అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-03-16T09:35:31+05:30 IST
రాష్ట్రంలో మంగళవారం మరో ముగ్గురు అన్నదాతలు అప్పులకు బలయ్యారు.

మెదక్, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో విషాదం
మాసాయిపేట/మహాముత్తారం/జైనథ్, మార్చి 15: రాష్ట్రంలో మంగళవారం మరో ముగ్గురు అన్నదాతలు అప్పులకు బలయ్యారు. వ్యవసాయంలో నష్టం రావటంతో అప్పులు తీర్చే మార్గం కానరాక, అప్పులిచ్చిన వారికి సమాధానం చెప్పలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పొలిగుట్ట తండాలో కారంతోడు దశరథ(38) తనకున్న ఒకటిన్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఇటీవల ఆశించిన దిగుబడులు రాక అప్పుల పాలయ్యాడు. పెట్టుబడికి తీసుకున్న అప్పులు, కుమార్తె వివాహానికి చేసిన అప్పులు తీర్చలేమోనని బెంగ పడుతుండేవాడు. పైగా తన పొలం పోడు సమస్యకు పరిష్కారం లభించక పోవటంతో కలత చెంది ఉరేసుకున్నాడు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీకే)లో పూజారి సురేశ్ (40)తనకున్న నాలుగెకరాలకు తోడు మరో ఆరెకరాలు కౌలు వ్యవసాయం చేసేవాడు. పదెకరాల్లో మిర్చి, పత్తి, వరి నష్టపోయాడు. పెట్టుబడుల కోసం చేసిన రూ. 2 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక పురుగుల మందు తాగాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కౌటలో కదరపు నాగన్న(52) తనకున్న ఎకరం పొలంలో సాగు చేసిన పత్తి రెండేళ్లుగా నష్టాలే మిగిల్చింది. పెట్టుబడి కోసం చేసిన రూ. లక్ష అప్పు ఎలా తీర్చాలన్న ఆందోళనతో పురుగుల మందు తాగాడు.