ఖైదీల విడుదల లేనట్లేనా!

ABN , First Publish Date - 2022-10-01T09:00:36+05:30 IST

క్షణికావేశం, తెలిసీ తెలియక చేసిన తప్పులకు ఏళ్లుగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు ప్రభుత్వం ‘క్షమాభిక్ష’తో స్వేచ్ఛను ప్రసాదిస్తుండటం ఆనవాయితీ.

ఖైదీల విడుదల లేనట్లేనా!

  • గాంధీ జయంతికై ఖైదీల నిరీక్షణ..
  • ప్రభుత్వం నుంచి వెలువడని ఉత్తర్వులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): క్షణికావేశం, తెలిసీ తెలియక చేసిన తప్పులకు ఏళ్లుగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు ప్రభుత్వం ‘క్షమాభిక్ష’తో స్వేచ్ఛను ప్రసాదిస్తుండటం ఆనవాయితీ. కానీ ఈ రూపంలో తెలంగాణ జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీల విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో ఖైదీలు, వారి కుటుంబ సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 75 ఏళ్ల భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ఆగస్టు 15న క్షమాభిక్షకు అర్హత గల ఖైదీలను విడుదల చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందకపోవడంతో వారి విడుదల వాయిదా పడింది. ఇప్పుడు గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు  ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జైళ్ల శాఖకు అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లల్లో మగ్గుతున్న 75 మంది ఖైదీలను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సీఎం అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం లభించింది. 


క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వారి విడుదలకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువడకపోవడంతో విడుదల వాయిదా పడింది. మరోవైపు అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను సైతం సిద్ధం చేసి జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. వారి విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు దఫాల్లో ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేశారు. గాంధీ జయంతి సందర్భంగా 2016, 2020లో సుమారు 400 మంది ఖైదీలు విడుదలయ్యారు. ఇప్పుడు మరోసారి క్షమాభిక్ష జాబితా రూపొందించారు. ఈసారి మొత్తంగా సుమారు 130 మంది వరకు ఖైదీలకు క్షమాభిక్ష లభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మావోయిస్టు ఖైదీలను విడుదల చేయాలని కవులు, కళాకారులు, ప్రజాసంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరాయి. జీవితకాలం శిక్ష పడిన కేసుల్లో 5 ఏళ్ల శిక్షాకాలం పూర్తయిన మహిళా ఖైదీలు, 7 ఏళ్ల శిక్షాకాలం పూర్తయిన పురుష ఖైదీలతో సహా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని క్షమాభిక్షకు అర్హులుగా ఎంపిక చేసే అవకాశముంది.

 

సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదల చేయండి: కూనంనేని

 రాష్ట్రవ్యాప్తంగా సత్ప్రవర్తన కలిగిన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. 37 జైళ్లలో 1,800 మంది జీవితఖైదీలుగా ఉన్నారని, వీరిలో కొంతమంది క్షణికావేశంలో నేరాలకు పాల్పడ్డారన్నారు. మానవతా దృక్పథంతో వారిని విడుదల చేయాలని కోరుతూ సీఎంకు కూనంనేని లేఖ రాశారు. 

Read more