ముసురుతో విపత్తి

ABN , First Publish Date - 2022-12-12T23:59:29+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న ముసురుతో పత్తి తడిసి ముద్దయింది. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే అక్టోబరు మాసంలో కురిసిన వర్షాలతో చాలాచోట్ల పత్తిచేలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నల్లరేగడి నేలల్లో నీటినిల్వ ఉండి చేలు జాలుపట్టి తెగుళ్లబారిన పడి రైతులు నష్టపోయారు.

ముసురుతో విపత్తి

గణనీయంగా తగ్గనున్న దిగుబడి

రూ.7వేలకు పడిపోయిన ధర

నల్లగొండ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న ముసురుతో పత్తి తడిసి ముద్దయింది. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే అక్టోబరు మాసంలో కురిసిన వర్షాలతో చాలాచోట్ల పత్తిచేలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నల్లరేగడి నేలల్లో నీటినిల్వ ఉండి చేలు జాలుపట్టి తెగుళ్లబారిన పడి రైతులు నష్టపోయారు. ఆ సమయంలో వరుస వర్షాలతో కలుపు తీతకు గుంటుక తోలే పరిస్థితి కూడా లేకపోవడంతో రైతులు చేలను అలాగే వదిలిపెట్టడంతో పత్తి దిగుబడి అరకొరగా వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దిగుబడి రాకున్నా క్వింటా పత్తికి రూ.9,300 ధర దక్కడంతో రైతులు నష్టపోకుండా కొంతలో కొంత బయటపడ్డారు. ప్రస్తుతం క్వింటా పత్తికి రూ.7,300కు మించి ధర రావడం లేదు. దీనికి తోడు అడపాదడపా ముసురు కురుస్తుండడంతో పత్తి తడిచి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

పడిపోయిన దిగుబడి

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 9.40లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 6.40 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.25లక్షలు, యాదాద్రి జిల్లాలో 75వేల ఎకరాల్లో పత్తి సాగైంది. నల్లగొండ జిల్లాలో వరితో పాటు పత్తికి రైతులు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, సూర్యాపేటలో పత్తితో పాటు వరి సాగైంది. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా వరి సాగైంది. కాగా, ప్రస్తుతం తుఫాన్‌ కారణంగా కురుస్తున్న అకాల వర్షాలతో పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఏడాది వానాకాలంలో సైతం పత్తి దిగుబడులు సరిగారాలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట తడిసి నల్లబారుతుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. తొలుత తీసిన పత్తి అంత నాణ్యత కూడా లేకపోగా గూడలు కట్టింది. ప్రస్తుతమూ అదే పరిస్థితి ఉంది. ఎంతో కొంత దిగుబడి వస్తుందనుకున్న సమయంలో ధర తగ్గడంతో పెట్టుబడులైనా వెళ్తాయా లేదా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని రైతులు భావించగా, 4 నుంచి 6 క్వింటాళ్ల లోపు వస్తుండటంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ప్రభుత్వరంగ సంస్థలైన సీసీఐ ఈసారి పత్తి కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.6,380గా ఉంది. అయితే మొదట మార్కెట్‌లో క్వింటాకు రూ.9వేలకు పైగా ధర పలుకుతుండడంతో సీసీఐ కొనుగోళ్లు చేపట్టడం లేదు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో క్వింటాకు రూ.7,300 మాత్రమే ధర దక్కుతోంది. తుఫాన్‌తో పత్తి ధర మరింత పడిపోయే అవకాశం ఉంది. పత్తి తీతకు కొన్ని ప్రాంతాల్లో కూలీలు దొరక్కపోవడంతో ఇతర జిల్లాల నుంచి, ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పత్తి తీయిస్తున్నారు.

దళారుల మోసం

వర్షాలతో పత్తి తడుస్తుండటంతో దళారులు రైతులను మోసం చేసేందుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే క్వింటాకు రూ.7,300 ధర పడిపోయిందని, రానున్న రోజుల్లో ధర రూ.5,000 లోపే ఉం టుందని, రైతులను భయపెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లా లో మందకొడిగానే పత్తి కొనుగోళ్లు సాగుతుండగా ఉన్న పత్తిని దళారులు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు లేకపోవడం వారికి కలిసొచ్చింది. ట్రాన్స్‌పోర్ట్‌ చేసి జిన్నింగ్‌ మిల్లులకు వెళ్లలేని పరిస్థితులో ఉన్న చిన్నాచితక రైతులు గ్రామాల్లోనే దళారులకు పత్తి విక్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.

పత్తి పూర్తిగా తడిసింది : వెంకటేశ్వర్లు, నర్సింగ్‌భట్ల, నల్లగొండ

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి పూర్తిగా తడిసింది. ఈ ఏడాది పత్తి దిగుబడి రాలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. చివరగా పత్తి ఏరుదామని అనుకుంటున్న తరుణంలో తుఫాన్‌తో పత్తి తడిసింది. దీంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో ఎకరానికి వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పత్తి సా గు చేస్తే తీరా దిగుబడి రాలేదు. ఉన్న పత్తిని దక్కించుకుందామన్నా తుఫాను మా ఆశలపై నీళ్లు చల్లింది.

Updated Date - 2022-12-12T23:59:29+05:30 IST

Read more