కరోనాలో పనిచేసిన సిబ్బందికి వెయిటేజీ

ABN , First Publish Date - 2022-03-16T08:36:11+05:30 IST

కరోనా విపత్కర సమయంలో నిర్విరామంగా పనిచేసిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక వెయిటేజీ కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

కరోనాలో పనిచేసిన సిబ్బందికి వెయిటేజీ

  • జిల్లాల్లోనూ గుండెసంబంధ శస్త్రచికిత్సలు
  • శాసన మండలిలో మంత్రి హరీశ్‌రావు 


హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కరోనా విపత్కర సమయంలో నిర్విరామంగా పనిచేసిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఉద్యోగాల భర్తీలో ప్రత్యేక వెయిటేజీ కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి సమాధానమిచ్చారు. సర్కారు బడుల్లో స్కావెంజర్ల నియామకంపై విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళతానని, ధరణి పోర్టల్‌లో సవరణలపై సంబంధిత విభాగాలతో చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. అందులో భాగంగానే వరంగల్‌, కరీంనగర్‌లో గుండెకు శస్త్రచికిత్సలు నిర్వహించే ఏర్పాట్లు చేశామని, గాంధీ దవాఖానలో కొత్తగా క్యాథ్‌లాబ్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ద్యవ్య వినిమియ బిల్లుపై జరిగిన చర్చ, బడ్జెట్‌కు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను విపక్ష సభ్యులు సైతం ప్రశంసించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.  వారి ప్రశంసలు చూస్తుంటే.. తమ సర్కారు ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా పనిచేస్తోందన్న భావన కలుగుతోందని ఆయన వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లు లేకుండా ఖజానా నుంచి ఒక్క పైసా కూడా బయటకుపోదని ఆయన చెప్పారు. 


7 రోజుల సభ.. నిరవధిక వాయిదా

బడ్జెట్‌ సమావేశాలు.. ఏడే పనిదినాల్లో ముగిశాయి. ఈ నెల 7న సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సభలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందింది. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి సభను నిరవధికంగా వాయిదావేశారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచీ తొలి సారిగా గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలు జరిగాయి. ముగ్గురు బీజేపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి స్పీకర్‌ను నిలదీశారని సమావేశాలు మొత్తం సస్పెండ్‌ చేశారు.  మొత్తం 54.47 గంటల పాటు శాసనసభ సమావేశాలు జరగగా సీఎం, మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కలుపుకొని అధికార పక్ష సభ్యులే 42.31 గంటల పాటు మాట్లాడారు. కాగా, శాసన సభ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్‌ రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే జీరో అవర్‌ను మొదలుపెట్టారు. దీంతో ఉదయం పది నుంచి పదకొండున్నర వరకు ఎమ్మెల్యేలంతా సమస్యలను ఏకరువు పెట్టారు.

Read more