జనం దృష్టిని మళ్లించేందుకే

ABN , First Publish Date - 2022-07-18T08:49:40+05:30 IST

కాళేశ్వరం పంప్‌ హౌస్‌ మునక ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్‌.. ‘క్లౌడ్‌ బరస్ట్‌ వెనుక విదేశీ కుట్ర’ వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను బట్టి.. విదేశీ కుట్రపై ఆయన వద్ద..

జనం దృష్టిని మళ్లించేందుకే

కేసీఆర్‌ విదేశీ కుట్ర వ్యాఖ్యలపై రేవంత్‌ రెడ్డి

కేసీఆర్‌ వ్యాఖ్యలు సిల్లీగా ఉన్నాయి: ఉత్తమ్‌


హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం పంప్‌ హౌస్‌ మునక ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్‌.. ‘క్లౌడ్‌ బరస్ట్‌ వెనుక  విదేశీ కుట్ర’ వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ‘సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను బట్టి.. విదేశీ కుట్రపై ఆయన వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు భావిస్తున్నాం. ఈ సమాచారాన్ని తక్షణమే నిఘా సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి  అందించాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది. లేని పక్షంలో కేంద్రమే కేసీఆర్‌ను అదుపులోకి తీసుకొని విచారించాలి. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చాలి’ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘కేసీఆర్‌.. జేమ్స్‌ బాండ్‌ 006. ఆయన ఒక రహస్యాన్ని ఛేదించారు. కేంద్రం దీన్ని సీరియ్‌సగా తీసుకోవాలి’ అని అన్నారు.


కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనూ ఈ రకంగా క్లౌడ్‌ బరస్ట్‌ జరిపితే తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో పడతాయని పేర్కొ న్నారు.  కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇద్దరూ ‘బడే మియా.. చోటే మియా’లని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గుజరాత్‌కు వరదలు రాగానే రూ.వెయ్యి కోట్లు సాయం చేసిన ప్రధాని మోదీ.. తెలంగాణకు కనీసం పరిశీలన బృందాలను కూడా పంపలేదని  విమర్శించారు. కాగా, క్లౌడ్‌ బరస్ట్‌ అంతర్జాతీయ కుట్ర అంటూ కేసీఆర్‌ చేసిన కామెంట్లు సిల్లీగా ఉన్నాయని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆయన వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగినవి కావని విమర్శించారు.


ఏ విధంగా ఆదుకుంటారు?

వరద బాధితులను ఏ విధంగా ఆదుకుంటారో కేసీఆర్‌ చెప్పాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. ‘సాయం చేయాలని కోరిన బాధితులకు సమాధానం చెప్పకుండా అరెస్టులు చేయిస్తారా’ అని మండిపడ్డారు. ‘బాధితులను ఆదుకునేందుకు వెళ్లారా.. లేక విహార యాత్రకు వెళ్లారా’ అని ప్రశ్నిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు.  

Updated Date - 2022-07-18T08:49:40+05:30 IST