తెలంగాణపై ‘యూపీ’ ప్రభావం!

ABN , First Publish Date - 2022-03-09T08:56:49+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న వెలువడనున్న ఫలితాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

తెలంగాణపై ‘యూపీ’ ప్రభావం!

  • అక్కడి ఫలితాలతో రాష్ట్ర రాజకీయాలలో మార్పులు
  • టీఆర్‌ఎ్‌సకు కీలకం.. తేలనున్న కేసీఆర్‌ కూటమి యత్నాలు
  • ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకే మొగ్గు.. కాంగ్రెస్‌కు సంకటమే! 


హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 10న వెలువడనున్న ఫలితాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తుండడం, తెలంగాణలో ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్‌, బీజేపీ పోటీ పడుతున్న నేపథ్యంలో యూపీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. దేశంలోనే అత్యధిక సంఖ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం కావడంతో యూపీ ఎన్నికల ఫలితాలే భవిష్యత్తు జాతీయ రాజకీయాలకు సంకేతాలుగా చెప్పుకొంటున్నారు. రాష్ట్రంలోనూ టీఆర్‌ఎ్‌సలో కీలక మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో కూటమి ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్‌ పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోనే బీజేపీ పనైపోయిందని, యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమిని చవి చూడనుందని ఆయన జోస్యం కూడా చెప్పారు. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ అత్యధికం బీజేపీకే ఓటు వేశాయి. అదే జరిగితే.. కేసీఆర్‌ ప్రయత్నాలు మందగించవచ్చని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం మరోసారి వాయిదా పడవచ్చని అంటున్నారు.


కేసీఆర్‌ అంచనాలే నిజమై.. యూపీలో బీజేపీ ఓటమిపాలైతే మాత్రం కూటమి ప్రయత్నాల్లో  ఆయన దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారం సాధిస్తే.. ఆ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌తో కలిసి జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లోనూ పెనుమార్పులు సంభవించే అవకాశం ఉందంటున్నాయి. 


ప్రత్యామ్నాయ రేసులో ఎవరు ముందు?  

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య జరుగుతున్న ప్రత్యామ్నాయ రేసుపైనా యూపీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. వరుస ఎన్నికల్లో ఓటములు, గెలిచిన ప్రజా ప్రతినిధులు టీఆర్‌ఎ్‌సలోకి ఫిరాయించడం, ఉప ఎన్నికల్లోనూ ఓటమితో రాష్ట్ర కాంగ్రె్‌సలో స్తబ్ధత నెలకొంది. పార్టీలో ఉత్సాహం నింపేందుకు ప్రజాకర్షక నేతగా భావించే రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిగా నియమించినా.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఘోర ఓటమి, ముఠా రాజకీయాలు కార్యకర్తలను నిరుత్సాహానికి గురు చేస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకుని ఆ తర్వాత రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ..  కాంగ్రె్‌సను వెనక్కు నెట్టే యత్నం చేస్తోంది.


ఇక యూపీలో బీజేపీ మరోసారి విజయం సాధిస్తే తెలంగాణలోనూ పార్టీ దూకుడు పెంచుతుందని, ప్రత్యామ్నాయ రేసులో మరికాస్త ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. కొన్ని ఎగ్టిట్‌ పోల్స్‌ చెప్పినట్లుగా యూపీలో బీజేపీ ఓటమిపాలైతే ఆ ప్రభావం రాష్ట్రంలో బీజేపీపై మరో రకంగా ఉండవచ్చంటున్నారు. పైగా జాతీయ స్థాయిలోనూ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారన్నదానికి సంకేతమవుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగైతే దేశవ్యాప్తంగా, తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న నిర్మాణం, రేవంత్‌ ప్రజాకర్షణకు ఈ అనుకూలత కూడా తోడైతే ప్రత్యామ్నాయ రేసులో ఆ పార్టీ దూసుకుపోతుందని, బీజేపీ దూకుడుకు కళ్లెం పడుతుందని అంటున్నారు. 

Updated Date - 2022-03-09T08:56:49+05:30 IST