పాపం.. పసివాళ్లు

ABN , First Publish Date - 2022-08-31T09:22:02+05:30 IST

‘‘అమ్మ ఏది నాన్నా! అమ్మ దగ్గరకు పోదాం’’ అంటూ చిన్నారుల ఏడుపులు.

పాపం.. పసివాళ్లు

అమ్మ పాలు కూడా మరవని శిశువులు 

తల్లులను కోల్పోయిన పిల్లలు 

పాల కోసం గుక్కపెట్టి ఏడుపు

లావణ్యకు చందాలు వేసుకొని అంత్యక్రియలు

రంగారెడ్డి అర్బన్‌/ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30: ‘‘అమ్మ ఏది నాన్నా! అమ్మ దగ్గరకు పోదాం’’ అంటూ చిన్నారుల ఏడుపులు. తల్లి పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తున్న శిశువులు. తల్లి ఒడిలో ఉండాల్సిన పిల్లలను భుజాన వేసుకొని వారిని ఓదార్చలేక, తనకు ఓదార్పు లేక రోదిస్తున్న తండ్రి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ తరువాత మృతి చెందిన నలుగురు మహిళల కుటుంబాల్లో నిండిన విషాదమిది. వీరి దయనీయ పరిస్థితిని చూసిన బంధువులు, గ్రామస్థుల విచారంతో ఆయా గ్రామాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మాడ్గుల మండలం కోల్కుపల్లి గ్రామానికి చెందిన మమత(28), అదే మండలం రాజీవ్‌గాంధీ తండాకు చెందిన మౌనిక(22), ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట్‌కు చెందిన ఎ.లావణ్య(26), మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ(28) కు.ని. ఆపరేషన్ల తరువాత చనిపోగా.. వారి అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. కాగా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సీతారాంపేట్‌కు చెందిన లావణ్యకు భర్త లింగస్వామి, కూతుళ్లు అక్షర(6), భావన(4), తొమిది నెలల అనిరుధ్‌ ఉన్నారు. ఈ దంపతులు కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. లావణ్య మృతితో ఈ కుటుంబం వీధిన పడింది. రేపటి నుంచి చిన్న పిల్ల్లలను ఎలా సాకాలంటూ వారిని ఎత్తుకొని లింగస్వామి రోదించడం అందరినీ కలచివేసింది. గ్రామస్థులు, బంధువులు చందాలు వేసుకొని లావణ్యకు అంత్యక్రియలు నిర్వహించారు. వారికి ఉన్న చిన్నపాటి పెంకుటిల్లు కూడా కూలిపోవడంతో ఆ కుటుంబానికి 45 గజాల స్థలంలో రెండు గదులు నిర్మించి ఇవ్వడానికి ఉప్పరిగూడ పీఏసీఎస్‌ చైర్మన్‌ టేకుల సుదర్శన్‌రెడ్డి ముందుకు వచ్చారు. 

Updated Date - 2022-08-31T09:22:02+05:30 IST