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు మాత్రమే కొనుగోళ్లు అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2022-11-16T23:29:02+05:30 IST

Read more