నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

ABN , First Publish Date - 2022-07-05T13:29:26+05:30 IST

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం జరిగే ఈ కార్యక్రమం కోసం సర్వాంగ సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దారు..

నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

గణపతి పూజతో ప్రారంభమైన ఉత్సవాలు

వేంకటేశ్వర ఆలయం నుంచి ఎదుర్కోళ్లు

పుట్టమన్నుతో ఆలయానికి రాక

హైదరాబాద్/అమీర్‌పేట: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం జరిగే ఈ కార్యక్రమం కోసం సర్వాంగ సుందరంగా మండపాన్ని తీర్చిదిద్దారు. బోనం కాంప్లెక్స్‌ను పరిశుభ్రం చేస్తున్నారు. బల్కంపేట ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన కల్యాణ మండపం ఎదుట, వెనుక రోడ్లను బ్లాక్‌ చేసి క్యూలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. సోమవారం నుంచే భక్తుల రాక మొదలైంది. భారీ వర్షం కురిసినా భక్తులు తడవకుండా ఉండేందుకు షామియానాలు, చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు.  అర్చకులు, వేద పండితులు గణపతి పూజతో ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఎదుర్కోళ్లను ప్రారంభించి ఒగ్గు కళాకారులతో గంగతెప్ప, పుట్ట బంగారాన్ని అర్చకులు, ధర్మకర్తలు శాస్ర్తోక్తంగా ఆలయానికి తీసుకొచ్చారు. 

ఎల్లమ్మ కల్యాణం ఉత్తరా నక్షత్రయుక్త కన్యాలగ్న సుముహూర్తమున వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మంగళవారం ఉదయం 11.45 గంటలకు జరగనుంది. అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దంపతులు తీసుకురానున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.36 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును మంత్రి తలసాని సోమవారం ప్రారంభించారు. అనంతరం కల్యాణం ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రూట్‌లలో వెళ్లాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 

గ్రీన్‌ల్యాండ్స్‌, మాతా టెంపుల్‌, సత్యం థియేటర్‌ నుంచి ఫతేనగర్‌ వెళ్లాల్సిన వాహనదారులు ఎస్సార్‌నగర్‌ టీ జంక్షన్‌ నుంచి కమ్యూనిటీ హాల్‌, అలీబాషా టవర్స్‌, బీకేగూడ క్రాస్‌రోడ్స్‌, శ్రీరామ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌ ద్వారా వెళ్లాలి. 

 ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ నుంచి బల్కంపేట్‌ వెళ్లే వాహనదారులు.. న్యూబ్రిడ్జి నుంచి కట్టమైసమ్మ టెంపుల్‌, బేగంపేట్‌ వైపు వెళ్లాలి. 

 గ్రీన్‌ల్యాండ్స్‌, బకుల్‌ అపార్ట్‌మెంట్స్‌, ఫుడ్‌వరల్డ్‌ నుంచి బల్కంపేట్‌ వెళ్లే వాహనదారులు ఫుడ్‌వరల్డ్‌ క్రాస్‌రోడ్స్‌ నుంచి సోనాబాయి టెంపుల్‌, సత్యం థియేటర్‌, మైత్రివనం జంక్షన్‌ వైపు వెళ్లాలి. 

 బేగంపేట్‌, కట్టమైసమ్మ టెంపుల్‌ నుంచి బల్కంపేట్‌ వెళ్లే వాహనదారులను గ్రీన్‌ల్యాండ్స్‌, మాతా టెంపుల్‌, సత్యం థియేటర్‌, ఎస్సార్‌నగర్‌ టీ జంక్షన్‌ వైపు అనుమతిస్తారు. 

 ఎస్సార్‌నగర్‌ టి జంక్షన్‌ నుంచి ఫతేనగర్‌ వెళ్లే బైలేన్స్‌, లింక్‌ రోడ్లను మూసి వేసినట్లు ప్రకటించారు. 

 వాహనాలను ఆర్‌ అండ్‌ బి ఆఫీస్‌, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌, పద్మశ్రీ నుంచి నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి వరకు రోడ్డుపై, ఫతేనగర్‌ అండర్‌ రైల్వే బ్రిడ్జి వద్ద పార్క్‌ చేయాలని సూచించారు.

Updated Date - 2022-07-05T13:29:26+05:30 IST