అన్నంలో పురుగులు పప్పులో వానపాములు

ABN , First Publish Date - 2022-07-30T08:55:41+05:30 IST

గురుకుల విద్యార్థులు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తున్నారు! అతి కష్టమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో విజయ పతాక ఎగరేసి ఐఐటీల్లో సీట్లను సాధిస్తున్నారు! లక్షల మంది విద్యార్థుల కలల పరీక్ష నీట్‌ను..

అన్నంలో పురుగులు పప్పులో వానపాములు

ఉదయం మిగిలిన కూర రాత్రి వంటలో

వండిన పాత్రలు కడగకుండానే మళ్లీ వంట

గురుకులాల్లో జరుగుతున్న ఘోరాలెన్నో!

సరుకుల నాణ్యతపై ఎన్నో ఆరోపణలు

విద్యార్థుల ప్రాణాలతో సర్కారు చెలగాటం

రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ఘటనలు

కొద్ది రోజుల్లో వందలాదిమంది ఆస్పత్రిపాలు

మెస్‌ కమిటీలు ఉన్నా తూతూమంత్రమే

ప్రధానోపాధ్యాయులు రుచి చూడాలన్న 

నిబంధన ఉత్తర్వుల జారీ వరకే పరిమితం


హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): గురుకుల విద్యార్థులు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తున్నారు! అతి కష్టమైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో విజయ పతాక ఎగరేసి ఐఐటీల్లో సీట్లను సాధిస్తున్నారు! లక్షల మంది విద్యార్థుల కలల పరీక్ష నీట్‌ను గెలిచి మెడికల్‌ కాలేజీల్లో అడుగు పెడుతున్నారు! వివిధ క్రీడల్లో పోరాడి పతకాలను గెలుచుకుంటున్నారు! కానీ, బుక్కెడు బువ్వ కోసం గురుకులాల్లో వారంతా అంతకంటే ఎక్కువ పోరాటమే చేయాల్సి వస్తోంది! ఒకచోట పాచిపోయిన కూర పెడుతున్నారు! మరోచోట పురుగుల అన్నం తినమంటున్నారు! తాజాగా, పాలకూర పప్పులో ఏకంగా వానపామునే వడ్డించేశారు! ఫలితంగా, రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకులాల్లోని వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.


అస్పత్రుల పాలయ్యారు! కలుషిత ఆహారం తిని రోగాల బారిన పడుతూనే ఉన్నారు. గురుకులాలు తెరిచిన తర్వాత వరుసగా ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వారంలో ఎక్కడో అక్కడ విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతూనే ఉన్నారు. తాజాగా, మహబూబాబాద్‌ జిల్లా మానుకోట గిరిజన బాలికల గురుకులంలో కలుషిత ఆహారం తిని 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. గురువారం మధ్యాహ్నం విద్యార్థులకు అందించిన పాలకూర పప్పులో వానపాములు ఉండటంతో ఆహారం కలుషితమై ఒక్కొక్కరుగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నిజానికి, ఇటీవలే ఆసిఫాబాద్‌ జిల్లా కొటాల మండలం మొగడ్‌దగడ్‌ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించారు. అంతకుముందు నాలుగు రోజుల కిందట సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో వంకాయ కూరలో అంతకు ముందు రోజు మిగిలిపోయిన చికెన్‌ గ్రేవీని కలపడంతో అది తిన్న 150 మంది అస్వస్థతకు గురయ్యారు.


ఈ రెండు ఘటనలు వెలుగు చూసిన తర్వాత మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించారు. గురుకులాల్లో నాణ్యమైన, పరిశుభ్ర ఆహారం అందించాలని ఆదేశించారు. అయినా, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదని చెప్పేందుకు తాజా ఘటన నిదర్శన. పాఠశాలలను ప్రారంభించినప్పుడు ఆహారాన్ని ప్రధానోపాధ్యాయులు రుచి చూడాలంటూ నామ్‌కే వాస్తే ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, దాని అమలుపై మాత్రం పట్టింపు లేదు. విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడు వారిపై చర్యల్లేవు. అన్నంలో వెంట్రుక వస్తేనే అసహ్యించుకుంటాం. దానిని మొత్తంగా తీసిపారేస్తాం. అటువంటిది అన్నంలో పురుగులు, వానపాములు వస్తే దానిని పిల్లలు ఎలా తింటారన్న కనీస అవగాహన కూడా ఉండడం లేదు.


హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని, పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ, కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్న ఘటనలు కూడా పదే పదే జరుగుతున్నాయి. పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. దాంతో, గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పిల్లలు కొత్త జబ్బుల బారినపడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిలో చాలామంది గ్యాస్ట్రిక్‌ సమస్యల బారిన పడుతున్నారు. చాలా సందర్భాల్లో దీనిని చిన్నపాటి కడుపు నొప్పిగా సర్దిచెబుతున్నా.. పరిస్థితి మరీ విషమించిన సందర్భాల్లోనే కలుషిత ఆహారం వ్యవహారం వెలుగులోకి వస్తోంది.


ఉదయం మిగిలిన కూర రాత్రి వంటలో..

