ఖమ్మంలో పసిపిల్లల అమ్మకం!

ABN , First Publish Date - 2022-06-07T09:06:36+05:30 IST

శిశువులను విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ఆరు నెలలుగా నిఘా పెట్టిన అధికారులు ఈ నేరంతో సంబంధం ఉన్న ఓ మహిళ, మరో వ్యక్తిని

ఖమ్మంలో పసిపిల్లల అమ్మకం!

ఆరు నెలలుగా నిఘా పెట్టి ముఠా గుట్టురట్టు చేసిన అధికారులు

పోలీసుల అదుపులో మహిళ, మరో వ్యక్తి   


ఖమ్మం(క్రైం), జూన్‌ 6: శిశువులను విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ఆరు నెలలుగా నిఘా పెట్టిన అధికారులు ఈ నేరంతో సంబంధం ఉన్న ఓ మహిళ, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజులు కూడా నిండని పాపను అమ్మడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఖమ్మంలోని వినోద థియేటర్‌ సమీపంలో మరుగుదొడ్లను నిర్వహిస్తున్న  ఓ మహిళ, ఆమె అనుచరులు శిశువులను విక్రయిస్తున్నారని ఆరునెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా 1098కు సమాచారం వచ్చింది. దీంతో  మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఇన్‌చార్జ్‌ సీఐ నవీన్‌, సీడీపీవో కవిత అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వ్యక్తులపై నిఘా పెట్టి, మూడు నెలలు తరువాత విషయాన్ని నిర్థారించుకొని తమ సిబ్బందితో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. తమకు ఓ శిశువు కావాలంటూ ఆ మహిళను సంప్రదించారు. అందుకు అంగీకరించిన ఆ మహిళ శిశువు కావాలంటే రూ.4లక్షలు అవుతుందని తెలిపింది. తొలుత శిశువు నచ్చిన వెంటనే అడ్వాన్స్‌గా రూ.50వేలు చెల్లించాలని షరతులు పెట్టింది.


ఆ తర్వాత రోజూ ఆమె వాట్సాప్‌ ద్వారా పసిపిల్లల ఫొటోలు, రేటు, ఇతర వివరాలు పంపడం.. ఆ తర్వాత వారిని వేరొకరికి అమ్మామని.. త్వరలో మరో శిశువును ఇప్పిస్తానంటూ వాయిస్‌ మెసేజ్‌లు పంపడం వంటివి చేసేది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన ఒకామె ప్రసవించిందని, వారంరోజుల్లో డిశ్చార్జ్‌ అవుతుందని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని ఆ మహిళ అనుచరుల్లో ఒకడు వారికి తెలిపాడు. రూ.50వేలు అడ్వాన్సుగా చెల్లించాలని, కావాలంటే బాండు పేపరుపై రాసి సంతకం పెడతానని కూడా చెప్పాడు.ఈ క్రమంలో శనివారం ఆ మహిళ డిశ్చార్జి అవుతుందని తెలుసుకున్న అధికారుల బృందం అక్కడకు వెళ్లింది. కొంతసేపటి తరువాత బాండ్‌ పేపరు రాయించి ఇచ్చారు. నగదు, బాండు పేపర్లు మార్చుకుంటుండగా వారిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని విచారించారు. ఆదివారం రాత్రి పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఆ పసి పాప తండ్రిని అధికారులు అడగగా ఇదంతా నిజమేనని అంగీకరించాడు. పాపను అమ్మితే తనకు రూ.50వేలు ఇస్తామని తెలిపారని వివరించాడు.  

Updated Date - 2022-06-07T09:06:36+05:30 IST