Abhishek Boinapally: తిహార్‌ జైలుకు అభిషేక్‌ బోయినపల్లి

ABN , First Publish Date - 2022-11-25T04:13:16+05:30 IST

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

 Abhishek Boinapally: తిహార్‌ జైలుకు   అభిషేక్‌ బోయినపల్లి

ఈడీ కేసులో 14 రోజుల రిమాండ్‌.. నాయర్‌ కస్టడీ 2 రోజుల పొడిగింపు

త్వరలో ఈడీ చేతికి ఫోరెన్సిక్‌ నివేదిక.. నేడు సీబీఐ చార్జిషీట్‌ దాఖలు

శరత్‌రెడ్డికి ఇంటి భోజనానికి నో.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై ప్రత్యేక కోర్టు విచారణ

న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో ఆయన్ను అధికారులు తిహార్‌ జైలుకు తరలించారు. ఇదే కేసులో నిందితుడు విజయ్‌ నాయర్‌తోపాటు అభిషేక్‌ను కస్టడీలోకి తీసుకొని 10 రోజులపాటు ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. కస్టడీ గడువు ముగియడంతో గురువారం వారిద్దరినీ ఢిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట ఈడీ అధికారులు హాజరుపర్చారు. విజయ్‌ నాయర్‌ కస్టడీని మరో 5 రోజులు పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేయగా... 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే, అభిషేక్‌ను విచారించాల్సింది ఏమీ లేదని, రిమాండ్‌కు పంపించాలని ఈడీ కోరింది. దాంతో 14 రోజులపాటు రిమాండ్‌ విధిస్తూ జడ్జి నాగ్‌పాల్‌ ఉత్తర్వులు జారీచేశారు. తనతోపాటు మందులు, నీటిని వేడి చేసుకునే కెటిల్‌, మూడు పుస్తకాలు, ఉన్ని దుస్తులను జైలుకు తీసుకెళ్లడానికి అభిషేక్‌కు కోర్టు అనుమతించింది. కాగా, విచారణ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.... విజయ్‌ నాయర్‌ ల్యాప్‌టా్‌పకు సంబంధించిన నివేదిక రెండు రోజుల్లో గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబ్‌ నుంచి వస్తుందని తెలిపారు. విజయ్‌ నాయర్‌తో కలిపి విచారించడానికి మరో ముగ్గురికి సమన్లు జారీచేసినట్లు చెప్పారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న జడ్జి... ‘జైల్లో కూడా విచారించవచ్చు కదా? కస్టడీ ఎందుకు? ల్యాప్‌టాప్‌ బ్యాకప్‌ తీసుకోడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు’ అని ఈడీని ప్రశ్నించారు. హార్డ్‌డిస్క్‌, మెయిల్‌ పాస్‌వర్డ్‌లు, ఓటీపీ వంటి సాంకేతిక అంశాల వల్ల ఆలస్యమైందని ఈడీ న్యాయవాదులు తెలిపారు. వాటిని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాయర్‌ తరఫు న్యాయవాదులు వాదిస్తూ... గత 5 రోజుల కస్టడీ సమయంలో తొలి 3 రోజులు విజయ్‌ నాయర్‌ను విచారించలేదని, కేవలం చివరి 2 రోజులు మాత్రమే విచారించారని తెలిపారు. కస్టడీలోకి తీసుకోవడం ఎందుకన్న ప్రశ్నకు ఈడీ కొత్త కారణాలు లెప్పలేదని, పాత కారణాలతో మళ్లీ కస్టడీకి కోరడం సరికాదని పేర్కొన్నారు. వాదనలు విన్న జడ్జి... నాయర్‌కు మరో 2 రోజులపాటు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

అభిషేక్‌, నాయర్‌కు హైకోర్టు నోటీసులు

మరోవైపు... అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌లకు బెయిల్‌ మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయమూర్తి యోగేశ్‌ ఖన్నా... వారిద్దరికీ నోటీసులు జారీచేశారు. డిసెంబరు 1లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను అదే నెల 5కు వాయిదావేశారు. విచారణ సందర్భంగా ‘‘ఇదే కేసులో వారిద్దరు ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్నారు. బెయిల్‌ తీర్పుపై స్టే విధించాలని ఎందుకు అడుగుతున్నారు? అంత తొందర ఎందుకు? వాళ్లు సమాధానం ఇచ్చిన తర్వాత చూస్తాం’’ అని న్యాయమూర్తి ఖన్నా వ్యాఖ్యానించారు. దానికి సీబీఐ తరఫు న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ స్పందిస్తూ... బెయిల్‌ ఇవ్వడానికి కింది కోర్టు జడ్జి పేర్కొన్న కారణాలు హేతుబద్ధంగా లేవని తెలిపారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్‌ మంజూరు చేయడం సరికాదని, దాని వల్ల సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది రెబెక్కా జాన్‌ వాదిస్తూ... సీబీఐ కేసులో వారికి బెయిల్‌ మంజూరు కాగానే, మనీలాండరింగ్‌ కోణంలో విచారణ జరపడానికి ఈడీ వెంటనే కస్టడీలోకి తీసుకుందని, దీన్ని బట్టి దర్యాప్తు సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని చెప్పారు.

నేడు చార్జిషీటు దాఖలు

ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో శుక్రవారం సీబీఐ చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈ విషయాన్ని సీబీఐ తరఫున న్యాయవాది నిఖిల్‌ గోయల్‌ హైకోర్టుకు తెలియజేశారు. మొదటి అరెస్టు జరిగిన నాటి నుంచి 60 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆ గడువు శుక్రవారంతో ముగుస్తున్నందున ట్రయల్‌ కోర్టు ముందు సీబీఐ చార్జిషీటు దాఖలు చేయనుందని వివరించారు. కాగా, ఈడీ కూడా త్వరలో చార్జిషీటును దాఖలు చేసే అవకాశం ఉంది.

శరత్‌ చంద్రారెడ్డికి ఇంటి భోజనం నిరాకరణ

ఇదే కేసులో అరెస్టయి తిహార్‌ జైలులో విచారణ ఖైదీగా ఉన్న అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్‌బాబు తమకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని చేసిన అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ తిరస్కరించారు. ఈ మేరకు వారిద్దరు దాఖలు చేసుకున్న అప్లికేషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. ‘‘ప్రత్యేక ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తే తప్ప ఇంటి నుంచి భోజనం అనుమతించలేం. అలా అనుమతిస్తే ఇతర ఖైదీల మాదిరి కాకుండా, ప్రత్యేకంగా చూసినట్లవుతుంది. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సిఫార్సు చేస్తే ఆ ప్రత్యేక భోజనాన్ని జైలు వంటగదిలోనే వండేలా ఆదేశాలు ఇవ్వగలం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. కాగా, శరత్‌ చంద్రారెడ్డికి రెండు పుస్తకాలను జడ్జి అనుమతించారు. ‘‘ద ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’’, ‘‘చాణక్య నీతి’’ అనే రెండు పుస్తకాలను జైలులో ఆయనకు అందించడానికి అంగీకరించారు.

Updated Date - 2022-11-25T04:13:22+05:30 IST