టీఆర్‌ఎస్‌తో తెలంగాణకు ముప్పు

ABN , First Publish Date - 2022-10-05T09:16:27+05:30 IST

బీజేపీ నుంచి దేశానికి ముప్పు పొంచి ఉన్నట్టే తెలంగాణకు టీఆర్‌ఎస్‌...

టీఆర్‌ఎస్‌తో తెలంగాణకు ముప్పు

  • బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకే నాణేనికి రెండు పార్శ్యాలు
  • 6న రాహుల్‌ యాత్రకు సోనియా గాంధీ
  • దిగ్విజయ్‌ సింగ్‌, జైరాం రమేశ్‌ వెల్లడి
  • భారత్‌జోడో యాత్ర ఏర్పాట్లపై సమీక్ష 

హైదరాబాద్‌/కర్నూలు(అర్బన్‌), అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నుంచి దేశానికి ముప్పు పొంచి ఉన్నట్టే తెలంగాణకు టీఆర్‌ఎస్‌ నుంచి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్‌ జాతీయ నాయకులు, భారత్‌ జోడో యాత్ర జాతీయ సమన్వయకర్తలు దిగ్విజయ్‌ సింగ్‌, జై రాం రమేశ్‌ అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు ఒకే నాణేనికి రెండు పార్శ్యాలని విమర్శించారు. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రజల్లో ఎండగట్టేందుకు భారత్‌జోడో యాత్రను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశించనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లను మంగళవారం సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో వారు టీపీసీసీ ముఖ్యనేతలతో సమావేశమై సమీక్షించారు. అనంతరం దిగ్విజయ్‌సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌ యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోం దన్నారు. తెలంగాణ ప్రజలు రాహుల్‌ గాంధీకి అండగా నిలుస్తారనే విశ్వాసం ఉందన్నారు. ఈ నెల 6న రాహుల్‌ గాంధీ పాదయాత్రలో సోనియా గాంధీ పాల్గొంటారని తెలిపారు. 24న తెలంగాణలో ప్రవేశించే యాత్ర ప్రతి రోజూ 21 కి.మీ. మేర ఉదయం 6.30 నుంచి 10.30 వరకు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.


 ప్రతి రోజూ సాయంత్రం రాహుల్‌ వివిధవర్గాల ప్రజలతో మాట్లాడతారన్నారు. జైరాం రమేశ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ జాతీయ పార్టీ యత్నాలను దుయ్య బట్టారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌లను ఢిల్లీ సుల్తాన్‌, దక్కన్‌ నిజాం (సామంతుడు)లుగా అభివర్ణించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ బీజేపీ  దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ను లేకుండా చేయాలనే టీఆర్‌ఎ్‌స-బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొడుతారన్నారు. ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిటీల ఇన్‌చార్జి కొప్పులరాజు మాట్లాడుతూ రాహుల్‌ పాదయాత్రపై ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సహా 8 శాఖలు సమష్టిగా ప్రచారం నిర్వహిస్తాయని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి,  భట్టి విక్రమార్క,  బలరాం నాయక్‌, టి.సుబ్బరామిరెడ్డి, షబ్బీర్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు. 


కేసీఆర్‌ది టీఆర్‌ఎస్‌ కాదు వీఆర్‌ఎస్‌ 

కర్నూలు(అర్బన్‌): కేసీఆర్‌ స్థాపించబోయే పార్టీ బీఆర్‌ఎస్‌ 2024 తర్వాత వీఆర్‌ఎస్‌ పుచ్చుకోవాల్సిందేనని దిగ్విజయ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. ఏపీలోని కర్నూలు నగరంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ భయపడుతున్నాయన్నారు. 

Read more