కాళేశ్వరంలో ఇప్పటికే వేల కోట్ల అవినీతి

ABN , First Publish Date - 2022-08-18T08:03:50+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇప్పుడు పంప్‌ హౌస్‌లు మునిగిపోయాయి.

కాళేశ్వరంలో ఇప్పటికే వేల కోట్ల అవినీతి

పంప్‌ హౌస్‌ల మరమ్మతుల పేరుతో మళ్లీ జరుగుతుందికేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆరోపణకేంద్రం నుంచి పైసలొస్తలేవు.. ఏం చేద్దాం?.. ‘కాళేశ్వరం కార్పొరేషన్‌’ భేటీలో అధికారులుపనులు ముందుకెళ్లాలంటే రాష్ట్ర ప్రభుత్వమే వనరులు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయం


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇప్పుడు పంప్‌ హౌస్‌లు మునిగిపోయాయి. వాటి పునర్నిర్మాణం, మరమ్మతుల పేరుతో మళ్లీ వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది’’ అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడంలేదని, తెలంగాణకు మోదీయే ప్రధాన శత్రువని పంద్రాగస్టు వేడుకల ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆరోపించిన విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన.. ‘‘అవినీతి హద్దులు దాటినవారే తెలంగాణకు కాళేశ్వరం డ్రీమ్‌ ప్రాజెక్టు అంటూ అబద్ధాలు చెప్పారు. చట్టబద్ధమైన అనుమతులు తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ప్రయత్నించారు. మీరు వెళ్లి దాన్ని చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన పంప్‌హౌస్‌లు మునిగిపోయాయి. వేల కోట్ల రూపాయలు వెచ్చించినా.. సాంకేతికంగా వాటిని సరిగా నిర్మించలేదు. ఇప్పటికే వేల కోట్ల అవినీతి జరిగింది. ఇప్పుడా పంపుహౌస్‌లు మునిగిపోయాయి. వాటి మరమ్మతుల పేరుతో మళ్లీ వేల కోట్ల అవినీతి జరుగుతుంది’’ అని సమాధానమిచ్చారు. మరోవైపు.. కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌కు కేంద్ర విద్యుత్తు సంస్థల నుంచి రుణాలు ఆగిపోవడంతో తదుపరి చర్యలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కార్పొరేషన్‌ పాలకమండలి సమావేశం జరిగింది. దీనికి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌తో పాటు కార్పొరేషన్‌ ఎండీ, ఈఎన్‌సీ హరిరామ్‌, ఇతర డైరెక్టర్లు హాజరయ్యారు.


కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌కు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఎలకో్ట్ర మెకానికల్‌ కాంపోనెంట్‌ పనులకు పీఎ్‌ఫసీ(పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) నుంచి రూ.37,737 కోట్ల రుణం తీసుకోవడానికి ఒప్పందం కుదరగా.. అందులో నుంచి రూ.33097 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఆర్‌ఈసీ నుంచి రూ.30,536 కోట్ల రుణం మంజూరు కాగా... ఇప్పటిదాకా రూ.12742 కోట్లు చేతికి అందాయి. మిగిలిన నిధుల విడుదలకు కేంద్రం ఆంక్షలు పెట్టింది. దీంతో.. నిధుల్లేకపోతే ప్రాజెక్టుల పనుల్లో ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై పాలకమండలి సమావేశంలో చర్చించారు. పనులు ముందుకు కదలాలంటే ప్రభుత్వమే తగిన వనరులు సమకూర్చాల్సి ఉంటుందని.. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - 2022-08-18T08:03:50+05:30 IST