Minister Mallareddy: హైడ్రామా

ABN , First Publish Date - 2022-11-25T04:17:14+05:30 IST

మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడు, ఇతర బంధువుల ఇళ్లలో మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా.. బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది.

Minister Mallareddy: హైడ్రామా

ఐటీ అధికారుల నుంచి ల్యాప్‌టాప్‌ లాక్కెళ్లిన

మంత్రి మల్లారెడ్డి అనుచరులు

అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఘటన

కొంపల్లిలోని కుమారుడి వద్దకు అంటూ

అధికారులను తోసుకొని వెళ్లిన మల్లారెడ్డి

కానీ, బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మంత్రి

చిన్న కొడుకుతో ఐటీ అధికారులపై ఫిర్యాదు

మా అన్నతో బలవంతంగా సంతకాలు

మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి ఆరోపణ

మంత్రి అనుచరులు మా ల్యాప్‌టాప్‌ లాక్కెళ్లారు

మల్లారెడ్డి మా విధులకు ఆటంకం కలిగించారు

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐటీ అధికారులు

ఠాణా గేట్లకు తాళాలు వేసిన సీఆర్‌పీఎఫ్‌

ఇరు వర్గాల ఫిర్యాదులపై జీరో ఎఫ్‌ఐఆర్‌

సైబరాబాద్‌ పోలీసులకు కేసు బదిలీ

వర్ధమాన్‌ కాలేజీలో కొనసాగుతున్న సోదాలు

బోయినపల్లి/హైదరాబాద్‌ సిటీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడు, ఇతర బంధువుల ఇళ్లలో మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా.. బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రాత్రి 12.30కు మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిసినట్లు అధికారులు ప్రకటించి, వెళ్లిపోతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, ఐటీ అధికారులు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా మల్లారెడ్డి అనుచరులు అధికారుల ల్యాప్‌టా్‌పను తీసుకొని పారిపోయారు. మంత్రి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, బూతులు తిడుతూ తమ వద్ద ఉన్న కీలక పత్రాలను చిందరవందర చేస్తూ బీభత్సం సృష్టించారని ఓ ఐటీ అధికారి మీడియాకు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా మల్లారెడ్డి ఇంటిముందు ఘర్షణవాతావరణం నెలకొంది.

అధికారులు ల్యాప్‌టాప్‌ కోసం వెతుకుతుండగా.. ఇంతలో మంత్రి హంగామా సృష్టించారు. కొంపల్లిలోని తన కుమారుడి వద్దకు కొంతమంది ఐటీ అధికారులు వెళ్లారని, బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారని గొడవ చేశారు. వెంటనే వెళ్లాలంటూ అక్కడున్న ఐటీ అధికారులను తోసేసి, తన అనుచరులతో కలిసి బయటకు వచ్చారు. కొంపల్లి వెళ్లకుండా బోయినపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే చిన్న కొడుకు భద్రారెడ్డి అక్కడికి వచ్చి ఉన్నాడు. ఐటీ అధికారులు తమను వేధిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తన అన్నతో బలవంతంగా సంతకాలు చేయించుకున్నారంటూ భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కనీసం ‘బోయినపల్లి ఇన్‌స్పెక్టర్‌’ అని కూడా రాయకుండా ఫిర్యాదు చేయడం గమనార్హం.

స్టేషన్‌ను చుట్టుముట్టిన సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు..

మల్లారెడ్డి బోయినపల్లిలో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న ఐటీఅధికారులు.. సీఆర్‌పీఎఫ్‌ భద్రతా బలగాలతో కలిసి వెళ్లి పోలీ్‌సస్టేషన్‌ను చుట్టుముట్టారు. తమ ల్యాప్‌టాప్‌ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మల్లారెడ్డిని, ఆయన కుమారుడిని హెచ్చరించారు. ‘నా దగ్గర లేదు, నాకు తెలియదు’ అంటూ మల్లారెడ్డి పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పోలీ్‌సస్టేషన్‌ గేట్లకు గొలుసులతో తాళాలు వేసి.. ఎవరూ బయటకు వెళ్లకుండా, లోపలికి రాకుండా చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అనుచరులు తమ విధులకు ఆటంకం కలిగించారని, తన అధీనంలో ఉన్న ల్యాప్‌టా్‌పను లాక్కొని దుర్భాషలాడారని, తమను ఇంట్లో బంధించే ప్రయత్నం చేశారని ఐటీ అధికారి రత్నాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్‌లు ఎత్తొద్దంటూ ఇన్‌స్పెక్టర్‌కు ఆంక్షలు..

