RRR: ఆర్‌ఆర్‌ఆర్‌కు రాష్ట్ర వాటా జమ ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-12-10T03:31:33+05:30 IST

ప్రతిష్ఠాత్మక రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు జమ చేయకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది.

 RRR: ఆర్‌ఆర్‌ఆర్‌కు   రాష్ట్ర వాటా జమ ఎప్పుడు?

రాష్ట్రం జమ చేస్తేనే రీజనల్‌ రింగ్‌ రోడ్డు పనుల్లో పురోగతి

గ్రేటర్‌ ఉత్తర భాగం భూసేకరణకు 5,200 కోట్లు

దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,600 కోట్లు

బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయింపు

ఒక్క పైసా జమ చేయని ప్రభుత్వం

ఆ మొత్తం జమ చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లేఖ

హైదరాబాదు, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మక రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు జమ చేయకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. హైదరాబాదు చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అవతలవైపు రీజనల్‌ రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డును ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది. ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, యాదాద్రి, ప్రజ్ఞాపూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ వరకూ ఉంటుంది. దక్షిణ భాగం రోడ్డు చౌటుప్పల్‌లో మొదలై ఇబ్రహీంపట్నం, కందుకూర్‌, ఆమనగల్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డికి అనుసంధానం కానుంది. ఉత్తర భాగం నిర్మాణం కోసం దాదాపు 2 వేల హెక్టార్ల భూమి (హెక్టారుకు రెండున్నర ఎకరాలు) కావాలి. కానీ, ఆ మార్గంలో ప్రభుత్వ భూములు తక్కువగా ఉండడంతో భూ సేకరణ ఖర్చు భారీగా ఉంది. మొత్తం 162.43 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.8 వేల కోట్లు కాగా.. భూసేకరణకు రూ.5200 కోట్లు అవసరం. అంటే మొత్తం రూ.13,200 కోట్లు. నిబంధనల మేరకు భూ సేకరణలో 50 శాతం కేంద్రం భరిస్తుండగా, మరో 50 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది.

అంటే చెరి రూ.2600 కోట్లు. కానీ రాష్ట్రం ఇప్పటి వరకూ ఒక్క రూపాయీ సంబంధిత ప్రాజెక్టుకు ఇవ్వలేదు. ఉత్తర భాగం రోడ్డు భూసేకరణ కోసమంటూ బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినా.. ఆ కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో రాష్ట్రం వాటా ధనాన్ని డిపాజిట్‌ చేయాలంటూ.. నెల రోజుల క్రితం నేషనల్‌ హైవే అఽథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది. దానికీ రాష్ట్ర సర్కారు స్పందించకపోవడం గమనార్హం. ఆ నిధులను ఒకేసారి ఇవ్వలేకపోయినా, కనీసం కొంతమేర అయినా ముందుగా జమ చేస్తే పరిహారం అందించేందుకు అవసరమైన కార్యాచరణ మొదలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-12-10T03:31:34+05:30 IST