అటు వరద.. ఇటు బురద

ABN , First Publish Date - 2022-07-18T08:44:04+05:30 IST

గోదావరి వరద బాధితుల కష్టాలకు అంతులేకుండా పోతోంది. పునరావాస కేంద్రాల్లోనూ వారికి ఊరట లభించడం లేదు. శనివారం రాత్రి

అటు వరద.. ఇటు బురద

మళ్లీ వర్షంతో పునరావాస కేంద్రాల్లో అవస్థలు .. లోపించిన పారిశుధ్యం

ముంపులోనే  పలు గ్రామాలు.. 

భద్రాచలంలో కాస్త మెరుగు


భద్రాచలం/ఖమ్మం (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), జూలై 17: గోదావరి వరద బాధితుల కష్టాలకు అంతులేకుండా పోతోంది. పునరావాస కేంద్రాల్లోనూ వారికి ఊరట లభించడం లేదు. శనివారం రాత్రి నుంచి ముసురు పట్టడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పునరావాస కేంద్ర పరిసరాలన్నీ బురదతో నిండపోయాయి. కాలు తీసి కాలు వేయడానికే కష్టంగా మారింది. వందల సంఖ్యలో బాధితులు ఉండటం, పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో చెత్త పేరుకుపోయింది. విద్యుత్‌ లేక దోమల బాధతో తల్లడిల్లుతున్నారు. సీఎం కేసీఆర్‌ కేవలం భద్రాచలం నన్నపనేని పాఠశాలలోని కేంద్రాన్ని మాత్రమే చూశారని, ఇతర కేంద్రాలను కూడా వచ్చి ఉంటే బాధితుల ఇబ్బందులు తెలిసి ఉండేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 87 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. భద్రాచలం పట్టణంలో కొన్ని కాలనీల్లో వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లి శుభ్రం చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో బురదమయంగా ఉండటంతో ఇళ్లల్లోకి వెళ్లలేని పరిస్థితి. చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో గ్రామాలన్నీ ముంపులోనే ఉన్నాయి. వారం రోజులుగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బంది అలసిపోయారు.  జిల్లాలో ముంపు గ్రామాల సంఖ్య మరింత పెరిగింది. మొత్తంగా 114 గ్రామాలకు ఇంకా వెళ్లే పరిస్థితి లేదు. 

Updated Date - 2022-07-18T08:44:04+05:30 IST