మరో ఇద్దరు బాలింతలు నిమ్స్‌కు
ABN , First Publish Date - 2022-09-10T08:21:43+05:30 IST
పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిజేరియన్ అనంతరం అస్వస్థతకు గురైన వారిలో మరో ఇద్దరు బాలింతలను మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు.

పేట్ల బురుజు ఆస్పత్రిలో సిజేరియన్ అనంతరం అస్వస్థత
ఇప్పటికే నిమ్స్‌లో చేరిన ఇద్దరు
ఆర్ఐసీయూలో ఒకరికి చికిత్స
ఘటనపై వైద్య బృందం విచారణ
హైదరాబాద్ సిటీ/షాద్‌నగర్ రూరల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సిజేరియన్ అనంతరం అస్వస్థతకు గురైన వారిలో మరో ఇద్దరు బాలింతలను మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. పేట్లబురుజు ఆస్పత్రిలో ఈ నెల 4న తొమ్మిది మంది ప్రసవించారు. వీరిలో నలుగురికి వాంతులు, జ్వరం, విరేచనాలు, బీపీ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి ఒకరు చనిపోయారు. మరో ముగ్గురిలో మమత అనే బాలింత కోలుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన సీమా బేగం, మొహామ్మేది సల్మాలను మెరుగైన చికిత్స కోసం గురువారం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా శుక్రవారం జేబీరా, షమీరా అనే బాలింతలకు వాంతులు, విరేచనాలు, జ్వరం రావడంతో వారిని కూడా నిమ్స్‌కు తరలించారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గురువారం నిమ్స్‌కు తరలించిన మొహామ్మేది సల్మాకు ఆర్ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సీమా బేగం ఆరోగ్యం కుదటపడింది.కాగా, అస్వస్థతకు గురైన బాలింతలకు కొవిడ్, డెంగీ, మలేరియా పరీక్షలు చేయగా.. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి డాక్టర్ మాలతి వివరించారు. వారు వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు భావిస్తున్నామని చెప్పారు.
వైద్య బృందం విచారణ..
పేట్ల బురుజు ఆస్పత్రిలో ప్రసవం అయిన తొమ్మిది మంది అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై వైద్య బృందం విచారణ నిర్వహిస్తోంది. ఓ బాలింత చనిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డీఎంఈ డాక్టర్ రమే్‌షరెడ్డి, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, డాక్టర్ బాలరాజు, ప్రొఫెసర్ రాజశేఖర్ పేట్లబురుజు ఆస్పత్రికి వెళ్లి విచారణ నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో వైద్య బృందం వెళ్లి బాలింతల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అస్వస్థతకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. నివేదిక రావడానికి వారం, పది రోజులు సమయం పట్టే అవకాశాలున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. కాగా, హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ తర్వాత అస్వస్థతకు గురై చనిపోయిన బాలింత వివరాలను అధికారులు సేకరించారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన అలివేలు కాన్పు కోసం ఈ నెల 4నపేట్లబురుజు ఆస్పత్రిలో చేరింది. అదే రోజు వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. అనంతరం ఆమె అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ విషయమై షాద్‌నగర్ డిప్యుటీ డీఎంహెచ్‌వో డాక్టర్ జయలక్ష్మి శుక్రవారం మొగిలిగిద్ద గ్రామానికి వెళ్లి మృతురాలి భర్త సురేందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన భార్యకు చికిత్స అందించిన రిపోర్టులు కూడా ఇవ్వలేదని సురేందర్ తెలిపాడు. అలివేలు మృతి చెందినట్లు చెప్పి బలవంతంగా పంపించారని వాపోయాడు. చికిత్స రిపోర్టులను ఉస్మానియా, పేట్ల బురుజు ఆసుపత్రుల నుంచి తీసుకురావాలని చించోడు వైద్యాధికారికి జయలక్ష్మి సూచించారు.