వీఆర్‌ఏలకు పే స్కేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-02-23T09:01:04+05:30 IST

సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినట్లుగా తమకు పే స్కేల్‌ అమలు చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని..

వీఆర్‌ఏలకు పే స్కేలు ఇవ్వాలి

ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలి

ఇందిరాపార్కు వద్ద కదం తొక్కిన వీఆర్‌ఏలు

సమస్యను అసెంబ్ల్లీలో ప్రస్తావిస్తాం: ఈటల

పార్టీలకతీతంగా మద్దతు తెలపాలి: సీతక్క

రైతుల తరహాలో ఉద్యమం చేయాలి: తమ్మినేని


కవాడిగూడ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించినట్లుగా తమకు  పే స్కేల్‌ అమలు చేస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) డిమాండ్‌ చేశారు. 55 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, అర్హత కలిగిన వీఆర్‌ఏలకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కరోనాతో మరణించిన వీఆర్‌ఏలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ వీఆర్‌ఏ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది వీఆర్‌ఏలు ఇందిరాపార్కు ధర్నా చౌక్‌వద్దకు తరలి వచ్చి మహా ధర్నా నిర్వహించారు. దీంతో ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. ఈ ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం, మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తదితరులు పాల్గొని వీఆర్‌ఏలకు సంఘీభావం తెలిపారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో రెవెన్యూ శాఖ వెలవెలబోతోందన్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగిన రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మార్వోపై పెట్రోల్‌ పోసి తగులబెట్టిన చరిత్ర దేశంలో తెలంగాణకే దక్కిందని ఎద్దేవా చేశారు. వీఆర్‌ఏల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తోందని, వారి సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో నిరుద్యోగులే కాకుండా ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులతో పెట్టుకున్నందుకే విజయవాడ భగ్గుమన్నదని, ఈ విషయం కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.  సీతక్క మాట్లాడుతూ పార్టీల కతీతంగా నాయకులు వీఆర్‌ఏలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. కాగా, వీఆర్‌ఏలు ఐక్యంగా పోరాడి తమ హక్కులు సాధించుకోవాలని తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. ఢిల్లీ రైతుల ఉద్యమం స్ఫూర్తిగా ప్రభుత్వంతో యుద్ధం చేసి ఉద్యోగాలు సాధించుకోవాలని అన్నారు. మహాధర్నాలో వీఆర్‌ఏ జేఏసీ నేతలు వంగూరి రాములు, కందుకూరి బాపుదేవ్‌, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


బానిసల కంటే హీనంగా వీఆర్‌ఏల స్థితి.. కేసీఆర్‌కు రేవంత్‌ లేఖ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): గతంలో ఇచ్చిన హామీ మేరకు వీఆర్‌ఏలకు పే స్కేల్‌ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని, సొంత గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్నారు. ఈ మేరకు మంగళవారం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో వీఆర్‌ఏల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని, వారి హక్కులనూ కాలరాస్తున్నారని అన్నారు. చాలీ చాలని జీతాలతో ఏళ్ల తరబడి పదోన్నతులూ లేకుండా వీఆర్‌ఏల పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పారు. వీఆర్‌ఏల పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.

Read more