జాతీయ గులాబీ!

ABN , First Publish Date - 2022-09-10T08:16:17+05:30 IST

జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా. నిజామాబాద్‌ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా.

జాతీయ గులాబీ!

జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్‌.. త్వరలోనే పార్టీ ఏర్పాటు చేయడం ఖాయం


పార్టీ జిల్లా అధ్యక్షులతో చెప్పించిన టీఆర్‌ఎస్‌

జాతీయ పార్టీకి ఆయుధంగా తెలంగాణ పథకాలు

రైతు బంధు, దళిత బంధు, పింఛన్లు, ఉచిత విద్యుత్తు తదితర పథకాల దేశవ్యాప్త అమలుకు హామీలు

దళిత బంధుపై ఉత్తరప్రదేశ్‌లో బహిరంగ సభ కూడా

పెట్రోల్‌, డీజిల్‌ గ్యాస్‌ ధరలపైనా తీవ్రస్థాయిలో ధ్వజం

జాతీయ పార్టీకి కారు గుర్తు ఉండేలా పావులు బంగారు భారత్‌ కేసీఆర్‌తోనే సాధ్యం మోదీ నాయకత్వంలో వందేళ్ల వెనక్కి దేశం

దౌర్జన్యాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలి

సంపదను పేదలకు పంచాల్సిన అవసరం ఉంది

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ రావాలన్నది దేశ ప్రజలందరి కోరిక

తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది

మీడియాతో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు


హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘జాతీయ రాజకీయ ప్రస్థానం మొదలు పెడుతున్నా. నిజామాబాద్‌ సభ సాక్షిగా నిర్ణయం తీసుకుంటున్నా. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాం’’ అని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు. కొత్త జాతీయ పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. అతి త్వరలోనే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికార పార్టీ పత్రిక, చానల్‌ ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కేసీఆర్‌.. పార్టీ జిల్లా అధ్యక్షులందరితో తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశం పెట్టించి మరీ చెప్పించారు. నిజానికి, జాతీయ పార్టీ పెడతానని కొంతకాలంగా కేసీఆర్‌ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కొంత కాలంగా భారీ కసరత్తు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జాతీయ స్థాయిలో రైతు సంఘాల నాయకులతో ఇటీవల ప్రగతి భవన్లో రెండు రోజులపాటు సమావేశం నిర్వహించారు.


ఆ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తావనను కేసీఆర్‌ చేశారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ కేసీఆర్‌ను రైతు సంఘాల నాయకులు ఆహ్వానించారు. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో కలెక్టరేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లోనూ ‘జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్నారు? వెళ్దామా?’ అంటూ ప్రజలను ప్రశ్నించి సానుకూల సమాధానం రాబట్టుకున్నారు. ఇక, కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళితే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనే చర్చకు అధికార పార్టీ పత్రిక, చానల్‌ ద్వారా తెరదించారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాలనూ నిభాయిస్తారనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.


తెలంగాణ పథకాలే ప్రచార వ్యూహం

జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేసీఆర్‌.. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే ప్రధాన అస్త్రంగా చేసుకోనున్నారు. ఓటు బ్యాంకు పరంగా అధిక సంఖ్యలో ఉన్న దళితులు, రైతులను ఆకర్షించాలని భావిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే విద్యుత్తులో స్వయం సమృద్ధి సాధించామని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చామని, ఇదే పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పనున్నారు. అలాగే, దేశంలోనే తొలిసారిగా ‘రైతు బంధు’ పేరిట తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన పథకాన్నే మోదీ ప్రభుత్వం ‘పీఎం కిసాన్‌’గా అమలు చేస్తోందని, రైతు బంధు పథకాన్ని కూడా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్‌ హామీ ఇవ్వనున్నారంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ వృద్ధాప్య, వితంతు పింఛన్లు తక్కువగానే ఉన్నాయి. తెలంగాణలో ఆసరా పింఛన్ల కింద రూ.2,000 ఇస్తున్నామని కూడా కేసీఆర్‌ వివరించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ వర్గాలు తురుఫు ముక్కగా భావిస్తున్న ‘దళిత బంధు’ పథకానికి కూడా దేశవ్యాప్త ప్రచారం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపాయి. దళిత బంధు పథకానికి విస్తృత ప్రచారం లభించే వ్యూహాన్ని కేసీఆర్‌ ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన జాతీయ రైతు సంఘాల సమావేశంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన నాయకులకు ప్రత్యేకంగా దీనిని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 20 శాతం దళితులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఆ పథకానికి విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా యూపీలో బహిరంగ సభ నిర్వహించాలన్న ప్రాథమిక నిర్ణయం ఆ సమావేశంలో తీసుకున్నారు కూడా! తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు చేయడం లేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్లు, రైతు బంధు సహా వివిధ సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి. జాతీయ పార్టీకి ఇదే ప్రధాన అజెండాగా ఉండనుందని తెలిపాయి. బీజేపీ భావోద్వేగ ప్రచారానికి సంక్షేమ పథకాలతో చెక్‌ చెప్పాలని కేసీఆర్‌ భావిస్తున్నారని ఆ వర్గాలు వివరించాయి. ఇక, మోదీ పాలన తీరుపై సీఎం కేసీఆర్‌ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ బండ ధరలు దాదాపు రెట్టింపు పెరిగాయని, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అలాగే, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని, సీబీఐ, ఐటీ, ఈడీలను ప్రయోగించి పార్టీలను తమ దారికి తెచ్చుకుంటున్నారని వివరించనున్నారు.


జాతీయ పార్టీకీ కారు గుర్తే!

టీఆర్‌ఎస్‌ స్థానంలో బీఆర్‌ఎ్‌సను ఏర్పాటు చేసినా.. కొత్తగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసినా దానికి కూడా కారు గుర్తే ఉండాలని సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కారు గుర్తుతోనే విజయాలు సాధించినందున కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి కూడా అదే గుర్తుగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయంతో కేసీఆర్‌ ఉన్నారని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే, దేశవ్యాప్తంగా ఇతర పార్టీలకు వేటికైనా కారు గుర్తు ఉందా!? ఉంటే దానికి తాము తీసుకోవడానికి వీలవుతుందా? అనే అంశాన్ని పరిశీలించే బాధ్యతను ఆయన కొంతమందికి అప్పగించారని పేర్కొన్నాయి.

Updated Date - 2022-09-10T08:16:17+05:30 IST