గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఉరేసే రోజొస్తది

ABN , First Publish Date - 2022-03-20T08:56:15+05:30 IST

రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకూ కొనకపోతే గజ్వేల్‌ చౌరస్తాలో కేసీఆర్‌ను ఉరేసే రోజొస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు.

గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఉరేసే రోజొస్తది

  • రైతులు పండించిన చివరి వరి గింజ వరకూ కొనాల్సిందే.. 
  • సర్వోదయ సంకల్ప పాదయాత్రలో రేవంత్‌రెడ్డి


తూప్రాన్‌/కామారెడ్డి, మార్చి 19: రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకూ కొనకపోతే గజ్వేల్‌ చౌరస్తాలో కేసీఆర్‌ను ఉరేసే రోజొస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. వరి వేస్తే ఉరేనంటూ రైతులను హెచ్చరించిన కేసీఆర్‌ తన ఫాంహౌజ్‌లో 150 ఎకరాల్లో వరి సాగు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ సాగు చేసిన ధాన్యాన్ని కొనేవాళ్లు రైతులు 40 లక్షల ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని కూడా కొనకపోతే సంగతి చూస్తానని హెచ్చరించారు. ‘రైతులకో నీతి.. నీకో నీతా’ అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ చేపట్టిన సర్వోదయ సంకల్ప పాదయాత్ర శనివారం మేడ్చల్‌ జిల్లా అత్తెల్లి నుంచి మెదక్‌ జిల్లా కాళ్లకల్‌లోకి ప్రవేశించింది.


ఈ పాదయాత్రలో రేవంత్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు శైలాజానాథ్‌, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, హైదరాబాద్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళ్లకల్‌లో ప్రజలు, రైతులు, మహిళలను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ధరణి పోర్టల్‌ లక్షలాది కుటుంబాలను బజారు పాలు చేసిందన్నారు. కాళేశ్వరం 3వ టీఎంసీ పేరుతో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ కోసం అనేక గ్రామాలను ముంచి దళితుల్ని, గిరిజనుల్ని, లంబాడీలను కేసీఆర్‌ నిర్వాసితులను చేశారని మండిపడ్డారు. కొండపోచమ్మ సాగర్‌ కట్టినా పేదలకు నీళ్లు ఇవ్వకుండా కేవలం కేసీఆర్‌ ఫాంహౌజ్‌కే ప్రత్యేక కాలువ తవ్వించుకున్నట్లు ఆరోపించారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌లో మునిగిపోయిన పేదల భూములనే రీజనల్‌ రింగ్‌ రోడ్డు పేరుతో గుంజుకుంటున్నారన్నారు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌లోని 500 ఎకరాలను ఇక్కడి దళితులకు పంచి పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


నేడు ఎల్లారెడ్డిలో ‘మన ఊరు-మన పోరు’

 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం  ‘మన ఊరు-మన పోరు’ బహిరంగ సభను నిర్వహిం చనున్నారు. ఇందులో రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ గౌడ్‌ తదితరులు పాల్గొంటారు. మరోవైపు  మాజీ ఎంపీ వీహెచ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం పార్టీ సీనియర్‌ నేతలు సమావేశం కానున్నారు. సోనియాగాంధీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించి అధిష్ఠానానికి పంపేందుకు సమావేశం నిర్వహిస్తున్నామని చెబుతున్నప్పటికీ టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పనితీరు నచ్చని నేతలే ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది.  

Read more