జాడలేని ఆహార సలహా సంఘాలు

ABN , First Publish Date - 2022-10-08T06:11:14+05:30 IST

జాడలేని ఆహార సలహా సంఘాలు

జాడలేని ఆహార సలహా సంఘాలు

మూడేళ్లుగా జరగని సమావేశాలు

పట్టించుకోని  పౌరసరఫరాల అధికారులు

రేషన్‌షాపులపై కొరవడిన నియంత్రణ

మధ్యాహ్న భోజనంపై నిఘా లేమి

మార్కెట్‌లో పెరుగుతున్న మోసాలు

నష్టపోతున్న వినియోగదారులు


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆహార సలహా సంఘం కమిటీలు జాడ లేకుండా పోయాయి. దీంతో ఆహార భద్రత, రవాణా, పంపిణీ, క్రయవిక్రయాలపై నియంత్రణ లేకుండా పోయింది. మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో వినియోగదారులు  దారుణంగా నష్టపోతున్నారు. 2019 నుంచి కరోనా కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా జరగలేదు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మండల, డివిజన్‌, గ్రామ స్థాయిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


హనుమకొండ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలకు బాసటగా నిలవడానికి ప్రభుత్వాలు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నాయి. గతంలో  తొమ్మిది రకాల నిత్యావసరాలను కూడా అందచేజేసేవారు. వీటి పంపిణీ తీరు, నాణ్యత, ఇతర అంశాలు చర్చించడానికి ఆహార సలహాసంఘాల సమావేశాలను ఏర్పాటు చేసేవారు. వీటిని మండల, డివిజన్‌, జిల్లాస్థాయిల్లో నిర్వహించేవారు. రేషన్‌ బియ్యం నాణ్యత, పంపిణీ తీరు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల్లో అందిస్తున్న పౌష్టికాహారం వంటి అంశాలపై సమాచాలోచనలు చేసేవారు. నాణ్యత లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేవారు. ఇంతటి కీలకమైన సంఘాలు ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి.


ప్రశ్నార్థకంగా నాణ్యత

పర్యవేక్షణ లేకపోవడంతో ఆహార నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల బియ్యం, సరుకులు నాణ్యతగా లేకపోవడంతో కొన్ని పాఠశాలల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం గురించి ప్రశ్నించేవారు లేకుండా పోయారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని రేషన్‌ దుకాణాల్లో పురుగుల బియ్యం  వస్తున్నాయని లబ్ధిదారులు ఫిర్యాదు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంతో వండిన అన్నం ముద్దగా తయారవుతోందని పేర్కొంటున్నారు. మధ్యాహ్నం భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం నాణ్యత గురించి ప్రశ్నించేవారు లేకుండాపోయారు. క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తే ఈ సమస్యలు పరిష్కారమవుతాయి.


కొరవడిన నియంత్రణ

ఆహార సలహా సంఘాలు తరుచూ సమావేశమైతే ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం కూడా ఉండేది. గతంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కమిటీలు సమావేశమై రాజకీయ పార్టీలను సైతం సమావేశానికి ఆహ్వానించి వినియోగదారులపై ధరల ప్రభావం గురించి చర్చ చేసేవారు. కొన్నేళ్లుగా ఈ సమావేశాలు జరగడం లేదు. ఏ సరుకుల ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రభుత్వ అధికార యంత్రాంగం పర్యవేక్షణ అత్యంత అవసరం. 

పౌరసరఫరాల విభాగమే ఈ పని చేయాల్సి ఉన్నా చేతులెత్తేసింది. నియంత్రణ లేకపోవడం వల్ల ప్రజలు వినియోగించే అన్ని రకాల సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.


మూడంచెల కమిటీలు

ఆహార సలహా సంఘాలు మండలం, డివిజన్‌, జిల్లా స్థాయిలో ఈ కమిటీలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, డివిజన్‌ స్థాయిలో ఆర్టీవో, మండల స్థాయిలో తహసీల్దార్లు చైర్మెన్లుగా ఉంటారు. మండలంలో ఎంపీపీ వైస్‌ చైర్మెన్‌గా, జడ్పీటీసీ సభ్యుడితో పాటు ముగ్గురు మహిళా ప్రతినిధులు, వ్యవసాయాధికారి, ఇద్దరు చొప్పున పాత్రికేయులు, ఉపాధ్యాయులు, రైతులు, ఎంపీడీవో, డీలర్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి, రాజీకీయ పార్టీల నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. జిల్లా స్థాయిలో ఆహార సలహా సంఘాల సమావేశాలను ఏడాదికోసారి, డివిజన్‌లో ఆరు నెలలకోసారి, మండల స్థాయిలో మూడు నెలలకోసారి ఏర్పాటు చేయాలి. తహసీల్దార్లు ధరణి రిజిస్ట్రేషన్లు, ఇతర పనుల్లో బిజీగా ఉండడంతో వారికి వీలుపడడం లేదు. 

Read more