అప్పుల బాధతో టీఆర్‌ఎస్‌ నాయకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-06-07T05:35:16+05:30 IST

అప్పుల బాధతో టీఆర్‌ఎస్‌ నాయకుడి ఆత్మహత్య

అప్పుల బాధతో   టీఆర్‌ఎస్‌ నాయకుడి ఆత్మహత్య
బోడ వెంకన్న (ఫైల్‌)

చెన్నారావుపేట, జూన్‌ 6: అప్పుల బాఽధ భరించలేక టీఆర్‌ఎస్‌ నాయకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం అమృతండా గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై తోట మహేందర్‌, గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. అమృతండాకు చెందిన బోడ వెంకన్న(27) గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఎస్టీ మహిళకు రిజర్వ్‌ కావడం.. తన భార్య వినోదకు వయస్సు లేకపోవడంతో తన సొంత చిన్నమ్మ బోడ శాంతిని టీఆర్‌ఎస్‌ నుంచి సర్పంచ్‌గా పోటీలో నిలిపి గెలిపించుకున్నాడు. అప్పటి నుంచి గ్రామ పరిపాలన చూసుకుంటున్నాడు. కాగా సోమవారం ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వ్యవసాయ బావి వద్ద పని ఉందని భార్యకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. వ్యవసాయ బావి వద్ద ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం ఇదే తండాకు చెందిన తన మిత్రుడు జాటోతు వీరాసింగ్‌కు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నాడు. వెంటనే గ్రామస్థుల సాయంతో అక్కడికి చేరుకుని వెంకన్నను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమర్టం అనంతరం సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా మృతుడికి తల్లి అంబాలి, భార్య వినోద, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు అక్కలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వెంకన్నకు రూ.15లక్షల వరకు అప్పులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే పెద్ది పరామర్శ

వెంకన్న కుటుంబాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శించి, రూ.50వేల ఆర్థికసాయం అందించారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, పిల్లలను చదివిస్తామని భరోసా ఇచ్చారు. పరామర్శించినవారిలో ఎంపీపీ బాదావత్‌ విజేందర్‌, వైస్‌ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్‌, బుర్రి తిరుపతి, ఎంపీడీవో గడ్డం దయాకర్‌, ఆర్‌బీఎస్‌ జిల్లా డైరెక్టర్‌ తూటి శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ జక్క అశోక్‌, కుండె మల్లయ్య, అనుముల కుమారస్వామి, తొగరు చెన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు బుర్ర సుదర్శన్‌గౌడ్‌ ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయక్‌, జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్‌రెడ్డి,  బ్లాక్‌ కార్యదర్శి మంద యాకయ్యగౌడ్‌, బండి హరీష్‌, సర్పంచ్‌ సిద్దెన రమేష్‌ పరామర్శించారు. 


Updated Date - 2022-06-07T05:35:16+05:30 IST