గతంలో ఒక్కో గురుకులంలో ఒక్కో తరహా డైట్‌ విధానం అమల్లో ఉండేది. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో ఒకే రకమైన డైట్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటర్‌ చదివే ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.38, కేవలం ఇంటర్‌ కాలేజీలే ఉన్నచోట ఒక్కో విద్యార్థికి రూ.48 చొప్పున డైట్‌ చార్జీ చెల్లిస్తున్నారు. వీటితో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి భోజనం అందించాలి. నెలలో నాలుగుసార్లు చికెన్‌, రెండుసార్లు మటన్‌ అందివ్వాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఇవి సరిగా అమలు కావడం లేదు. రోజూ గుడ్డు ఇవ్వాల్సి ఉంది. వాటి ధరలు పెరిగినప్పుడు, మాంసాహారం అందించినప్పుడు గుడ్లు ఇవ్వడం లేదు.


చాలాచోట్ల వంట కోసం నాణ్యమైన సరుకులు ఉపయోగించడం లేదనే ఆరోపణలున్నాయి. వంటకు ఉపయోగించే పాత్రలను సరిగా శుభ్రం చేయడం లేదని చెబుతున్నారు. ఒక పూట వండిన పాత్రల్లోనే మరో పూట వండడం; ఒకే పాత్రను ఏళ్ల తరబడి ఉపయోగిస్తుండడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని చెబుతున్నారు. అంతేనా, మధ్యాహ్నం మిగిలిన కూరలను రాత్రి వండే వాటిలో కలపడం, రాత్రి మిగిలిన వాటిని ఉదయం వంటలో కలపడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. గత నెలలో సిద్దిపేటలో విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి ఇదే కారణంగా తేల్చారు. రాత్రి భోజనం తర్వాతే చాలా గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం ఈ సందర్భంగా గమనార్హం. మధ్యాహ్న భోజన సమయంలో సాధారణంగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చే అవకాశం ఉంటుందని కొంత వరకు అప్రమత్తంగా ఉంటారు. కానీ, రాత్రి భోజన సమయంలో తనిఖీల భయం ఉండదు. దీంతో వంట సమయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు.

మెస్‌ కమిటీలున్నా..

ప్రతి గురుకులంలో నిబంధనల ప్రకారం మెస్‌ కమిటీ ఉంటుంది. టీచర్లతోపాటు పీఈటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌, సీనియర్‌ విద్యార్థులు కమిటీలో ఉంటారు. ఆహారం రుచి, నాణ్యతను ఈ కమిటీ పరిశీలించాలి. కానీ, ఈ విఽధానం గురుకులాల్లో సరిగా అమలు కావడం లేదనేందుకు కలుషితాహారం ఘటనలే నిదర్శనం. గురుకులాల్లో విద్యార్థులకు ఆహారం అందించడానికి ముందు ఉపాధ్యాయులు రుచి చూసి నాణ్యత పరిశీలించాలనే నిబంధన ఉన్నా.. అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. వంటకాలకు ఉపయోగించే కూరగాయలు, వంట సామాగ్రిని నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలు కలిగినవి ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిరంతర పర్యవేక్షణ చేయాలి. కానీ, ఎవరూ అటువైపు తొంగి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.


విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలెన్నో!

  • హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలోని మహాత్మాజోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈనెల 20న 9, 10వ తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
  • మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని బోయపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 4న మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉడికీ ఉడకని అన్నం తినడం వల్లే ఇలా జరిగిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు.కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
  • నిర్మల్‌ జిల్లా భైంసాలోని కేజీబీవీలో ఈనెల 4న పురుగుల అన్నం తిని తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
  • ముథోల్‌ మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 20వ తేదీన అన్నంలో పురుగులు రావడంతో పాటు ఐదు రోజులుగా మంచినీటి సమస్య తలెత్తింది. దీంతో విద్యార్థులు రోడ్డెక్కారు.
  • ఈనెల 27న గూడూరులోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో పీహెచ్‌సీకి తరలించారు.
  • ఈనెల 1న ఆసిఫాబాద్‌ జిల్లా కొటాల మండలం మొగడ్‌దగడ్‌ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం వడ్డించారు. దానిని తినేందుకు విద్యార్థులు నిరాకరించారు. ఐటీడీఏ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించి నాసిరకం భోజనం విద్యార్థులకు అందిస్తున్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.
  • జూన్‌ 26న సిద్దిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో వంకాయ కూరలో మిగిలిపోయిన చికెన్‌ గ్రేవీ కలపడంతో అది తిన్న 150 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
  • జూన్‌ 26న గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
  • గద్వాల జిల్లా గట్టులోని బాలికల గురుకుల పాఠశాలలో గత నెలలో కలుషిత ఆహారం తినడం వల్ల 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో పదిమందికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించారు.
  • మూడు నెలల కిందట నల్లగొండ జిల్లా దామరచర్ల గిరిజన గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
  • మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం సీరోలులోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో మార్చి 18న కలుషిత ఆహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
  • ఫ గత ఫిబ్రవరిలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులతోపాటు నలుగురు ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు.
  • ఐదు నెలల కిందట ఖమ్మం జిల్లా తనికెళ్లలోని గిరిజన మహిళా డిగ్రీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 100 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

Updated Date - 2022-07-30T08:55:41+05:30 IST