విషయం తెలుసుకున్న ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ అర్ధరాత్రి 1 గంటకు హుటాహుటిన స్టేషన్‌కు చేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డి కొడుకుతో కలిసి ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. అయితే ఐటీ, సీఆర్‌పీఎఫ్‌ అధికారులు మాత్రం ఇన్‌స్పెక్టర్‌, ఎస్సైల ఫోన్‌లు తీసుకొని వారి వద్ద పెట్టుకున్నారు. ఎక్కడి నుంచి ఫోన్‌ వచ్చినా ఎత్తొద్దని పోలీసులను హెచ్చరించారు. తమ వద్ద లాక్కొని వెళ్లిన ల్యాప్‌టాప్‌ సంగతి తేలాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి వెళ్లిపోయిన మంత్రి ఇన్‌స్పెక్టర్‌కు కాల్‌ చేసినట్లు తెలిసింది. ఫోన్‌లు ఐటీ అధికారుల దగ్గర ఉండడంతో ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ తీయలేదు. తర్వాత మంత్రి తన ఇంటి వద్ద ఉన్న ఓ మీడియా ప్రతినిధి ఫోన్‌ నుంచి కూడా కాల్‌ చేశారు. అయినా సీఐ ఫోన్‌ తీయలేదని విశ్వసనీయ సమాచారం.

ల్యాప్‌టా్‌పతో ప్రత్యక్షమైన అనుచరులు..

పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్న ఐటీ అధికారులు.. మంత్రి అనుచరులు లాక్కొని వెళ్లిన ల్యాప్‌టాప్‌ కోసం వేచి ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంత్రి అనుచరులిద్దరు కారులో ల్యాప్‌టా్‌పను తీసుకొచ్చారు. వారిని అదుపులోకి తీసుకున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు.. అసలైన ల్యాప్‌టాప్‌ కావాలని, అది కూడా అధికారుల నుంచి లాక్కెళ్లిన వారే తెచ్చి ఇవ్వాలంటూ మందలించి వదిలిపెట్టారు. అనంతరం 3:30 గంటలకు మరో ఇద్దరు వ్యక్తులు నంబరు లేని యాక్టివా బైక్‌పై స్టేషన్‌ వద్దకు వచ్చి ల్యాప్‌టా్‌పను ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, బలగాలు వారిని పోలీ్‌సస్టేషన్‌లోకి అనుమతించలేదు. దీంతో మల్లారెడ్డి అనుచరులు ఆ ల్యాప్‌టా్‌పను స్టేషన్‌ ముందు వదిలేసి వెళ్లిపోయారు. ఇంతలో పై అధికారుల ఆదేశాల మేరకు ఐటీ అధికారులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పోలీ్‌సస్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు. రోడ్డుమీద వదిలేసి వెళ్లిన ల్యాప్‌టా్‌పను ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పంచనామా అనంతరం సీజ్‌ చేసి స్టేషన్‌లో పెట్టారు.

సైబరాబాద్‌ పోలీసులకు బదిలీ..

ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును, మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఇరు వర్గాల ఫిర్యాదులపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేసినట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.

వర్ధమాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో సోదాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కాచారంలో ఉన్న వర్ధమాన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. ఉదయం కళాశాల ప్రధాన కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి అధికారులు ఇక్కడ సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే కళాశాలలో ఉన్న రికార్డులు, హార్డ్‌డి్‌స్కలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కళాశాల సిబ్బందిని ఎవరినీ లోపలికి అనుమతించలేదు. కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క ఐటీ అధికారుల సోదాలు, మరో పక్క కళాశాల కొనసాగుతున్నాయి. కళాశాల సిబ్బంది ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కళాశాల డైరెక్టర్లతో పాటు చైర్మన్‌ ఉపేందర్‌రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మరికొన్ని రోజులు సోదాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2022-11-25T04:17:15+05:30 IST