కేంద్రంపై టీఆర్‌ఎస్‌ భగ్గు

ABN , First Publish Date - 2022-09-28T08:59:58+05:30 IST

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్‌ భగ్గుమంది.

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ భగ్గు

  • బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటనపై ఆగ్రహం
  • రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల నిరసన
  • ఖమ్మం జిల్లాలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
  • కేంద్రం ముందే చెబితే  రాష్ట్రమే నిర్మించేది
  • దమ్ముంటే మోదీ చెప్పాలి: పువ్వాడ అజయ్‌
  • ఉత్సవ విగ్రహంలా కేంద్ర మంత్రి: సత్యవతి 
  • కిషన్‌రెడ్డి రాజీనామా చేయాలి: ఎంపీ కవిత
  • ప్రజలకు క్షమాపణ చెప్పాలి: వినయ్‌భాస్కర్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్‌ భగ్గుమంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్షగట్టిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధిని చూడలేక అక్కసుతో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను, పనులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం మంత్రులు సత్యవతి రాథోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ నేతలు నిరసన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు పరిశ్రమను మంజూరు చేయలేమని, నిధులు ఇవ్వలేమని ప్రధాని మోదీ ముందే చెప్పి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్మించి ఉండేదని అన్నారు. విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కేంద్రం మరిచిపోయిందని, న్యాయవాదుల ఆందోళన ఫలితంగా హైకోర్టు విభజన జరిగింది తప్ప.. మిగిలిన హామీలన్నీ అలాగే మిగిలిపోయాయన్నారు. ప్రధానికి దమ్ముంటే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వలేమని కిషన్‌రెడ్డితో కాకుండా తన నోటితో చెప్పాలన్నారు.


 బయ్యారం ఉక్కులో నాణ్యత లేకుంటే గతంలో ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమ పెట్టేందుకు ఎందుకు ముందుకు వస్తారని, అక్కడి ఉక్కును అక్రమంగా ఎందుకు తరలిస్తారని ప్రశ్నించారు. గతంలోనే ఎన్‌ఎండీసీ బయ్యారం ఉక్కును పరిశోధించి, ఇక్కడ నాణ్యమైన ఖనిజం ఉన్నట్లు చెప్పిందని గుర్తు చేశారు.  ఉక్కు పరిశ్రమ సాధ్యం కాకపోతే కనీసం ఉక్కు దిమ్మెలు తయారు చేసే పరిశ్రమ అయినా పెట్టి ఉంటే ఈ ప్రాంత గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు లభించేవన్నారు. ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ కొత్తగూడెంలో మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల బీజేపీ వైఖరి మార్చుకోవాలని, లేదంటే ఆ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. కాగా, ఇల్లెందులో ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. హరిప్రియ నిండు గర్భవతిగా ఉండి కూడా.. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం గతంలో రెండుసార్లు ఆమె దీక్ష కూడా చేశారు. 


ఉత్సవ విగ్రహంలా కిషన్‌రెడ్డి..

తెలంగాణకు ఒకే ఒక్క కేంద్ర మంత్రి ఉన్నా.. ఎటువంటి ప్రయోజనం లేదని, ఆయన ఉత్సవ విగ్రహంలా మారారని మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు.  బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కిషన్‌రెడ్డి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది ఆయన మాటనా? కేంద్ర ప్రభుత్వ వైఖరా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కిషన్‌రెడ్డి తీరు చూస్తుంటే.. ఆయన ఈ ప్రాంతంలోనే పుట్టారా? అనే సందేహం కలుగుతోందన్నారు. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి తనకు తాను చేతకాని దద్దమ్మ అని నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం చూసి.. ఆ అక్కసుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ఆరోపించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వినయభాస్కర్‌ మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.  బీజేపీకి మునుగోడుతో పాటు ఎక్కడ ఎన్నిక జరిగినా తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కాగా, తెలంగాణకు ద్రోహం చేయడానికే కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని బండా ప్రకాశ్‌ ఆరోపించారు.. 


‘ఉక్కు’ ఆశ.. అడియాసేనా? 

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఆరు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ ఆశలు అడియాసలైనట్లేనా అని ఏజెన్సీ ప్రాంత ప్రజలు అంటున్నారు. బయ్యారం మండలంలో అపార ముడి ఖనిజ నిక్షేపాలున్నట్లు మైనింగ్‌ అధికారులు నిర్ధారించారని గుర్తు చేస్తున్నారు. ఏటా 4లక్షల టన్నులు మైనింగ్‌ చేసినా 22ఏళ్లకు సరిపడా ఖనిజ నిల్వలున్నాయని, దేశంలో లభ్యమవుతున్న ముడి ఇనుప ఖనిజంలో 11శాతం నిల్వలు ఇక్కడున్నాయని పేర్కొంటున్నారు. ఇది 60శాతం నాణ్యత కలిగి ఉన్నట్లు అధికారులు చెప్పిన విషయాన్ని వివరిస్తున్నారు. అంతేగాక ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, ఉమ్మడి జిల్లాల పరిధిలో దాదాపు 100కోట్ల టన్నుల మేర ఇనుప ఖనిజ నిల్వలున్నట్లు వెల్లడించిందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రభుత్వానికి ఆదాయంతోపాటు దాదాపు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని గుర్తు చేస్తున్నారు. అయినా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం సర్వేలు, సమీక్షలతోనే ఏడేళ్లు నాన్చి.. చివరికి పరిశ్రమ సాధ్యం కాదనడమేంటని ప్రశ్నిస్తున్నారు. 


కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణకు ద్రోహం చేయడమే: కూనంనేని

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు ద్రోహం చేయడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.  ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర విభజనలో పేర్కొన్న హామీలను సాధించే వరకు రాజ్‌భవన్‌, ఇతర కేంద్ర సంస్థల కార్యాలయాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. 

Read more