‘యాక్షన్‌’.. టెన్షన్‌

ABN , First Publish Date - 2022-12-12T00:07:13+05:30 IST

మావోయిస్టు యాక్షన్‌టీంల సంచరిస్తున్నాయనే వార్తలు కలవరపెడు తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అవి ప్రవేశించాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. యాక్షన్‌టీం సభ్యుల వివరాలతో పోలీసులు పోస్టర్లు విడుదల చేయడం దీనికి బలం చేకూరింది.

‘యాక్షన్‌’.. టెన్షన్‌

ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోకి మావోయిస్టులు

ఛత్తీ్‌సగఢ్‌ నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలోకి ప్రవేశం

యాక్షన్‌టీంలు వచ్చినట్టు ప్రచారం

ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం

నలుగురు సభ్యుల వివరాలతో పోస్టరు విడుదల

సరిహద్దుల్లో భారీగా కూంబింగ్‌, డ్రోన్లతో సెర్చింగ్‌

మావోయిస్టు యాక్షన్‌టీంల సంచరిస్తున్నాయనే వార్తలు కలవరపెడు తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అవి ప్రవేశించాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. యాక్షన్‌టీం సభ్యుల వివరాలతో పోలీసులు పోస్టర్లు విడుదల చేయడం దీనికి బలం చేకూరింది.

భూపాలపల్లి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీ్‌సగఢ్‌లో అక్కడి ప్రభుత్వం ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ చేపట్టింది. సుమారు 4 వేల మందికిపైగా కేంద్ర పోలీసులతో ప్రత్యేక టీంలుగా ఏర్పడి మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రణాళిక రూపొందించింది. నక్సల్‌ ప్రాబల్యం ఉన్న బీజాపూర్‌, సుక్మా, దంతెవాడ, బస్తర్‌, పూజర్‌కాంకేడ్‌ తదితర జిల్లాల్లో ఈ ఆపరేషన్‌ ప్రహార్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒకేసారి వేలాది మంది పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో నక్సల్స్‌ స్థావరాలను గుర్తిస్తూ పోలీసు బృందాలు దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో కూడా పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలనే ఆలోచనతో మావోయిస్టులు కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి వ్యూహాలకు పోలీసులు చెక్‌ పెడుతున్నారు. తెలంగాణలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఇదే క్రమంలో 22 ఏళ్ల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు వ్యూహ రచన చేసినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. ఛత్తీ్‌సగఢ్‌లోని అరణ్య ప్రహార్‌ను ఎదుర్కొంటేనే తెలంగాణలో ఉద్యమాన్ని బలోపేతం చేయొచ్చని సరిహద్దు దాటినట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో మావోయిస్టుల వ్యూహలకు చెక్‌ పెట్టేందుకు పోలీసు బాస్‌లు రంగంలోకి దిగారు.

తెలంగాణలో ఎంట్రీ..

ఇటీవల ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కొండాపూర్‌ గ్రామశివారు బస్తరుగుంపుకు చెందిన సబకా గోపాల్‌(45)ను ఇన్‌ఫార్మర్‌ నేపంతో మావోయిస్టులు హతమార్చారు. ఈ క్రమంలో డిసెంబరు 2 నుంచి 8 వరకు పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేయగా వెంకటాపురం, ఏటూరునాగారం పోలీసులకు పది మంది మావోయిస్టు సానుభూతిపరులు పట్టుబడ్డారు. వారి నుంచి కిట్‌ బ్యాగులు, పెన్‌డ్రైవ్‌లు, విప్లవ సాహిత్యం, ప్లాస్టిక్‌ షీట్లు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీన పర్చుకున్నారు. వీరితో పాటు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి అందిన సమాచారంతో ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులు యాక్షన్‌టీంలు సంచరిస్తున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్‌, మహాముత్తారం, భూపాలపల్లి, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లో మావోయిస్టు యాక్షన్‌టీంలు ఆశ్రయం తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు కూంబింగులను ముమ్మరం చేశారు. నలుగురు మావోయిస్టు యాక్షన్‌టీం సభ్యులు భద్రు, మహేష్‌, మహేందర్‌, కరుణాకర్‌ చిత్రాలతో పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మావోయిస్టు యాక్షన్‌టీం సభ్యలను పట్టిస్తే లక్షల్లో నగదు బహుమతులు అందిస్తామని ప్రజలకు ఆఫర్‌ ఇస్తున్నారు.

కూంబింగ్‌లు.. సెర్చింగులు..

మావోయిస్టు యాక్షన్‌టీం ములుగు, భూపాలపల్లి జిల్లాలో ప్రవేశించాయనే ప్రచారంతో పోలీసులు అప్రమత్తవుతున్నారు. స్వయంగా భూపాలపల్లి ఎస్పీ జె.సురేందర్‌రెడ్డి, ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ రంగంలోకి దిగారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లోకి యాక్షన్‌టీంలు ఎంట్రీ ఇచ్చాయనే సమాచారంతో ఆ ప్రాంతంలోని పోలీసులను అలర్ట్‌ చేశారు. ఇప్పటికే ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, భూపాలపల్లి జిల్లా పలిమెల, మహదేవపూర్‌, మహాముత్తారం, భూపాలపల్లి అటవీ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బలగాలతో పాటు డ్రోన్‌ కెమెరాలతో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. అడవుల్లో ఎక్కడ దాగి ఉన్నా కనిపెట్టేలా ఎక్కువ మెగాపిక్సల్‌ డ్రోన్‌ కెమెరాలను సైతం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల హెచ్చరికలతో పాటు స్పెషల్‌ పార్టీ బలగాల కూంబింగ్‌లతో అటవీ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌ్‌సతోపాటు ములుగు జిల్లాలోని సమ్మక్క బ్యారేజీ వద్ద పోలీసుల బందోబస్తును పెంచారు.

లీడర్స్‌.. బీ అలర్ట్‌!

మావోయిస్టు యాక్షన్‌టీంలు జిల్లాల్లో ప్రవేశించాయని జరుగుతున్న ప్రచారానికి తోడు పోలీసుల హెచ్చరికలు నేతలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల పోలీసులు ఇప్పటికే అధికార పార్టీ నాయకులను, మావోయిస్టు టార్గెట్‌లను అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో గ్రామాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ, ఎంపీపీలతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్‌లను సైతం స్థానికంగా ఉండకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అనుమానితులు గ్రామంలో ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ప్రజలు అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2022-12-12T00:07:13+05:30 IST

Read more