అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-11T10:14:02+05:30 IST

రాష్ట్రంలో సోమవారం అప్పులబాధతో ముగ్గురు రైతులు బలవన్మరణం చెందారు.

అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య

డోర్నకల్‌/పరకాల/ముత్తారం/కృష్ణ, అక్టోబరు 10: రాష్ట్రంలో సోమవారం అప్పులబాధతో ముగ్గురు రైతులు బలవన్మరణం చెందారు. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం లకావత్‌తండాలో రైతు లకావత్‌ రవి (45)  రెండున్నర ఎకరాల్లో పత్తి, మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం కొంత, ఇద్దరు కుమార్తెల వివాహానికి మరికొంత అప్పు చేశాడు. పంటలు సరిగా పండకపోవటంతో అప్పులు తీర్చలేమోనన్న బెంగతో పురుగుల మందు తాగాడు.  హనుమకొండ జిల్లా పరకాలలో గందెసిరి రాజు (40) కుమార్తె వివాహం కోసం మూడు లక్షల రూపాయల అప్పు చేశాడు. పంట దిగుబడి రాక పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. అప్పులు తీర్చేలేనేమోనన్న బెంగతో పురుగుల మందు తాగాడు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో తాటికొండ రాయమల్లు (70) పెట్టుబడి కోసం చేసిన ఐదు లక్షల రూపాయల అప్పు చెల్లించలేననే బెంగతో ఉరేసుకున్నాడు. కాగా, నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరులో కౌలు రైతు ప్రవీణ్‌కుమార్‌ (38) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ ఫ్యూజ్‌ వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. 

Read more