కొండా మురళి తల్లిదండ్రుల స్మారకస్థూపం పాక్షికంగా ధ్వంసం

ABN , First Publish Date - 2022-01-23T09:18:01+05:30 IST

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌ సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.

కొండా మురళి తల్లిదండ్రుల స్మారకస్థూపం పాక్షికంగా ధ్వంసం

అగ్రంపహాడ్‌లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ ఘర్షణ   

ఆత్మకూరు, జనవరి 22: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌ సమ్మక్క-సారలమ్మ గద్దెల సమీపంలో కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపాన్ని పాక్షికంగా  ధ్వంసం చేశారు.  ఇది కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. అగ్రంపహాడ్‌లో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. జాతర నిర్వహణకు కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. ఈ పాలకవర్గం చేత అగ్రంపహాడ్‌లో ఎమ్మెల్యే ధర్మారెడ్డి శనివారం ఉదయం ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన జాతర ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న  మురళి తల్లిదండ్రుల స్మారక స్థూపంపై చర్చ జరిగినట్లు తెలిసింది. గద్దెల వద్ద  స్థూపాలు ఉండటం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.  వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికి టీఆర్‌ఎస్‌ కార్యకర్తగా చెబుతున్న వ్యక్తి పాక్షికంగా ధ్వంసం చేశాడు. స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు వచ్చి అభ్యంతరం చెప్పడంతో కూల్చివేతను ఆపివేశాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఆడియో క్లిప్‌ విడుదల చేశారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. ‘‘అరేయ్‌ ధర్మారెడ్డి... నిద్రపోతున్న పులిని తట్టి లేపావు. ఇక కాస్కో. ఏం చేస్తారో చేయండి. పాపాలు పండే రోజు వచ్చింది. ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడింది’’ అంటూ ధ్వజమెత్తారు. ఆ తర్వాత సురేఖ తన కూతురు సుస్మితా పటేల్‌, మద్దతుదారులతో కలిసి ఘటనా స్థలానికి వచ్చి స్థూపాన్ని పరిశీలించారు.

Read more