విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదు

ABN , First Publish Date - 2022-09-17T08:55:50+05:30 IST

తెలంగాణ పోరాటాలగడ్డ మీద విచ్ఛినకర శక్తులకు స్థానం లేదని, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు దూసుకువెళ్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదు

  • అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రం.. 
  • కులం, మతం పేరుతో చిచ్చుకు ప్రయత్నం: కేటీఆర్‌

సిరిసిల్ల/పాలకుర్తి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పోరాటాలగడ్డ మీద విచ్ఛినకర శక్తులకు స్థానం లేదని, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు దూసుకువెళ్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కులం, మతం పేరు మీద చిచ్చుపెట్టి మనుషుల మధ్య అంతరాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలనుద్దేశించి ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానం, వేములవాడ గుడి చెరువు మైదానంలో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నాలుగు ఓట్ల కోసం హిందూ ముస్లిం, పంచాయితీ పెడుతున్నారని, గతాన్ని తవ్వి పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొడుతూ తెలంగాణ సమాజాన్ని కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేళ్లుగా గుర్తుకురాని సెప్టెంబరు 17 కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తుకొచ్చిందని, ఇద్దరు ముఖ్యమంత్రులు, హోంమంత్రి అమిత్‌షా వంటి వాళ్లు ఇక్కడకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప జరిగేది ఏమీ ఉండదన్నారు. 


హిందూ ముస్లింలు కలిసి ఉంటే రాజకీయాలు నడువవని వారు భావిస్తున్నారని, తెలంగాణలో పోటీ కార్యక్రమాలు, పోటీ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలకు పోరాటం కొత్త కాదని, ఉగ్గుపాలతోనే బిడ్డలకు పోరాటాన్ని నేర్పిన తెలంగాణ తల్లులు ఉన్న గడ్డ ఇది అని అన్నారు. 1940వ దశకంలో నిజాంకు వ్యతిరేకంగా, 50వ దశకంలో ఆంధ్రా, తెలంగాణ విలీనంపై, 1968లో తెలంగాణ కోసం పోరాటం జరిగిందని చెప్పారు. 2001 నుంచి కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. కాగా, విమోచనం పేరుతో బీజేపీ ముస్లింలను రెచ్చగొడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన వజ్రోత్సవాల్లో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంతో గాని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతోగాని బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. 


బీజేపీ ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ

సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు హాజరైన బీజేపీ ప్రజాప్రతి నిధుల చేదు అనుభవం ఎదురైంది. బీజేపీకి చెందిన కౌన్సిలర్‌ బోల్గం నాగరాజు, ఎంపీటీసీ రాము సభ వద్దకు వచ్చి ప్రజాప్రతినిధుల గ్యాలరీలో కూర్చున్నారు. పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయగా వాగ్వాదం మొదలైంది. చివరకు మునిసిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య జోక్యం చేసుకొని వారికి ఆహ్వానం ఉందంటూ వేదిక మీదికి తీసుకెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. 

Read more