తొలిరోజే లొసుగులు

ABN , First Publish Date - 2022-10-15T05:05:15+05:30 IST

తొలిరోజే లొసుగులు

తొలిరోజే లొసుగులు
వరంగల్‌లో సర్వే జరుపుతున్న జీడబ్ల్యూఎంసీ అధికారుల బృందం

నగరంలో కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భవనాల సర్వే ప్రారంభం

రంగంలోకి దిగిన బల్దియా బృందాలు

ట్రేడ్‌ లైసెన్స్‌ ఉన్న షాపులకు రెసిడెన్షియల్‌ అనుమతులు

యజమానులకు డాక్యుమెంట్స్‌ కాల్‌ ఫర్‌ నోటీసులు

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), అక్టోబరు 14 : కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ భవనాల వాస్తవికత అనుమతులు, పన్నుల మదింపు, చెల్లింపుల లెక్కల వెలికితీతను వరంగల్‌ మహానగర పాలక సంస్థ మొదలెట్టింది. ’అనుమతులు ఒకటి.. నిర్మాణం మరొకటి’ పేరుతో ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో బల్దియా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో కమిషనర్‌ ప్రావీణ్య ఆదేశించిన సర్వే శుక్రవారం ప్రారంభమైంది. హనుమకొండలో కాళోజీ జంక్షన్‌ నుంచి హనుమకొండ చౌరస్తా వరకు లక్ష్యంగా బల్దియా అధికారుల బృందం సర్వే చేపట్టింది. వరంగల్‌ ములుగు రోడ్డు నుంచి పోచమ్మమైదాన్‌ జంక్షన్‌ వరకు మరో బృందం సర్వే జరిపింది.

బయటపడ్డ అక్రమాలు

తొలి రోజు సర్వేలోనే అనేక లొసుగులు బయటపడ్డాయి. హనుమకొండ, వరంగల్‌ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేలో చాలా వరకు రెసిడెన్షియల్‌ అనుమతులతోనే ఉన్నాయి. మరికొన్ని భవనాల యజమానులు తరాల నుంచి సంక్రమించిన ఆస్తిగా చెప్పారు. అప్పట్లో అనుమతులే తీసుకొలేదని వెల్లడించారు. ఈ క్రమంలో నిబంధనల మేరకు జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా 1984 సంవత్సరానికి ముందు అనుమతుల అంశాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఆ తదుపరి భవనాల అనుమతులే ఏ విభాగంలో ఉన్నాయి.. అంటే కమర్షియలా, రెసిడెన్షియలా అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆయా భవనాల కొలతలు తీసుకొని ఆ మేరకు పన్ను మదింపు జరిగిందా, రివైజ్‌ చేయాలా అనే అంశాలను పరిశీలించారు. ఈ కోణంలో కొన్ని భవనాల కొలతలు వాస్తవ రీతిలో లేవని అధికారులు నిర్ధారణలోకి వచ్చింది. కొలతల ఉన్న మేరకు పన్ను విధింపు జరగలేదనే విషయాలను సర్వే బృందం గుర్తించింది. ఈ క్రమంలో రెవెన్యూ విభాగం అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు అయ్యింది. ఒక విధంగా సర్వేతో బల్దియా అధికారులు తమ తప్పులను తామే వెలుగులోకి తీసుకుంటున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ కలిగిన భవనాలు రెసిడెన్షియల్‌ అనుమతులు కలిగి ఉండడం బల్దియా రెవెన్యూ విభాగం అవినీతిని బహిర్గతం చేస్తోంది. 

యజమానులకు నోటీసులు

జీడబ్ల్యూఎంసీ ముందస్తు సమాచారం లేకుండా సర్వే చేపట్టడంతో భవనాల యజమానులు ఇబ్బందులకు గురయ్యారు. సర్వే పేరుతో వచ్చి ఏకంగా ప్లాన్‌, అనుమతులు, పన్నుల చెల్లింపు వివరాలు, ఇతరత్రా డాక్యుమెంట్లను చూపించాలని కోరడంతో యజమానులు కంగుతిన్నారు. ఇప్పటికిప్పుడు తేలేమని కొందరు తేగేసి చె ప్పారు. మరికొందరు తాము లీజ్‌, కిరాయికి తీసుకున్నామని చెప్పారు. యజమాను లు అందుబాటులో లేరని, కొందరు ఇతర దేశాల్లో ఉన్నారని తెలిపారు. దీంతో సర్వే లో సమస్యలను గుర్తించిన జీడబ్ల్యూఎంసీ అధికారులు.. డాక్యుమెంట్స్‌ కాల్‌ ఫర్‌ నోటీసులను యజమానులకు ముందస్తుగా జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కమిషనర్‌ ప్రావీణ్య నోటీసుల జారీకి టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి దిశా, నిర్దేశం చేశారు.


Read more