ఊపందుకున్న ఆయిల్‌పామ్‌

ABN , First Publish Date - 2022-10-15T04:59:52+05:30 IST

ఊపందుకున్న ఆయిల్‌పామ్‌

ఊపందుకున్న ఆయిల్‌పామ్‌
పర్వతగిరిలో మంత్రి భూమిలో సాగుచేస్తున్న ఆయిల్‌పామ్‌ పంట

జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం

నాలుగేళ్లలో 56 వేల ఎకరాల లక్ష్యం

ఈ ఏడాది 9వేల ఎకరాల్లో సాగు..

10ఎకరాల్లో సాగు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి


పర్వతగిరి, అక్టోబరు 14: సంప్రదాయ పంటల సాగుతో దిగుబడులు తగ్గి రైతులు పడుతున్న ఇబ్బందు లను దృష్టిలో ఉంచుకుని ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభు త్వం ప్రోత్సాహాన్నిస్తోంది. ఇతర దేశాల నుంచి నూనెల ను దిగుమతి చేసుకోవడంతో ప్రజలపై ధరాభారం పడుతోంది. ఈ క్రమంలో జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో నాలుగేళ్లలో 56వేల ఎకరాల్లో సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ప్రస్తుత ఏడాది 9వేల ఎకరాల్లో సాగుకు నిర్దేశించగా, ఇప్పటికే జిల్లాలో సాగు మొదలుపెట్టారు. సంగెం మండలంలోని రాంచంద్రాపురం గ్రామంలో ఏడాది క్రితం నర్సరీని ఏర్పాటు చేసి రాంచరణ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ అందిస్తోంది. నాలుగేళ్లలో జిల్లాలో ఆయిల్‌ మిల్‌ను ఏర్పాటుచేసి రైతులు పండించిన ఆయిల్‌పామ్‌ గేలలను మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేయనుంది. 


12 వేల ఎకరాలకు దరఖాస్తులు

జిల్లాలో ప్రస్తుత ఏడాది మార్చి వర కు 9 వేల ఎకరాల్లో సాగు చేయడానికి గాను నిర్ణయించారు. దీనికి గాను రైతుల నుంచి దరఖాస్తులు కోరగా, ఏకంగా 12 వేల ఎకరాల్లో సాగు చేయడానికి రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం అనుకున్నదానికన్నా రైతుల నుంచి అధికంగా స్పందన వచ్చింది. మొక్కలతో పాటు సాగునీటికి డ్రిప్‌ను ప్రభుత్వం సబ్సిడీతోపాటు బ్యాంకు రుణాలు అందించనుంది. దరఖాస్తులు చేసుకున్న రైతుల సాయిల్‌ టెస్టుకు పంపించారు. ఫలితాల ఆధారంగా రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న రైతులకు తొలుత అందించి, దరఖాస్తులు చేసుకున్న రైతులందరికీ మొక్కలను అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఎంపికైన రైతులకు సాగు పట్ల శిక్షణ ఇస్తున్నారు. సాగు ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభమై సుమారు 30 ఏళ్ల వరకు పంట వస్తుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.


పర్వతగిరి చుట్టుపక్కల ఆయిల్‌మిల్లు

ఆయిల్‌పామ్‌ పంట దిగుబడి ప్రారంభమైన  తరువాత ఇక్కడే ప్రాసెస్‌ చేయడానికి ఆయిల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి గాను రాంచరణ్‌ ఆయిల్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు చర్యలు చేపడుతున్నారు. పర్వతగిరి చుట్టుపక్కల మిల్లును ఏర్పాటు చేయడానికి గాను ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. జిల్లాలో సాగు చేపట్టిన రైతులు ఎక్కువ దూరం వెళ్లకుండా గెలలను ఇక్కడే మిల్లుకు తరలించేలా చర్యలు చేపడుతున్నారు. 


భవిష్యత్తులో మంచి డిమాండ్‌  : ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి

సంప్రదాయ పంటలనే గాకుండా ప్రత్నామ్నాయ పంటలను సాగుచేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తోంది. రైతుల్లో మరింతగా ఉత్సాహం నింపేందుకు నేనే స్వయంగా పర్వతగిరిలో 10ఎకరాల్లో సాగుచేస్తున్నాను. ఆయిల్‌పామ్‌ సాగుకు భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుంది. సంప్రదాయ పంటలలో పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గడ మే గాకుండా విపరీతమైన రసాయనాలు వాడడంతో భూ సారం కోల్పోతుంది. ఆయిల్‌పామ్‌ ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. రైతులు ఈ దిశగా చొరవ చూపాలి.


ఆయిల్‌పామ్‌ వైపు రైతులు దృష్టిసారించాలి: శ్రీనివాస్‌రావు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి

రైతులు ఇతర పంటలకన్నా ఆయిల్‌పామ్‌ సాగుపై దృష్టి సారించాలి. పంట సాగు ప్రారంభ మయ్యాక నాలుగేళ్ల తర్వాత దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు ఉంటుంది. ఎకరానికి రూ.లక్ష మేర ఆదాయం వస్తుంది. ఎంతమంది రైతులు దరఖాస్తు చేసుకున్నా ప్రాధాన్య క్రమంలో వారంద రికీ మొక్కలు అందిస్తాం. నాలుగేళ్లలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. 

Read more