మన్మోహన్‌ని ప్రధాని చేసిన చరిత్ర కాంగ్రె్‌సది

ABN , First Publish Date - 2022-02-19T07:21:50+05:30 IST

ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానమంత్రిని చేసిన

మన్మోహన్‌ని ప్రధాని చేసిన చరిత్ర కాంగ్రె్‌సది

  • నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లు దేశం కోసం ఎంతో చేశారు..
  • వారిని విమర్శిస్తే కడిగిపారేస్తా: జగ్గారెడ్డి


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానమంత్రిని చేసిన చరిత్ర సోనియాగాంధీ, కాంగ్రె్‌సకు ఉందని ఆ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆడ్వాణీని పీఎం చేసే త్యాగగుణం ప్రధాని మోదీ, బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లతో దేశప్రజలకు రాజకీయ బంధం కంటే రక్త సంబంధం ఉందని చెప్పారు.  దేశ స్వేచ్ఛా, స్వాతంత్య్రం కోసం త్యాగాలతో ఏర్పడిన పార్టీ కాంగ్రెస్‌ అని చెప్పారు. దేశం కోసం ఇందిర, రాజీవ్‌లు ప్రాణ త్యాగం చేశారని కొనియాడారు. అందుకే దేశంలో, రాష్ట్ర రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌ పాత్ర గణనీయమైందని వ్యాఖ్యానించారు. విలువలు, నీతి లేని పార్టీ బీజేపీ అంటూ వ్యాఖ్యానించారు.


మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌, ప్రియాంక గాంధీలపై మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలను ఎవరు విమర్శించిన తాను కడిగిపారేస్తానని హెచ్చరించారు. రాహుల్‌, ప్రియాంకగాంధీలది లౌకిక విధానమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీలది మాత్రం మతవాద రాజకీయమని విమర్శించారు. కాంగ్రెస్‌ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీయేతర ఫ్రంట్‌ ఏర్పాటు సాధ్యం కాదని అన్నారు.  


టీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయదు

రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సతో కాంగ్రెస్‌ కలిసి పోటీ చేయదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్‌ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆరే ముందుగా స్పందించారని, అందులో తప్పేముందని అన్నారు. ఇటీవలి కాలంలో తాను సంగారెడ్డి నియోజకవర్గంలో ఎక్కుగా ఉంటున్నానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నిర్వహించిన నిరుద్యోగ ధర్నా గురించి తనకు సమాచారం లేదని వెల్లడించారు. తాను పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌నే అయినప్పటికీ, అన్ని పనులు తనకు చెప్పి చేయాల్సిన అవసరం టీపీసీసీకి ఉండదని ఆయన స్పష్టం చేశారు.


మోదీ, కేసీఆర్‌ మాట తప్పారు

యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మాట తప్పిన విషయం వాస్తవమేనని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై కేసీఆర్‌ను నమ్మలేమని, ముందస్తు ఎన్నికలవైపే ఆయన మొగ్గు చూపే అవకాశముందని చెప్పారు. సాధారణ ఎన్నికలకు వెళ్తే.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి ఉంటాయని, అందుకే కేసీఆర్‌ ముందుస్తుకు వెళ్తారని చెప్పారు. 2023 ఫిబ్రవరి, మార్చ్‌, ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి కలవటం మంచి పరిణామమేనని అభిప్రాయపడ్డారు.  


Read more