Traffic restrictions: రేపు ఇంటి నుంచి బయటకు వస్తే చుక్కలే అంటున్న హైదరాబాద్ పోలీసులు

ABN , First Publish Date - 2022-09-24T19:15:49+05:30 IST

నగరంలోని ఉప్పల్ స్టేడియంలోభారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Traffic restrictions: రేపు ఇంటి నుంచి బయటకు వస్తే చుక్కలే అంటున్న హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్: భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్(India vs Australia Cricket Match) సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. ఇంటి నుండి బయటకు వస్తే చుక్కలే అని పోలీసులు చెబుతున్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు అడుగు వేయొద్దని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నుంచి ఆటగాళ్ళను భారీ బందోబస్తు మధ్య నగరంలోని స్టార్ హోటల్‌కు తరలించనున్నారు.


ఈ క్రమంలోనే రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్(DCP Srinivas)కీలక ప్రకటన చేశారు. రేపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ జరగనున్న సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతించమని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. స్టేడియం నలువైపులా ఐదు క్రైన్లు ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్‌ నేపథ్యంలో 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసామని, గేట్ నెంబర్1 ద్వారా వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 కార్లు పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-24T19:15:49+05:30 IST